కడుపులో బిడ్డకూ కూలి | Nandyal Thimmaraju Inscription In Kurnool District | Sakshi
Sakshi News home page

కడుపులో బిడ్డకూ కూలి

Published Thu, Jan 2 2020 8:44 AM | Last Updated on Thu, Jan 2 2020 8:44 AM

Nandyal Thimmaraju Inscription In Kurnool District - Sakshi

పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. వారి పాలనాకాలంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన మంచి కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. అవుకును పాలించిన తిమ్మరాజు.. కూలి పనులకు వచ్చే గర్భిణులకు ఒకటిన్నర కూలి ఇవ్వాలని శాసనం చేశారు. ఇది ఇప్పటికీ  కొనసాగుతోంది.

సాక్షి, కొలిమిగుండ్ల: అవుకు రాజ్యంలో నంద్యాల, తాడిపత్రి, గండికోట, గుత్తి వరకు సరిహద్దులు ఉండేవి. ఈ రాజ్యంలో 15వ శతాబ్దకాలంలో కరువు కాటకాలు ఏర్పడి పంటలు పండక, పశువులకు సైతం మేత దొరక్క కొండల నుంచి ఆకులు కోసుకొచ్చేవాళ్లు. అరకొర పంటలతో జనం జీవనం సాగించేవాళ్లు. తన రాజ్యం పరిధిలోని ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే కోరుకున్నాడు నంద్యాల తిమ్మరాజు. అవుకు సమీపంలో క్రీ.శ 1538లో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో చెరువును తవి్వంచాడు. వందలాది మంది కూలీలతో ఆరోజుల్లోనే ఇంజినీరింగ్‌ నైపుణ్యాన్ని మించేలా సీసంతో పోతపోసి పునాదులు బలంగా ఉండేలా నిర్మించారు. ప్రస్తుతం ఈ చెరువు రిజర్వాయర్‌గా అభివృద్ధి చెంది వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతోంది. 

తిమ్మరాజు ధర్మ శాసనం 
రైతు సంక్షేమం కోసం నిర్మించిన చెరువు ద్వారా పారే నీటితో పంటలు పండించే రైతులు వరి కోతల కాలంలో పనులకు వచ్చే గర్భిణులకు   ఒకటిన్నర కూలి ఇవ్వాలని నియమం పెట్టారు. ఈ నియమం పాటించే వారి పాదాలు ఎల్లప్పుడూ తన శిరస్సుపై ఉంటాయని తిమ్మరాజు ధర్మశాసనం చేశాడు. ఇప్పటికీ అవుకు ప్రజలు రాజు శాసనాన్ని తూ.చ. తప్పక పాటిస్తున్నారు. గర్భిణులు వరి కోతల పనులు చేయడమంటే అంత సులువుగా కాదు..ఆమెతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ సైతం పరోక్షంగా పనిలో పాల్గొన్నట్లేనని రాజు భావించాడు. అప్పట్లో వరి కోతలకు మహిళలే అధికంగా వెళ్లేవాళ్లు. పని ముగిశాక నగదు రూపంలో కూలి కాకుండా ఒక్కొక్కరికి నాలుగు పల్లు వడ్లు ఇచ్చేవాళ్లు.

నంద్యాల తిమ్మరాజు విగ్రహం 
గర్భిణులకు అయితే నాలుగు పల్లతో పాటు అదనంగా ఒకటిన్నర పడి వడ్లు అదనంగా ఇచ్చేవాళ్లు. రైతు తమ కోసం అదనంగా ఇచ్చాడనే ఉద్దేశంతో మళ్లీ మూడు పిడికెళ్ల వడ్లను తిరిగి ఇచ్చేవాళ్లు. తెల్లవారు జామున 3గంటలకు పనిలోకి వెళ్లి.. కోత కోసి.. పంట నూర్పిళ్లు చేసి.. వరి గడ్డిని కట్టలు కట్టి మోసుకొచ్చేవాళ్లు. చాలా మంది గర్భిణులు.. రెండు మూడు రోజులు కాన్పు అయ్యే సమయం వరకు కోత పనులకు వెళ్లేవాళ్లు. కొంత మంది పనులు చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపట్లోనే కాన్పు అయిన సంఘటనలు ఉన్నాయని గతంలో పనులకు వెళ్లిన వృద్ధులు చెప్పారు. పనులకు గుంపుగా వెళ్లిన మహిళలు.. గర్భిణులకు దగ్గరుండి అరకూలీ అదనంగా ఇప్పించేవారు. పొరుగు గ్రామాల నుంచి సైతం అవుకులో పని చేసేందుకు అప్పట్లో వచ్చేవాళ్లు.   

కొనసాగుతున్న ఆచారం
ఎన్నో ఏళ్ల క్రితం తిమ్మరాజు చేసిన శాసనం ఇప్పటికీ అవుకులో కొనసాగుతోంది. కాలక్రమేణ మార్పులు చోటు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చాక వరికోతలకు దాదాపు పదేళ్ల నుంచి యంత్రాలు ఉపయోగించి కోత కొస్తున్నారు. తగ్గు ప్రాంతాల్లో యంత్రాలు దిగని వరిమళ్లలో కూలీల సాయంతోనే కోత కొస్తుంటారు. ప్రస్తుతం కూడా గర్భిణులు పనులకు వెళితే ఆనాటి ఆచారం 
ప్రకారం అర కూలి అదనంగా ఇస్తున్నారు.  

అర కూలి ఎక్కువగా ఇచ్చేవాళ్లు 
తిమ్మరాజు చెప్పిన ప్రకారం గర్భిణులు వరి కోతలకు వెళితే మామూలుగా ఇచ్చే నాలుగు పళ్ల ఒడ్లతో పాటు అదనంగా అర కూలి చొప్పున ఇచ్చేవాళ్లు. కడుపులో పెరిగే బిడ్డ కష్టపడుతుందనే ఉద్దేశంతో కూలి ఎక్కువ ఇచ్చేవాళ్లు. గర్భం దాలి్చనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు నేను పనులకు వెళ్లాను.  –లక్ష్మమ్మ 
సంప్రదాయం కొనసాగుతోంది 
రాజు కాలంలో ఆచారం ఇప్పటికీ ఊర్లో  కొనసాగుతోంది. గర్భవతిగా ఉన్నా కూడా వరి కోతకు వెళ్లేదాన్ని. పగలు పనికి వెళ్లి రాత్రి ఇంటికొచ్చాక కాన్పు అయిన మహిళలు ఉన్నారు. ఇప్పుడు మిషన్లు రావడంతో కూలీల సంఖ్య తగ్గిపోయింది.  – లక్ష్మీనరసమ్మ
బరువు పని చేసే వాళ్లం 
గర్భవతులు ఉన్నా వరి మళ్లలో బరువైన పనులు చేసేవాళ్లం. గడ్డిమోపులను మోసుకెళ్లే వాళ్లం. కాన్పు అయ్యే వరకు కోత పనులకు పోయేదాన్ని. అదనంగా అరకూలి ఇచ్చేవాళ్లు. మెట్టుపల్లెతో పాటు చుట్టు పక్కల ఊర్ల నుంచి మహిళలు పనులకు వచ్చేవాళ్లు. –వెంకట లక్ష్మమ్మ 
తరతరాల నుంచి పాటిస్తున్నారు 
మా వంశంలోని పూరీ్వకుడు తిమ్మరాజు పరిపాలన కాలంలో అమలు చేసిన పద్ధతిని తరతరాల నుంచి రైతులు పాటిస్తూ వచ్చారు. గర్భంతో ఉన్న తల్లితో పాటు లోపల ఉన్న బిడ్డకు కూలి ఇవ్వాలన్న ఉద్దేశంతో అర కూలి ఏర్పాటు చేశారు. రైతులు సంతోషంగా ఇస్తూ వచ్చారు. ఈ పద్ధతి బహుశా ఎక్కడా ఉండక పోవచ్చు.  –రామకృష్ణరాజు, తిమ్మరాజు వారసుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement