
రాష్ట్రానికి పంగ'నామా'లు
తక్కువ ధర ఉన్నప్పుడు రాష్ట్రానికి విద్యుత్ విక్రయం
అధిక ధర ఉన్న వేసవిలో కేరళకు విక్రయించేందుకు యత్నం
మొదటి తిరస్కార హక్కునూ తోసిరాజంటున్న వైనం
టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత నామా సంస్థ తీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడినా ఫర్వాలేదు.. రైతుల పంటలు ఎండిపోతే నాకేం... నా వ్యాపారం బాగుంటే చాలంటున్నట్లు వ్యవహరిస్తున్నారు టీడీపీ పార్లమెంటరీ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. రాష్ట్రానికి పంగనామాలు పెట్టయినా సరే అధిక ధరకు విద్యుత్‌ను కేరళకు విక్రయించేందుకు పావులు కదిపారు. మార్కెట్లో విద్యుత్ ధరలు తక్కువ ఉన్న సమయం జూలై నుంచి జనవరి వరకు మాత్రమే రాష్ట్రానికి విక్రయించి... అధిక ధరలు ఉన్న ఫిబ్రవరి నుంచి మే వరకు బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఒప్పందం మేరకు రాష్ట్రానికి ఉన్న ‘మొదటి తిరస్కార హక్కు’నూ కాదం టూ ముందుకు కదిలారు. రాష్ట్రానికి పంగ‘నామా’లు పెడుతున్న మధుకాన్ సంస్థ వ్యవహరిస్తున్న తీరు ఇదీ!
2013 జూన్ నుంచి 2014 మే వరకు విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ సంస్థలు టెండర్లు పిలిచాయి.
2013 జూలై నుంచి 2014 జనవరి వరకు మాత్రమే విద్యుత్‌ను విక్రయిస్తామని మధుకాన్ పేర్కొంది. ఈ సమయంలో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ ధర తక్కువగా ఉంటుంది. 2013 జూన్ నుంచి 2014 మే వరకు విద్యుత్‌ను ఇచ్చే ఇతర ప్రైవేటు సంస్థలతో పాటుగా మధుకాన్ కూడా ఏకంగా యూనిట్‌కు రూ. 5.45 పొందింది.
ఫిబ్రవరి నుంచి మే వరకు విద్యుత్‌ను మార్కెట్‌లో మధుకాన్ విక్రయించాలని భావిస్తే.. మొదటి తిరస్కార హక్కు (ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్) విద్యుత్ సంస్థలకే ఉంటుందని ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది.
ఠ ఒప్పందాన్ని తోసిరాజంటూ ఫిబ్రవరి నుంచి మే వరకూ కేరళకు విక్రయించేందుకు వీలుగా ఆ రాష్ట్రం పిలిచిన టెండర్లలో పాల్గొంది. ఎందుకంటే ఈ కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల యూనిట్ ధర అధికంగా ఉంటుంది.
ధర తక్కువగా ఉండే కాలంలో రాష్ట్రానికి అమ్మి ఎక్కువ ధరను, ధర ఎక్కువగా ఉండే కాలంలో బయట విక్రయించి అధిక రేటును కొట్టేసేందుకు మధుకాన్ పన్నాగం పన్నింది.
మొదటి తిరస్కార హక్కు ద్వారా రాష్ట్రానికే విద్యుత్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇంధనశాఖ అధికారులు అంటున్నారు.
సకలజనుల సమ్మెలోనూ ఇంతే...!
సకల జనుల సమ్మె కాలంలో మధుకాన్ సంస్థ ఇదే తీరు కనబర్చింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ 2012 సెప్టెంబర్‌లో జరిగిన సకల జనుల సమ్మె సందర్భంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా నిలిచిపోయి విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది.
ఈ సమయంలో మధుకాన్ సంస్థ బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను విక్రయించింది.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికే విద్యుత్‌ను ఇవ్వాలని విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు ఏకంగా మధుకాన్ సంస్థ యజమాని, ఖమ్మం ఎంపీ అయిన నామా నాగేశ్వరరావుకు స్వయంగా ఫోన్ చేసినా ససేమిరా అన్నారు.
వ్యాపారం, రాజకీయాలు వేర్వేరు అని అధికారులకు హితబోధ కూడా చేశారు.
ఇప్పుడు కూడా అదీ... మొదటి తిరస్కార హక్కును కాదని కేరళకు విక్రయించేందుకు సిద్ధపడటంపై విద్యుత్ సంస్థలు మండిపడుతున్నాయి. గతంలో సదరు సంస్థ వ్యవహరించిన తీరును దృష్టిలో పెట్టుకునే మొదటి తిరస్కార హక్కును ఒప్పందంలో చేర్చినట్టు ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి.