విలేకర్లతో మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణభరత్ గుప్త
శ్రీకాళహస్తి: పట్టణంలో సోమవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చేరుకున్న కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ నివారణ కోసం మరింత కఠినంగా మరో 28 రోజులు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. శ్రీకాళహస్తి వద్ద ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రంలోని 15 మందికి ఆదివారం రక్తపరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు సోమవారం ధ్రువీకరించారు. వారు ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి భార్య, కుమార్తె. అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి గత వారం పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది.
దీంతో ఆయనతో పాటు మరో ఇద్దరు పిల్లల నుంచి కూడా సోమవారం రక్త నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపించారు. ఆ ఫలితాలు మంగళవారం అందుతాయని అధికారులు తెలిపారు. దీంతో వారిని చిత్తూరు ఐసోలేషన్‌కు తరలించారు. వారి బంధువులు, ఎవరెవరిని కలిశారనేది వివరాలు సేకరించి క్వారంటైన్‌కు పంపుతామని తహసీల్దార్ జరీనా తెలిపారు.
లాక్‌డౌన్ కొనసాగింపు
కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త సోమవారం శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. శ్రీకాళహస్తిలో మరో 28 రోజులు కఠినంగా లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. కరోనా బాధితుల కుటుంబీకులను చిత్తూరు ఐసోలేషన్ సెంటర్‌కు తరలించామన్నారు. మిగిలిన వారికి కూడా రక్తపరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని ఆయన కోరారు. కరోనా బారి నుంచి కోలుకున్న వ్యక్తికి రోజూ వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అనిల్‌బాబు, తహసీల్దార్ జరీనా, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment