narayana bharath gupta
-
కరోనాను జయించిన కలెక్టర్
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: కరోనా వైరస్ బారినపడిన కలెక్టర్ నారాయణభరత్‌గుప్త కోలుకున్నారు. ఈ నెల 17న ఆయనకు పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి తిరుపతి క్యాంప్ కార్యాలయంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటించారు. ఆదివారం మరోసారి పరీక్షించుకోగా నెగిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్ నుంచి చిత్తూరు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. జిల్లాలో మార్చి నుంచి ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి కరోనా కట్టడికి విశేష సేవలందించారు ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ కరోనా సోకిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు తెలిపారు. (ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు) -
భరత్ అనే నేను..
కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు.. పడినా లేస్తున్నందుకు అంటారు.. జిల్లా కలెక్టర్ నారాయణభరత్‌గుప్త. కష్టాలకు ఎదురొడ్డి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేశారు. కలెక్టర్ అనే దర్పం లేకుండా.. అందరితో కలిసిపోతున్నారు. ప్రజాసేవకే అంకితమవుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. ఆయన కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, చిత్తూరు: డాక్టర్ వృత్తిని వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఐఏఎస్ వైపు అడుగులు వేశారు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆయన ఉన్నత విద్య అనంతరం ఎంబీబీఎస్ చేశారు. డాక్టర్ వృత్తిలో స్థిరపడ్డారు. డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో చికిత్స కోసం వచ్చే పేదల కష్టాలను చూసి ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు. ఆ వృత్తిని వదులుకుని ఐఏఎస్‌కు శిక్షణ పొందారు. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించారు. శిక్షణ ముగించుకున్న తరువాత జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ పొందారు. కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తకు జ్ఞాపిక ఇస్తున్న తిరుపతి కమిషనర్ గిరీషా, ఇతర అధికారులు సబ్ కలెక్టర్ నుంచి కలెక్టర్ వరకు జిల్లాలో సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నారాయణభరత్‌గుప్త ప్రస్తుతం ఇదే జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో మదనపల్లె సబ్ కలెక్టర్‌గా, అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, శ్రీశైలం ఈఓగా, రాష్ట్ర పవర్ కార్పొరేషన్ శాఖలో విధులు నిర్వర్తించారు. 2019 జూన్ 6న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మూడు పోస్టుల్లో పనిచేసిన ఆయనకు జిల్లాపై మంచి పట్టు ఉంది. చదవండి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌కు నోటీసులు మృధు స్వభావి కలెక్టర్ అనే దర్పం లేదు. అందరితోనూ కలిసిపోయే స్వభావం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా, మృధు స్వభావిగా భరత్‌గుప్త పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. రెండు నెలలుగా జిల్లాలో కరోనా విపత్కర పరిస్థితి నెలకొంది. జిల్లా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఆయన నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెడ్జోన్లలో కలియతిరుగుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలకు వెంటనే చేరుకుని అక్కడ అధికారికంగా చేపట్టాల్సిన చర్యలపై దగ్గరుండి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. కరోనా కట్టడికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన విధుల్లో చేరి శనివారంతో ఏడాది పూర్తయ్యింది. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) మార్కండేయులు, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) చంద్రమౌళి, తిరుపతి మునిసిపల్ కమిషనర్ గిరీషా, ట్రైనీ కలెక్టర్ విష్ణుచరణ్, చిత్తూరు మునిసిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, పుంగనూరు మునిసిపల్ కమిషనర్ వర్మ, పలువురు జిల్లా అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
శ్రీకాళహస్తిలో మరో 28 రోజులు లాక్డౌన్
