మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు
తాడేపల్లి రూరల్ : వేదాలు, ఉపనిషత్తులు ఇతిహాసాలు, పురాణాలు భారతీయ వారసత్వ సంపదని వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అన్నారు. పరమహంస పరివ్రాజకులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో, శ్రీ మధుభయ వేదాంత చార్య పీఠం ట్రస్టు నిర్వహణలో తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం చిన్నజీయర్ స్వామి వేదవిద్యాలయంలో జరుగుతున్న 50వ ఉభయ వేదాంత పండిత స్వర్ణోత్సవ ముగింపు సభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లడానికి, ఆధ్యాత్మిక గురువులే ముఖ్యకారణమన్నారు. మనిషిలోని అజ్ఞానాంధకారాలను తొలగించి, జ్ఞానబోధ చేసేవాడే గురువన్నారు. అలాంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమన్నారు. త్వరలోనే భారతదేశం ప్రపంచంలో అజేయంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌స్వామి, త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, త్రిదండి అష్టాక్షరీ రామానుజ జీయర్‌స్వామి, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, ఉభయ వేదాంత పండితులైన శ్రీమాన్ రామానుజ తాతాచార్య స్వామి, శ్రీమాన్ శ్రీవత్సాంకాచార్య స్వామి, శ్రీమాన్ ఈయుణ్ణి రంగాచార్యస్వామి, శ్రీమాన్ కె.ఈ.తిరువెంకట రామానుజాచార్యస్వామి, శ్రీమాన్ కేవీ రాఘవాచార్య స్వామి, శ్రీమాన్ తూపురాణి ఉడయవర్ల స్వామి, శ్రీమాన్ నేపాల్ కృష్ణమాచార్య స్వామి, శ్రీమాన్ దేవనాథన్ స్వామి వార్లను ఆయన ఘనంగా సత్కరించారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళశాసనంతో ముగిసిన కాార్యక్రమంలో ఎం.పి గోకరాజు గంగరాజు, మంగళగిరి డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి తహశీల్దార్ ఎంటీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వేదాలను రక్షించుకోవాలి
Published Sat, Mar 14 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement