ఏలూరు :పల్లెల్లో వలసల నివారణ, గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనుల్లేనప్పుడు స్థానికంగా పని కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి దూరంగా జరుగుతోంది. ఈ పథకం రద్దు చేస్తారన్న ప్రచారం తొలుత జరిగింది. ఇప్పుడు కుదింపు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై కూలీల్లో కలవరం రేగుతోంది. కాగా రానున్న ఆర్థిక సంవత్సరంలో పనులు కుదించేందుకు డ్వామా అధికారులు గ్రామసభలను నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఏడాదే ఉపాధి పనులపై ప్రభుత్వ నిర్ణయ ప్రభావం పడుతోంది. దాదాపుగా 48 మండలాల్లోనూ ఉపాధి పనులు నిలిపివేసినట్టు సమాచారం. అధికారులు మాత్రం ఉపాధిని రద్దు చేయలేదని, అవసరం మేరకు పనులు చేసేందుకు గ్రామసభలను నిర్వహిస్తున్నట్టుగా నమ్మబలుకుతున్నారు. రానున్న సంవత్సరంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం నెలనెలా చేసిన ఉపాధి వ్యయంలో 1.25 శాతమే జీతాలుగా విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందిని 100 మందికి పైగా యంత్రాంగం సాగనంపింది. ఉపాధి నిర్వహణలో 2011-12 నుంచి రాష్ట్ర విభజన వరకు జిల్లా 9, 11 స్థానాల్లో నిలువగా, ఇప్పుడు మాత్రం చివరి స్థానానికి పడిపోరుుంది.
రూ. 100 కోట్ల ఖర్చు అనుమానమే
జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్లతో 1, 21, 833 పనులకు పరిపాలన ఆమోదం వచ్చింది. మొత్తం 150 రోజుల పని కల్పించే నిమిత్తం 5.99 లక్షల మందికి జాబ్‌కార్డులను డ్వామా అధికారులు జారీ చేశారు. ఈ ఏడాది కొత్తగా 20,184 మందికి జాబ్‌కార్డులను ఇచ్చారు. 2,59,460 కుటుంబాలకు మాత్రం అరకొరగా పనులు కల్పించారు. కేవలం 6,961 కుటుంబాలకు మాత్రమే 100 రోజులు పనులు కల్పించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు రూ.200 వరకు కూలి గిట్టాల్సి ఉండగా కేవలం రూ.116.42 చొప్పున సగటు కూలి గిడుతోంది. ఇప్పటి వరకు ఉపాధి హామీ కింద రూ.82 కోట్ల 85లక్షల 67వేలు ఖర్చు చేశారు. రానున్న రోజుల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరగనుండటంతో ఈ సంవత్సరంలో రూ.100 కోట్ల ఖర్చు చేయడం అనుమానమే.
ఆరే ళ్ల నుంచి అరకొర గానే
2008 సంవత్సరం ఏప్రిల్‌లో మూడో విడతగా మన జిల్లాలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి వ్యయం రూ.700 కోట్లు కూడా మించలేదు. ఏటా రూ.500 కోట్ల మేర ప్రతిపాదనలను సిద్ధం చేస్తుండగా, అందులో రూ.150 కోట్లను కూడా ఖర్చు చేయలేక యంత్రాంగం చతికిలపడుతోంది. ఈ నే పథ్యంలో ఉపాధి హామీని మరింత కుదించి అధికారులు నామ్‌కే వాస్తేగా పథకాన్ని నడిపించడానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
అనుసంధానం లేనట్టే
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ పనులను అనుసంధానం చేస్తామని అధికారంలోకి వచ్చిన మొద ట్లోనే టీడీపీ సర్కారు ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధిని కొన్ని జిల్లాల్లో రద్దు, మరికొన్ని జిల్లాల్లో అవసరం మేరకే చేయాలన్న ఆలోచన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వ్యవసాయానికి ఉపాధిని అనుసంధానించడానికి వీల్లేదంటూ ప్రజాసంఘాలు, రైతుకూలీ సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ మాటెత్తకపోవడం చూస్తుంటే ఉపాధి ఇక పరిమితం అయ్యే అవకాశాలున్నట్టు అర్థమవుతోంది.
పేరుకే 32 పనులు... ఇక ఎన్ని చేపడతారో?
ఉపాధి హామీ కింద 32 పనుల వరకు గ్రామాల్లో చేపట్టే వెసులుబాటు ఉంది. అయితే ఇందులో 15 రకాల పనులు కూడా యంత్రాంగం చేపట్టడం లేదు. దీంతో కుదింపు వల్ల ఎన్ని పనులు మిగులుతాయో అర్థంకాని అయోమయ స్థితి నెలకొంది. ప్రధానంగా కూలీలు తమ పరిసర గ్రామాల్లో పంటబోదెల పూడిక, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పూడికతీత, పుంతరోడ్లు, శ్మశానవాటికల మెరక, పంటపొలాల గ ట్లపై మొక్కలు నాటుకోవడం, మెట్ట ప్రాంతంలో మంచినీటి చెరువుల పూడికలకే పరిమితం అవుతున్నారు. డెల్టాలోని మంచినీటి పథకాలకు సంబంధించిన చెరువుల పూడిక పనులు చేసే పరిస్థితి లేదు. పండ్లతోటల సాగు, వరద నియంత్రణ, గ్రామీణ రహదారుల అనుసంధానం, చేపల పెంపకం అభివృద్ధి, కరువు నివారణ పనులు, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతుల పొలాలకు పూడిక మట్టిని తరలించడం, పశుపక్ష్యాదులకు సంబంధించిన ప్రాజెక్టు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల చేప, రొయ్యల చెరువుల అభివృద్ధి తదితర పనులు చేసే అవకాశ ం కూలీలకు ఈ పథకం కింద ఉండేది.
‘హామీ’ లేని ‘ఉపాధి’
Published Mon, Dec 8 2014 1:05 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement