మరోసారి కంటతడి పెట్టిన నన్నపనేని
హైదరాబాద్ : తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మరోసారి కంటతడి పెట్టుకున్నారు. విభజన బిల్లుపై చర్చించేందుకు మరింత సమయం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరుతూ ఆమె గురువారమిక్కడ కన్నీరుమున్నీరయ్యారు. రాష్ట్రం విడిపోయే పరిస్థితులు దాపురించినా...సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఎక్కడున్నారంటూ నన్నపనేని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ప్రాంత నేతలను చూసి అయినా నేర్చుకోవాలని హితవు పలికారు. కోట్లాది తెలుగు ప్రజలను విభజించటం అన్యాయమని అన్నారు.
అంతకు ముందు శాసనమండలిలో రెండు ప్రాంతాలకు చెందిన సభ్యులు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. బిల్లుపై ఓటింగ్ వద్దంటూ తెలంగాణ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. సభను సజావుగా సాగేందుకు వీలుగా మండలి చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఏసీలో తమకు ప్రాతినిధ్యంలేదంటూ వారంతా నిరసనలు చేపట్టారు. కౌన్సిల్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు.
పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సభ్యులు పెద్ద ఎత్తున తెలంగాణ నినాదాలు చేశారు. దీనికి దీటుగా సీమాంధ్ర ఎమ్మెల్సీలు కూడా ఆందోళనకు దిగారు. సమైక్యంధ్రా తీర్మానం ప్రవేశపెట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారి కౌన్సిల్ ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో సభ వాయిదా పడింది. అనంతరం సి.రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానం నోటీసును మండలి తిరస్కరించింది.