నల్లబజారుకు సబ్సిడీ ఎరువులు | Nallabajaruku fertilizer subsidy | Sakshi
Sakshi News home page

నల్లబజారుకు సబ్సిడీ ఎరువులు

Published Sun, Jan 4 2015 2:37 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

నల్లబజారుకు సబ్సిడీ ఎరువులు - Sakshi

నల్లబజారుకు సబ్సిడీ ఎరువులు

ధర్మవరం : ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు సబ్సిడి ఎరువుల సైతం అందుబాటులోకి రాకుండా ఫెర్టిలైజర్ వ్యాపారులు  గద్దలా తన్నుకుపోతున్నారు. అరికట్టాల్సిన అధికారులు కుమ్మక్కై వ్యాపారులకే వంత పాడుతున్నారు. ప్రభుత్వం డీసీఎంఎస్ సొసైటి నుండి సబ్సిడితో అందిస్తున్న ఎరువులను బినామీ రైతుల పేరుతో తరలించి అధిక ధరలకు విక్రయించి ఫెర్టిలైజర్స్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను సాక్షి బట్టబయలు చేసింది.

వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని డీసీఎంఎస్ సొసైటిలో రెండు కంపెనీలకు చెందిన ఎరువులను సబ్సిడితో రైతులకు అందిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున, ఇప్కో కంపెనీల యూరియాలను మార్కెట్ ధర కంటే తక్కువగా రైతులకు అందిస్తున్నారు. ఒక్కో రైతుకు పాసుపుస్తకానికి మూడు బస్తాల చొప్పున అందిస్తారు. ఇదే అదునుగా చేసుకున్న వ్యాపారులు బినామీ పాసు పుస్తకాలతో ప్రతి రోజు వంద నుండి రెండు వందల బస్తాలు నల్లబజారుకు తరలిస్తున్నారు.

అక్రమ దందా సాగుతోంది ఇలా..
పట్టణంలో దాదాపు పదికి పైగా ఫెర్టిలైజర్స్ దుకాణాలు ఉన్నాయి. వీరు కొంత మంది రైతులు పాసు పుస్తకాల జీరాక్స్‌లను సేకరించుకుని బినామీ పేర్లతో ప్రతి రోజు 50 నుండి వంద బస్తాలు యూరియాను ఫెర్టిలైజర్స్ దుకాణాలకు చేరవేస్తున్నారు. డీసీఎంఎస్ ఉన్నతాధికారులు అండ పుష్కలంగా ఉండటంతో వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. సాధారణ రైతులకు సవాలక్ష ఆంక్షలు పెట్టి ఎరువులను అందించే అధికారులు వ్యాపారులకు మాత్రం అడిగిందే తడవుగా బస్తాలకు బస్తాలు సరఫరా చేస్తున్నారు.

ఈ దందాపై పక్కా సమాచారం అందుకున్న ‘సాక్షి’ వీరి బండారాన్ని బయట పెట్టింది. పట్టణానికి చెందిన చిలమకూరి శంకరయ్య ఫెర్టిలైజర్ నిర్వాహకుడు డీసీఎంఎస్ ఆవరణంలో ఒక ఎడ్లబండిపై దాదాపు 50కి పైగా యూరియా బస్తాలు నింపుకుని డీసీఎంఎస్ నుండి ఫెర్టిలైజర్స్ షాపుకు తీసుకువెళ్లారు. అక్కడి నుండి ఫెర్టిలైజర్స్ షాపుకు వెళ్లిన ఎడ్లబండి నుంచి షాపులోకి అన్‌లోడ్ చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఏవో శ్రావణ్ కుమార్‌కు దృష్టికి సాక్షి తీసుకు వెళ్లగా విచారణ చేయిస్తామని తెలిపారు.

అనంతరం షాపు యజమానిని ఎరువులు ఎక్కడి నుండి తెచ్చారని సాక్షి ప్రతినిధులు ప్రశ్నించగా సదరు షాపు యజమాని ఎదో కరువు కాలం వ్యాపారాలు లేవు. డీలర్ వద్ద కొనుగోలు చేస్తే లాభం ఉండదని జవాబిచ్చాడు. తాను మాత్రమే ఈ ఎరువులను కొనడం లేదని అందరూ చేస్తున్న వ్యాపారమే తాను చేస్తున్నానని జవాబిచ్చాడు. అంతలోనే వ్యవసాయ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి నుండి ఫోన్ రావడంతో హుటాహుటిన షాపుకు తాళం వేసి అన్‌లోడ్ చేసిన బస్తాలను తిరిగి డీసీఎంఎస్ కార్యాలయానికి పంపించి వేశారు.

ఈ దందా ద్వారా లక్షల రూపాయలు వ్యాపారులు గడిస్తున్నారని రైతు సంఘం నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్ ద్వారా వ్యాపారులు ఓక్కో బస్తా రూ.284కు కొనుగోలు చేసి ఫెర్టిలైజర్ షాపుల ద్వారా బహిరంగ మార్కెట్‌లో ఒక్కో బస్తా డిమాండ్‌ను బట్టి రూ.350 నుండి 370వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కట్టడి చేయాల్సిన అధికారులు మాత్రం వ్యాపారుల ప్రలోభాలకు లొంగి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చిత్తశుద్దితో పనిచేస్తే దుకాణాలు తనిఖీ చేసేటప్పుడు స్టాక్ రిజిష్టర్‌లో కూలంకషంగా పరిశీలిస్తే వీరి దందా బట్టబయలవుతుంది. పట్టణంలో ఇంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క దుకాణాదారుడిపైన వ్యవసాయ శాఖాధికారులు  చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement