కరువు రైతు కన్నెర్ర
కరువు రైతు కన్నెర్ర
Published Fri, Jan 6 2017 10:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- హాలహర్విలో రోడ్డుపై బైఠాయింపు
- నష్టపరిహారం మంజూరు చేయలేదంటూ ఆందోళన
- జన్మభూమి అధికారులను అడ్డుకున్న వైనం
హాలహర్వి : కరువు కారణంగా పంటలు పండక అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం రైతులు కన్నెర్రజేశారు. సాగుచేసిన పంటలు ఎండిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయినా కనీసం నష్టపరిహారం కూడా మంజూరు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హాలహర్వికి చెందిన రైతులు శుక్రవారం జన్మభూమి–మాఊరు కార్యక్రమానికి వెళ్తున్న అధికారులను అడ్డుకున్నారు. పరిహారం మంజూరు చేసే వరకు కదిలేదంటూ భీష్మించుకు కూర్చున్నారు.
ఈ సందర్భంగా రైతులు వెంకటేష్‌రెడ్డి, మోహన్, భీమప్పచౌదరి, గోపాల్, రామచంద్రయ్య తదితరులు మాట్లాడుతూ మూడేళ్ల నుంచి హాలహర్విలో సరైన వర్షాలు కురకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. 2014, 2015 సంవత్సర పంట నష్టపరిహారం జాబితాలో అధికార పార్టీ అనుకూలమైన రైతుల పేర్లు తప్ప ఇతరులు లేరన్నారు. హాలహర్విలో 3 వేల ఎకరాల సాగు భూమి ఉండగా 200 ఎకరాలకు మాత్రమే పరిహారం మంజూరైందని, అది కూడా అనర్హులకు దక్కిందని ఆరోపించారు. అధికారుల పనితీరు వల్లే అర్హులకు పరిహారం అందడంలేదని వారు వాపోయారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నా నిర్వహించడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ రాముడు, ఏఓ దేవభూషణ్‌కుమార్ అక్కడకు వచ్చి రైతలకు నచ్చజెప్పారు. పరిహారం మంజూరు జాబితాలో అనర్హుల పేర్లున్నాయన్న విషయాన్ని జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు వీరారెడ్డి, లక్ష్మినారాయణ, చెన్నయ్య, హనుమంతరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement