
రాష్ట్ర చిహ్నాలపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నాలుగేళ్ల తర్వాత వాటిని గుర్తించింది. వృక్షంగా వేపచెట్టును, పుష్పంగా మల్లెను, జంతువుగా కృష్ణ జింకను, పక్షిగా రామచిలుకను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
సాక్షి, అమరావతి: వేద కాలం నుంచి పూజలందుకుంటూ, పుష్కలమైన ఔషధ గుణాలు కలిగిన వేపచెట్టును ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా నిర్ణయించింది. విభజన నేపథ్యంలో నాలుగేళ్ల తరువాత రాష్ట్రానికి ప్రత్యేక చిహ్నాలు ఖరారు చేసింది. వేపచెట్టును దేవతా స్వరూపంగా భావించి పూజించే సంప్రదాయం అనేక ప్రాంతాల్లో ఉంది. ఉగాది పర్వదినాన తెలుగువారికే ప్రత్యేకమైన ఉగాది పచ్చడిలో వేప పువ్వును ఉపయోగిస్తారు. వేప గింజల నుంచి తీసే నూనెను సబ్బులు, షాంపూలు, క్రీమ్స్‌లో ఉపయోగిస్తారు. వేప చెట్టులోని వివిధ భాగాలను ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు.
చర్మవ్యాధులకు వేపాకుతో చేసిన లేపనం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని శాస్త్రీయ నామం అజాడిరక్త ఇండిక. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అటవీ పర్యావరణ శాఖ వేపను రాష్ట్ర వృక్షంగా ఖరారు చేసింది. పొడవాటి మెలికలు తిరిగిన కొమ్ములతో శరీరంపై వివిధ వర్ణాల మచ్చలతో చూడటానికి అందంగా కనిపించే కృష్ణ జింకను ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా నిర్ణయించింది. దీని శాస్త్రీయ నామం ఏంటిలోప్ సెర్వికాప్రా. ప్రాచీన హిందూ పురాణాల్లో కృష్ణజింక చంద్రుని వాహనంగా చెప్పబడింది.
అయితే ప్రస్తుతం ఇది అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉంది. పెంపుడు పక్షిగా మనిషికి అత్యంత సన్నిహితంగా ఉండే రామచిలుకను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేసింది. శుభకార్యాలనగానే గుర్తుకొచ్చే, సువాసనలు వెదజల్లే మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా ఖరారు చేసింది. ఈమేరకు అటవీ, పర్యావరణ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి జూన్ నాలుగో తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment