విత్తనాలు, ఎరువులపై నిఘా
♦ పక్కదారి పట్టకుండా చెక్
♦ ప్రతి దుకాణానికి అధికారి నియామకం
♦ కొనుగోళ్లపై పర్యవేక్షణ బాధ్యత వారిదే
♦ సబ్ డివిజన్ల వారీగా జాబితాలు సిద్ధం
♦ 15 తర్వాత పకడ్బందీగా అమలు
ఎట్టకేలకు అధికారులు మేల్కొన్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో జిల్లాలో ఏటా ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి జిల్లా అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ప్రతి రైతు అవసరాలు తీరేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ప్రతి దుకాణంపై నిఘా కొనసాగించే క్రమంలో ఇన్‌చార్జీలను నియమించనున్నారు. సదరు అధికారి క్రయవిక్రయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఈ రకంగా రైతులకు కొంతవరకైనా మేలు జరిగే అవకాశం ఉంది.
గజ్వేల్: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 5.40 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. ఇందులో భాగంగానే పత్తి, వరి 90వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.30 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. ఏటా 1.25 లక్షల హెక్టార్లలో సాగయ్యే పత్తి ఈసారి తగ్గనుందని భావిస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో కూరగాయలు, ఇతర పంటలు సాగవుతాయని అంచనా.
ఇందుకోసం అన్ని విత్తనాలు కలుపుకొని 80 వేల క్వింటాళ్లు, సీజన్ ముగిసే సరికి కాంప్లెక్స్, యూరియా తదితర ఎరువులు కలుపుకొని 1.70 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించారు. సరైన కేటాయింపులు లేక ఏటా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు తమ ఇష్టానుసారంగా పంపిణీ చేయడం వల్ల విత్తనాలు, కాంప్లెక్స్, యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తలెత్తేవి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసే క్రమంలో జిల్లా అధికారులు ఈసారి పకడ్బందీగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయడానికి చర్యలకు ఉపక్రమించారు.
నిత్యం పర్యవేక్షణ..
ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువుల దుకాణాలపై నిఘా పెంచే క్రమంలో మూడు నుంచి ఆరు దుకాణాలకో అధికారిని ఇన్‌చార్జిగా నియమించనున్నారు. వ్యవసాయశాఖకు చెందిన వారు కాకుండా రెవెన్యూ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించనున్నారు. వీరు ఆయా దుకాణాల్లో నిత్యం క్రయవ్రియాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువుల పంపిణీ సందర్భంగా ప్రతి రైతు పట్టెదారు పాసుపుస్తకం నెంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రైతుకున్న భూవిస్తీర్ణాన్ని బట్టి విత్తనాలు, ఎరువుల పంపిణీ చేస్తారు. నిబంధనలు పాటించని దుకాణదారునిపై సంబంధిత ఏఓకు లేదా ఏడీఏకు ఇన్‌చార్జి అధికారులు రిపోర్ట్ చేయగానే తక్షణ చర్యల తీసుకునేలా ఆదేశాలివ్వనున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే లెసైన్స్ సస్పెండ్ చేయడమో లేదా క్రిమినల్ చర్యలకు వెనకాడవద్దని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని వ్యవసాయ సబ్ డివిజన్ల నుంచి ఏడీఏలు, రెవెన్యూఅధికారులతో కలుపుకొని జాబితాను తయారు చేసి జేడీఏ కార్యాలయానికి అందజేశారు. దీని ప్రకారం 15వ తేదీ తరువాత ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పక్రియను సమర్థంగా అమలు చేసి తమ ఇక్కట్లు తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు.