రేణిగుంటలో జరిగిన ప్రజా ధన్యవాద సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
ఏపీలో ప్రజలు విజ్ఞానవంతులు. ఎంతో నిష్ణాతులైన వారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచెయ్యాలి. ఏపీ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధిలో దూసుకుపోవడానికి అన్ని అవకాశాలున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కొత్తదనం సృష్టించే దిశగా నవ్యాంధ్ర అడుగులు వేయాలి.
– ప్రధాని మోదీ
సాక్షి, తిరుపతి/రేణిగుంట : ‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు, మంచి నేతలను ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు అభినందనలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఏపీకి అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తాం’.. అని భారత ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతికి వచ్చిన మోదీ రేణిగుంట విమానాశ్రయం సమీపంలో బీజేపీ నేతలు ఏర్పాటుచేసిన ‘ప్రజా ధన్యవాద సభ’లో ఆయన ప్రసంగించారు. ‘బాలాజీ పాదపద్మాల సాక్షిగా నాకు మరోసారి అధికారం అప్పగించిన భారత దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు.. స్వామికి నా ప్రణామాలు’.. అంటూ శ్రీవారి నామస్మరణతో మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘రెండోసారి విజయం సాధించిన తర్వాత శ్రీవారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. తిరుపతికి గతంలో ఎన్నోసార్లు వచ్చాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి తిరుపతి రావడం ఆనందంగా ఉంది. 130 కోట్ల భారత ప్రజల ఆశయాలు తీర్చాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నాను.
శ్రీలంక పర్యటన ఆలస్యం కావడంవల్ల ఇక్కడికి కొంచెం ఆలస్యంగా వచ్చాను. అందుకు క్షమించండి. ఎన్నికలు గెలవడం మాత్రమే కాదు.. ప్రజల మనస్సులను కూడా గెలవాల్సి ఉంది. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది.. ప్రజలందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది’.. అని మోదీ అన్నారు. దేశంలో ప్రజల ఆకాంక్షలు పెరగటం దేశ సౌభాగ్యంగా భావిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, వాటిని తాము నెరవేర్చడంలేదని కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల విశ్వాసం పొందినప్పుడే పాలకులు శక్తివంతులవుతారని వ్యాఖ్యానించారు. సత్యనిష్టతో దేశ సేవ చేస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ప్రధాని ధీమా వ్యక్తంచేశారు.
దేశం ముందు ప్రస్తుతం రెండు ప్రధాన అవకాశాలున్నాయని, వాటిని మనం పోగొట్టుకోకూడదని మోదీ కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోందని.. దేశానికి ఏదో ఒకటి చేయాలని ప్రజలందరూ సంకల్పించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల అనుభవం.. అవినీతి రహిత పాలన అందించడం ద్వారా 130 కోట్ల మంది ప్రజలు అందరూ ఆశీర్వదించారని తెలిపారు. మహాత్మాగాంధీ 150 సంవత్సరాల వేడుకకు సిద్ధమౌతున్నామన్నారు. ప్రజలను సంఘటితం చెయ్యటం తమ లక్ష్యమని ప్రధాని తెలియజేశారు. దేశ సేవలో అనేక మాధ్యమాల్ని ఎంచుకున్నామని, ప్రభుత్వంలో ఉండటం అలాంటి వాటిలో ఒకటని ఆయన వివరించారు.
ఏపీ ప్రజలు విజ్ఞానవంతులు
ఏపీలో ప్రజలు విజ్ఞానవంతులని.. స్టార్ట్‌అప్ కార్యక్రమంలో ఎంతో నిష్ణాతులైన వారు ఉన్నారని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తమిళ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని.. ప్రజల ఆకాంక్షల మేరకే కేంద్రంలోని ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కొనియాడారు. జగన్‌రెడ్డి నాయకత్వంలో ఏపీలో శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటైందని ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచెయ్యాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టంచేశారు. అభివృద్ధిలో దూసుకుపోవడానికి అన్ని అవకాశాలున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. కొత్తదనం సృష్టించటంలో నవ్యాంధ్ర దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే నవభారత్ సాధ్యమవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రజాసంక్షేమం కోసం కార్యకర్తలు కృష్టి చేయాలి
బీజేపీ కార్యకర్తలందరూ ఆశావహులని ప్రధాని అన్నారు. మున్సిపాలిటీల్లో గెలవని రోజుల్లోనూ అదే ఉత్సాహంతో పనిచేశామని ఆయన గుర్తుచేశారు. బీజేపీ నేడు ఈ స్థాయికి రావడంలో కార్యకర్తల భాగస్వామ్యం అమోఘమని కొనియాడారు. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ కార్యకర్తలు దేశసేవలో తరిస్తూ ప్రజల కష్టసుఖాలను పంచుకుంటున్నారన్నారు. ఎన్నికల ఫలితాలే కాదు.. ప్రజల మనస్సులను గెలిచేలా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం 365 రోజులూ పార్టీ శ్రేణులు పనిచేయాలని ప్రధాని మోదీ కోరారు. అధికారంలోకి రావడం ముఖ్యం కాదని.. అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం ముఖ్యమని వివరించారు. పార్టీ వ్యవస్థాపకుల సూచనలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రానున్న రోజుల్లో తమిళనాడు, ఏపీలో బీజేపీ మరింతగా బలపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తంచేశారు. గడిచిన ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇంతటి ఘన విజయం సాధించిపెట్టాయని వివరించారు. ప్రజలు మెచ్చే పాలనను దేశ ప్రజలకు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొందరు ఎన్నికల ఫలితాల ప్రభావం నుంచి ఇంకా బయటకు రాలేదని ప్రతిపక్షాలనుద్దేశించి ఎద్దేవా చేశారు. కాగా, బీజేపీ నేతలు ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. తలపాగా పెట్టి, గజమాల వేసి శాలువాతో సన్మానం చేశారు. ప్రధాని హిందీ ప్రసంగాన్ని కేంద్ర మాజీమంత్రి పురందరేశ్వరి తెలుగులో అనువాదం చేశారు.
చంద్రబాబు కాదు.. ‘చందా’ బాబు
కాగా, సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్.. కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, టీడీపీలో ఎన్టీఆర్ ఆశయాల్లేవని, నారావారి ఆశయాలు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని, కానీ.. చంద్రబాబు ఆ పార్టీని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే ఓడిపోయిందన్నారు. మట్టిపనులతో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో ఆ పార్టీ నేతలు భారీ అక్రమాలకు పాల్పడ్డారని, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆప్కో వస్త్రాల కొనుగోళ్లలో ఏడాదికి రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్లలో వందల కోట్లు దండుకున్నారని తీవ్రంగా విమర్శించారు.
ఏపీలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లలో పోలవరం, హంద్రీ–నీవా వంటి సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోర్టులు కట్టారని.. చంద్రబాబు మాత్రం క్యాపిటల్.. క్యాపిటల్ అంటూ కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గంలో మరుగుదొడ్ల నిధులను టీడీపీ కార్యకర్తలు తమ ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు. అధికారం తమదేనని చంద్రబాబు పగటికలలు కని ఇప్పుడు ఇంట్లో నిద్రపట్టని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రూ.76వేల కోట్ల ఎస్‌ఆర్‌ఈజీఎస్ పనులు కేంద్రం నుంచి వస్తే టీడీపీ నేతలు నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉందని పార్టీ నేతలు అన్నారు. టీడీపీ సహా ఏ పార్టీతోనూ ఏపీ బీజేపీ జట్టు కట్టబోదని చెప్పారు. రానున్న రోజుల్లో సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈదురుగాలులకు కూలిన టెంట్
ఇదిలా ఉంటే.. ప్రధాని బహిరంగసభ ప్రారంభానికి సుమారు అరగంట ముందు రేణిగుంటలో భారీ ఈదురుగాలులు వీచాయి. దీంతో గాలుల ఉధృతికి సభ వద్ద ఏర్పాటుచేసిన టెంటు ఒకటి కూలింది. అయితే, ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రధాని మోదీకి గవర్నర్, సీఎం ఘనస్వాగతం
అంతకుముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 5.20గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, లోకసభలో పార్టీ ఫ్లోర్‌లీడర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు దుర్గాప్రసాద్, రెడ్డెప్ప, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, నవాబ్ బాష, ద్వారకానాథరెడ్డి, ఆదిమూలం, ఎంఎస్ బాబు, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా, తిరుపతి నగరపాలక కమిషనర్ విజయరామరాజు, తిరుపతి అర్బన్ ఎస్‌పీ అన్బూరాజన్, బీజేపీ నాయకురాలు కవిత, ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రధానికి పుష్పగుఛ్చాలను అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన ఎయిర్‌పోర్ట్ సమీపంలోని బీజేపీ ‘ప్రజా ధన్యవాద సభ’కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment