నందిగామలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, వాగులకు భారీగా వరదనీరు చేరింది. గురువారం రాత్రి 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
- పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం
- తీవ్రరూపం దాల్చుతున్న వైరా, కట్టలేరు, మరగమ్మ వాగు
- రోడ్లపైకి చేరుతున్న నీటి ప్రవాహం
- ఇబ్బందులు పడుతున్న ప్రయూణికులు
నందిగామ రూరల్ : నందిగామలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప నదులు, వాగులకు భారీగా వరదనీరు చేరింది. గురువారం రాత్రి 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరుసగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాల పరిధిలో ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వైరా, కట్టలేరు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ మండలం కూడళి సమీపంలో వైరానది చప్టాపై నుంచి ప్రవహిస్తుండటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వైరానదికి మరింత వరదనీరు వచ్చే ప్రమాదం ఉండటంతో చప్టాపై నుంచి వెళ్లేందుకు సాహసం చేయవద్దని నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావు ప్రయాణికులకు సూచించారు. అనాసాగరం సమీపంలో మరగమ్మ వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో నందిగామ నుంచి శనగపాడు మీదుగా పెనుగంచిప్రోలు వెళ్లే రహదారిలో ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో అవస్థలు పడుతున్నారు.