నారా లోకేశ్ ప్రమాణం చూశారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన తీరు టీడీపీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఒక నాయకుడిగా లోకేశ్ ఇమేజి పెంచడానికి గడిచిన కొన్నేళ్లుగా ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమవుతున్నాయి. శాసనమండలి చైర్మన్ చక్రపాణి కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పలువురు సభ్యులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. అందులో లోకేశ్ కూడా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కుమారుడైన లోకేశ్ ప్రమాణం చేసిన తీరు మండలి చైర్మన్ తో పాటు అక్కడున్న నేతలందరినీ నివ్వెరపరిచింది. చిన్న చిన్న పదాలను కూడా ఉచ్ఛరించలేక లోకేశ్ తడబడ్డారు, మధ్యమధ్యలో పదాలకు పదాలనే మింగేసి... ప్రమాణ పత్రం చదివారు. పదాలను ఉచ్చరించలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పలువురు పక్కనున్న వారు వాటిని అందించే ప్రయత్నం చేసిన ఆ పదాలను వదిలేసి, దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానంటూ ముగించారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిస్తే గెలుస్తారో లేదోనన్న అనుమానంతోనే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కోటాలో లోకేశ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించుకున్న తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో లోకేశ్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రకంగా దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి చేపట్టిన లోకేశ్ తీరా ప్రమాణ స్వీకారం రోజున పత్రంలోని పదాలను పలకలేక తడబడ్డారు. పదాలను విడదీస్తూ ఉక్కిరి బిక్కిరయ్యారు. తెలుగులో ప్రమాణం చేసిన లోకేశ్ ''సార్వభౌమాధికారాన్ని'' అనే పదం పలకడానికి అష్టకష్టాలు పడ్డారు. 'సార్వభౌమ్... అధికారాన్ని' అని విడగొట్టేశారు. ఇక ''నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వర్తిస్తాను'' అని చెప్పేందుకు కూడా ఇబ్బంది పడిన లోకేశ్, దాన్ని సగంలోనే వదిలేశారు. స్వతంత్రత అన్న పదాన్ని కూడా చదవలేక తడబడ్డారు. ఈ రకంగా మొదటి నుంచి ప్రమాణ పత్రంలోని పదాలను వదిలేస్తూ 'నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధా.. శ్రద్ధా.. అని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అని ముగించేశారు.
ఏడాది కిందట లోకేశ్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో ఇలాగే సొంత పార్టీ విషయాన్ని మనసులో మాట బయట పెట్టినట్టుగా చేసిన ప్రసంగంతో కూడా పార్టీ నేతలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పార్టీలో లోకేశ్ ఇమేజీని పెంచడానికి గడిచిన కొన్నేళ్లుగా అనేక ప్రయత్నాలు, శిక్షణలు ఇస్తున్నప్పటికీ ఏమాత్రం పురోగతి కనిపించకపోవడం సన్నిహితులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తరహాలోనే ఇమేజీ పెంచుకోవడానికి ఎమ్మెల్యేగా కాకపోయినా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి త్వరలోనే మంత్రి పదవి చేపడుతున్న లోకేశ్ వ్యవహారం ఇలా ఉంటే ఎలా అని టీడీపీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో సణుగుతున్నారు.
ఎన్టీఆర్ విగ్రహం వద్ద కాలు జారి..
ఇక ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వాళ్లంతా ముందుగా గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లారు. ముందుగా నారా లోకేశ్ అక్కడకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ.. మొదటి మెట్టు వద్ద కాలుజారి బోర్లా పడబోయారు. అయితే సమయానికి పక్కనే ఉన్న అనుచరులు ఆయనను రెండు భుజాలు పట్టుకుని ఆపడంతో కింద పడకుండా తమాయించుకున్నారు. ఆ తర్వాత విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.
లోకేశ్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఏ విధంగా తడబడ్డారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.