
సాయం చేయాలంటే సాక్ష్యం కావాలి: చంద్రబాబు
తుఫాను బాధితులకు సాయం చేయాలంటే వాళ్లకు జరిగిన నష్టానికి సాక్ష్యం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
తుఫాను బాధితులకు సాయం చేయాలంటే వాళ్లకు జరిగిన నష్టానికి సాక్ష్యం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు ఎన్యుమరేషన్ బృందాలను పంపామని, వాళ్లు పంపిన వివరాలు సరికావనుకుంటే బాధితులు కూడా నేరుగా వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చని ఆయన అన్నారు. అధికారులు ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉందని, వాళ్ల పని నూరుశాతం పూర్తయ్యేవరకు వాళ్లను అభినందించేది లేదని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..
''జరిగిన నష్టం చాలా ఎక్కువ. బాధితులకు ఇవ్వడానికి సరుకులు వేర్వేరు చోట్ల కొనాలి, ప్యాకింగ్ చేయాలి. నూనె, పంచదార అన్నీ ఇవ్వాలి. కూరగాయలు వేర్వేరు ప్రాంతాల నుంచి తెప్పించాలి. ఉల్లిపాయలు కర్నూలు నుంచి రావాలి. బంగాళాదుంపలు పశ్చిమబెంగాల్ నుంచి రావాలి. రవాణా సమస్యలు ఉండటం వల్ల కూడా సహాయం అందించడం ఆలస్యం అవుతోంది. సామర్థ్యం పెంచుకోవాలని అందరికీ చెబుతున్నాను. అధికారులంతా అందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం తీవ్రంగా ప్రభావితమైంది. దీనిపక్కన 50 శాతం కంటే ఎక్కువ ప్రభావితమైన గ్రామాలు కూడా ఉన్నాయి. వాటికో ప్యాకేజి, అంతకంటే తక్కువ ఉన్నవాటికి 10 కిలోల బియ్యం, కిలో చొప్పున పప్పు, ఉప్పు, చక్కెర, లీటరు నూనె, అర కిలో కారం ప్యాకేజిగా ఇస్తాం. కరెంటు లేదు, చెట్లు పడిపోయి ట్రాఫిక్ జామ్ అయింది, ఉపాధి కూడా లేదు కాబట్టే తుఫాను ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా సాయం అందజేస్తున్నాం. సర్వే కోసం అధికారులు బయల్దేరుతున్నారు. వాళ్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని అక్కడికక్కడే రికార్డు చేసి ఆన్లైన్లోకి అప్లోడ్ చేయాలి. వాళ్లు ఎన్యుమరేట్ చేసిన తర్వాత అది సరికాదనుకుంటే ఎవరైనా బాధితులు వాళ్లే ఫొటోలు, వీడియోలు తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయచ్చు. దాన్నయినా కూడా మేం అనుమతిస్తాం. మేం అందించే సాయం నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాలకు వెళ్తుంది. ఆన్లైన్లో వెళ్తుంది కాబట్టి, మధ్యలో ఎవరి ప్రమేయం ఉండబోదు. చేసిన సాయం మొత్తం బాధితులకు చేరుకుంటుంది'' అని ఆయన చెప్పారు.