నర్సీపట్నం, యలమంచిలి బీసీమహిళకు
- పుర’ సమరానికి ప్రభుత్వం సన్నద్ధం
- చైర్మన్ల రిజర్వేషన్లు ప్రకటన
- నేడు ఓటర్ల జాబితాల ప్రకటన
- 3న హైకోర్టుకు నివేదిక
- ఆ మేరకు తదుపరి కార్యాచరణ
ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది...ఇప్పటికే వార్డుల రిజర్వేషన్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం తాజాగా చైర్మన్ల రిజర్వేషన్లను కొలిక్కి తెచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుని ఎన్నికలకు సమాయత్తమవుతోంది.
నర్సీపట్నం, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్ని కలపై పూర్తిస్థాయిలో కదలిక వచ్చింది. అనేక కారణాలు చూపిస్తూ వీటి నిర్వహణపై ప్రభుత్వం వెనక్కు తగ్గినా కోర్టుల జోక్యంతో ఎట్టకేలకు కసరత్తు పూర్తిచేసింది. 2011లో వీటి పాలకవర్గాల గడువు పూర్తయింది. జిల్లాలోని భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలు జీవీఎంసీలో విలీనమయ్యాయి. కొత్తగా నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. ఇవి ఏర్పాటయినప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. గతేడాది పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలు సిద్ధం చేశారు.
ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం తెరపైకి వచ్చింది. అధికారులంతా సమ్మెలో పాల్గొనడంతో ఎన్నికల నిర్వహణకు తాత్కాలికంగా తెరపడింది. ఇది ముగిసిన తరువాత ఈ నెలలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండడంతో వీటిని వెనుక్కు నెట్టేయాలని ప్రభుత్వం భావించింది. ఇంతలో నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియపై ఈ నెల మూడో తేదీలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు గడువిచ్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం శనివారం చైర్మన్ల రిజర్వేషన్లను ప్రకటించింది. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలను బీసీ మహిళలకు కేటాయించింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఆదేశాలతో రెండు మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాలను ఆదివారం వార్డులు, మున్సిపాలిటీ, ఆర్డీవో, తహశీల్దారు కార్యాలయాల్లో ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
మూడున హైకోర్టుకు నివేదిక ఇచ్చిన వెంటనే మిగిలిన కార్యాచరణకు అధికారులు చర్యలు చేపట్టారు. వార్డులు, చైర్మన్ రిజర్వేషన్లు ఒక కొలిక్కి రావడంతో ఆశావహుల్లో కోలాహలం మొదలయింది. పార్టీ ప్రాతిపదికన నిర్వహించనున్నందున రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపే అవకాశం ఉంది.