చినబాబు సైకిల్ యాత్ర వాయిదా
హైదరాబాద్ : చినబాబుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆర్బాటంగా 'సైకిల్' ఎక్కాలనుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యాత్ర వాయిదా పడింది. రానున్న ఎన్నికల ప్రచార బాధ్యతల్లో భాగంగా నారా లోకేష్ ఈనెల 16వ తేదీన అనంతపురం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాలనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల 'యువ ప్రభంజనం' సైకిల్ యాత్ర వాయిదా పడినట్లు తెలుస్తోంది.
మరోవైపు నారా లోకేష్ అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించనున్న సైకిల్ యాత్ర ఆ పార్టీ నాయకుల మధ్య చిచ్చు రేపుతోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యాత్ర చేపడుతున్నట్లు అధికారికంగా వెల్లడించినా ఇప్పటి వరకు లోకేష్ యాత్రపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్ ఘని తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
కాగా టీడీపీ మొదటి నుంచి అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావు హిందూపురం శాసనసభా నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించారు. చంద్రబాబు కూడా గతేడాది ‘వస్తున్నా మీకోసం’ హిందూపురం నుంచే ప్రారంభించారు.