
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో వైఎస్ జగన్‌పై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు.. ప్రతిష్టను దెబ్బ తీసినందుకు పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
(కాగా ఆంధ్రజ్యోతి పత్రికలో.... అసత్యాలతో కూడిన, పరువుకు నష్టం కలిగేలా ప్రధాన మంత్రికి జగన్‌మోహన్‌రెడ్డి సమర్పించిన వినతిపత్రం విషయమై ‘అమ్మ జగనా..’ అంటూ మే 15న తప్పుడు కథనం ప్రచురించారు. వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు, అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధలు, మిర్చి రైతుల దుస్థితి, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి తదితర అంశాలపై వైఎస్ జగన్.. ప్రధాన మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అయితే జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమోదైన కేసులకు సంబంధించి వినతిపత్రం సమర్పించినట్లు రాధాకృష్ణ ఆ కథనంలో రాయించారు.
ఆ వినతిపత్రంలో గౌరవనీయులైన నరేంద్రమోదీ జీ అని సంబోధిస్తే, ఆంధ్రజ్యోతి మాత్రం ఎక్స్‌లెన్సీ (సర్వశ్రేష్ట) అని రాసినట్లు తన కథనంలో పేర్కొంది. ఈ కథనంపై వైఎస్సార్‌సీపీ పత్రికా సమావేశం పెట్టి వాస్తవాలను వివరించింది. ప్రధానమంత్రికి ఇచ్చిన వినతి పత్రాన్ని చూపించింది. అయితే ఈ విషయాలను తన పత్రికలో ప్రచురించని రాధాకృష్ణ.. ఆ కథనానికి కొనసాగింపుగా ‘పాత లేఖ పేరిట వైసీపీ కొత్తపాట’ అంటూ మరో కథనం వండి వార్చారు. జగన్.. ప్రధానిని కలవడం ఓర్చుకోలేకే రాధాకృష్ణ.. తన బృందం ద్వారా తప్పుడు కథనం రాయించి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఈ కథనం ప్రచురితం కావడానికి రాధాకృష్ణతో పాటు ఆ పత్రిక ఎడిటర్, ఏపీ, తెలంగాణ బ్యూరో ఇన్‌చార్జ్, ఓ రిపోర్టర్ బాధ్యులు. వీరందరికీ సమన్లు జారీ చేయాలి’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తదుపరి చర్యల్లో భాగంగా తొలుత ఆళ్ల వాంగ్మూలం నమోదు ఆదేశించిన విషయం విదితమే.)
Comments
Please login to add a commentAdd a comment