
కడప:
నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడపలో కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పావని(17) హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
పావని ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించడానికి వెళ్లిన బంధువలను నారాయణ కాలేజీ సెక్యురిటీ సిబ్బంది అడ్డుకుంది. విద్యార్థిని బంధువులను హాస్టల్‌లోకి యాజమాన్యం అనుమతించలేదు. యాజమాన్యం తీరుకు నిరసనగా హాస్టల్ ఎదుట బంధువలు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట పావని మృతదేహంతో బంధువులు నిరసన తెలిపి, కాలేజీ తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఆత్మహత్యపై విచారణకు ఆదేశం
విద్యార్థిని ఆత్మహత్యపై విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. విద్యార్థిని పావని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్‌తో మాట్లాడారు. కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరి కళాశాల అయినా నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment