
వారసుడి వరస... తమ్ముళ్ల రుసరుస
సీనియర్లు, పార్టీ కోసం శ్రమిస్తున్న కొందరు నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ పొగబెడుతున్నారా? అవుననే అంటున్నారు పార్టీ నేతలు
సీనియర్లు, పార్టీ కోసం శ్రమిస్తున్న కొందరు నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ పొగబెడుతున్నారా? అవుననే అంటున్నారు పార్టీ నేతలు.
తెలుగు తమ్ముళ్లకు లోకేష్ రూపంలో ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. చంద్రబాబు చెప్పిందే వేదంగా సాగిన పార్టీలో ఇపుడు లోకేష్ హవా ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ ప్రమోట్ చేస్తున్న రెడీమేడ్ అభ్యర్థులకు, పార్టీ సీనియర్లకు మధ్య చిచ్చు రేగడంతో క్యాడర్ గందరగోళంలో ఉంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీట్ల సిగపట్లు పడుతున్న తెలుగుదేశం నేతలకు ఇపుడు కొత్త సమస్య ఎదురైంది. చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడం వారికి అనివార్యంగా మారిందంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు తెరపై ఉన్న ఆశావహులకు లోకేష్ ప్రభావంతో మొండిచేయి తప్పని వాతావరణం కనిపిస్తోంది. లోకేష్ పరోక్షంగా కొందరిని ప్రోత్సహిస్తున్న తీరు పార్టీ శ్రేణుల్లో కొంత గందరగోళానికి దారితీస్తోంది. లోకేష్ హిట్‌లిస్ట్‌లో తొలి పేరు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చియ్యచౌదరిది. రాజమండ్రి సిటీ నుంచి మరోసారి బరిలోకి దిగాలని తహతహలాడుతున్న గోరంట్లకు లోకేష్ రూపంలో ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి నెలకొంది.
రాజమండ్రి సిటీలో గోరంట్లకు టికెట్ ఇస్తే ఓటమి పునరావృతం అవుతుందని వ్యతిరేక వర్గం గన్ని కృష్ణ శిబిరం పోరుపెడుతోంది. పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మురళీమోహన్ కూడా గన్ని వర్గానికి మద్దతు అని చెబుతున్నారు. తాజాగా అధినేత తనయుడు లోకేష్ కూడా గోరంట్ల వ్యతిరేక శిబిరంలో చేరారంటున్నారు. గన్ని, మురళీమోహన్ అభిప్రాయాల ప్రాతిపదికగా గోరంట్లకు పొగబెట్టేందుకు లోకేష్ పావులుకదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజమండ్రి సిటీ అభ్యర్థిగా లోకేష్ ప్రతిపాదిస్తున్న సుంకవల్లి సూర్య మంత్రాంగమే ఈ వ్యవహారం వెనుక అసలు కారణమంటున్నారు.