శ్రీకాళహస్తి: పట్టణంలో సోమవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణానికి చేరుకున్న కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ నివారణ కోసం మరింత కఠినంగా మరో 28 రోజులు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. శ్రీకాళహస్తి వద్ద ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రంలోని 15 మందికి ఆదివారం రక్తపరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు సోమవారం ధ్రువీకరించారు. వారు ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి భార్య, కుమార్తె. అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి గత వారం పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆయనతో పాటు మరో ఇద్దరు పిల్లల నుంచి కూడా సోమవారం రక్త నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపించారు. ఆ ఫలితాలు మంగళవారం అందుతాయని అధికారులు తెలిపారు. దీంతో వారిని చిత్తూరు ఐసోలేషన్‌కు తరలించారు. వారి బంధువులు, ఎవరెవరిని కలిశారనేది వివరాలు సేకరించి క్వారంటైన్‌కు పంపుతామని తహసీల్దార్ జరీనా తెలిపారు. లాక్డౌన్ కొనసాగింపు కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త సోమవారం శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకున్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. శ్రీకాళహస్తిలో మరో 28 రోజులు కఠినంగా లాక్డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. కరోనా బాధితుల కుటుంబీకులను చిత్తూరు ఐసోలేషన్ సెంటర్‌కు తరలించామన్నారు. మిగిలిన వారికి కూడా రక్తపరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని ఆయన కోరారు. కరోనా బారి నుంచి కోలుకున్న వ్యక్తికి రోజూ వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అనిల్‌బాబు, తహసీల్దార్ జరీనా, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఉపాధ్యాయుడైన వేళ
సాక్షి, చిత్తూరు: కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. మండల పర్యటనలో భాగంగా ఆయన స్థానిక జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో పలు విషయాలపై ముచ్చటించారు. జువాలజీ సబ్జెక్టుపై పాఠాలు బోధించారు. అనంతరం మండల కేంద్రంలో చేపట్టిన జలశక్తి అభియాన్ పనులను పరిశీలించారు. నీరు వచ్చే దారులను గుర్తించి పనులు చేపట్టాలని ఆదేశించారు. కబ్జాకు గురైన పేదల, ప్రభుత్వ భూములను రీసర్వే ద్వారా గుర్తించాలని అధికారులకు సూచించారు. మండలంలోని 56 కనికాపురం లెక్క దాఖలా సర్వే నంబర్ 136లో 70 ఎకరాలు, నెలవాయి లెక్క దాఖలాలో సర్వే నంబర్ 135లో 10 ఎకరాలకు పైగా డీకేటీ భూములను పేదలకు ఇచ్చారని, వీటిని రీ సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. 56కనికాపురంలో భూములు కోల్పోయిన రైతుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఇది చదవండి : గాంధీ పేరు రాయలేకపోతున్నారు! -
గాంధీ పేరు రాయలేకపోతున్నారు!
సాక్షి, చిత్తూరు : ‘పదో తరగతి విద్యార్థి గాంధీ పేరు రాయలేకపోతున్నాడు. నేను పాఠశాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం గుర్తించాను. ఇందుకు కారకులెవరు?.’ అని కలెక్టర్ నారాయణ భరత్ గుప్త విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు తాను గమనించానన్నారు. తంబళ్లపల్లె ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సిగరెట్ ముక్కలు పడి ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితులుంటే హెచ్ఎంలు ఏమీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న తరగతి గదులు, ప్రహారీ గోడలు తదిత ర పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సమస్యలు ఏవైనా ఉంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో ‘నా మొక్క – నా బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ సమీక్షలో డీఈఓ పాండురంగస్వామి, సమగ్ర శిక్షా అభియాన్ పీఓ మధుసూదనవర్మ, డీవైఈఓ పురుషోత్తం, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పర్యాటక ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణభరత్‌గుప్త అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్యాకేజీ టూర్ల బలోపేతానికి ఏపీ పర్యాటక సంస్థ కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జేసీ మార్కండేయులు, జేసీ2 చంద్రమౌళి, జిల్లా టూరిజం అధికారి చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మైక్రో ఇరిగేషన్ అనుసంధానం చేయాలి నీటి వసతి ఉన్న ప్రతి రైతు నుంచి దరఖాస్తులను ఆహ్వానించి మైక్రో ఇరిగేషన్‌కు అనుసంధానం చేయాలని కలెక్టర్ అన్నారు. ఏపీఎంఐపీ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కువ నీరు అవసరమైన చెరుకు, వరి పం టలకు మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి గత ఏడాది పూర్తి కాని బిందు సేద్యం పరికరాల అమరిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆ శాఖతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్యాన్సర్ పై అవగాహన, నివారణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. -
శ్రీశైలంలో విరిగిపడ్డ కొండచరియలు
శ్రీశైలం : కర్నూలు జిల్లా శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్‌రోడ్డులో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కృష్ణవేణి మాత విగ్రహం వెనుక భాగంలో.. ఘాట్ రోడ్డు పై భారీగా కొండచరియలు పడ్డాయి. దాంతో రోప్‌వే ద్వారా పాతాళ గంగకు రాకపోకలు నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్ పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆలయ ఈవో నారాయణ గుప్తా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.