ఇంతలోనే ఇలా జరగడం చాలా విషాదం: మోడీ
విశాఖ: తుఫాన్ నష్టం, సహాయ, పునరావాస చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ విశాఖ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రాంతాల్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటామని మోడీ తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి అన్నిరకాల సహాయం అందిస్తామన్నారు.
15 రోజుల క్రితమే విశాఖను స్మార్ట్ సిటీగా ప్రకటించాం, ఇంతలోనే ఇలా జరగడం చాలా విషాదమని మోడీ అన్నారు. ఉత్తరాంధ్రలో కనివిని ఎరుగని నష్టం వాటిల్లిందని, త్వరలో కేంద్ర బృందాన్ని విశాఖకు పంపిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని మోడీ తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామని మోడీ వెల్లడించారు.