కారుపై కంటైనర్ బోల్తా
Published Sat, Nov 30 2013 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
సూర్యారావుపేట (రాజానగరం), న్యూస్‌లైన్ :జాతీయ రహదారిపై భారీ కంటైనర్ ట్రాలీ అదుపు తప్పింది. డివైడర్ పైకి ఎక్కడంతో పక్కనే వెళ్తున్న కారుపై బోల్తా పడింది. అపాయాన్ని గమనించిన కారులోని ప్రయాణికులు డోర్లు తీసుకుని బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. రోడ్డుకు అడ్డంగా కంటైనర్ పడిపోవడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సూర్యారావుపేట జంక్షన్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం ఆలయ శిఖర ప్రతిష్టాపన జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో జనసంచారం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్న వాహనాలు అక్కడ నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముందు వెళ్తున్న ఓ వాహనం ఆకస్మికంగా ఆగడంతో.. దాని వెనుకే వస్తున్న కారుకు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాని వెనుకే భీమవరం నుంచి విశాఖపట్నానికి రొయ్యల లోడుతో కంటైనర్ ప్రయాణిస్తోంది. కారును తప్పించే క్రమంలో ఈ కంటైనర్ ట్రాలీని డ్రైవర్ రోడ్డు డివైడర్ పైకి పోనిచ్చాడు. దీంతో కంటైనర్ బ్యాలెన్స్ తప్పి కారుపై పడింది. ప్రమాదాన్ని ఊహించిన కారులో ఉన్నఇద్దరు వ్యక్తులు డోర్లు తీసుకుని బయటపడ్డారు. సమీపంలో కనకదుర్గ ఆలయం వద్ద ఉన్న భక్తులు ఈ ప్రమాదాన్ని చూసి నిర్ఘాంతపోయారు. పరుగున అక్కడకు చేరుకుని కారులో ఎవరైనా ఉన్నారేమోనని వారు గాలించారు. అప్పటికే అందులో ఉన్నవారు బయటపడడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు క్రేన్ల సాయంతో కంటైనర్‌ను పక్కకు తరలించారు. పోలీసులు ట్రాలీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement