చెర వీడేనా ? | neeru chettu programme in ongole district | Sakshi
Sakshi News home page

చెర వీడేనా ?

Published Mon, May 11 2015 6:30 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

neeru chettu programme in ongole district

యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ
నీరు - చెట్టు కార్యక్రమంలోనైనా ప్రభుత్వ పరమయ్యేనా ?
అక్రమార్కులకు వరమైన రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తత
ఆక్రమణ ల్లో 71.51 ఎకరాల చెరువుల భూములు
వాటి విలువ రూ.7 కోట్లపైనే..

 
‘చెట్లు పెంచుదాం..చెరువుల్ని సంరక్షిద్దాం..నీటి వృథాని నిలువరిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో పూడికతీత కార్యక్రమాలను వేగవంతం చేయాలని సాక్షాత్తు సీఎం అధికారులను ఆదేశించారు. కానీ అందుకు అనుగుణంగా అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. వందలాది ఎకరాల చెరువుల భూములు అధికార పార్టీ నేతల కబంద హస్తాల్లో చిక్కుకుపోయినా నోరు మెదపడం లేదు. కొండలు, వాగులు, చెరువు కట్టలూ వదలకుండా కబ్జా చేసేస్తున్నా చోద్యం చూస్తున్నారు.
 
 
తాళ్లూరు : చెరువుల్లో పూడిక తీసి వాటికి పూర్వవైభ వం తేవడం సంగతి అటుంచి..ఉన్న చెరువుల్నీ ఆక్రమిస్తున్నారు అధికార పార్టీ నేతలు. సోమవరప్పాడు రెవెన్యూ పరిధిలోని సుబ్బన్న చెరువు సర్వే నంబర్ 324,325,326లో 61.24 ఎకరాలు ఉన్నాయి. అందులో 2001లో ఏక్‌సాల్ పట్టాలు ఇచ్చారంటూ కొందరు 12 ఎకరాలు ఆక్రమించి సుబాబుల్ సాగు చేశారు. 2007లో రెవెన్యూ యంత్రాంగం సాగును అడ్డుకోగా ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. స్టే తొలగింపజేసి చెరువును ఆక్రమణ చెర నుంచి విడిపించడంలో రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపలేదు.

నాటి నుంచి సుబాబుల్ పెంపకం సాగుతూనే ఉంది. వారిబాటలోనే మరో 18 ఎకరాలను అదే గ్రామానికి చెందిన వారు ఆక్రమించారు. ఇదేమిటి అని అడిగిన నాథుడే లేడు. దీంతో సోమవరప్పాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336లో 5.25 ఎకరాలు, స.న.337లో 5.90 ఎకరాలు, స.న.339లో 6.72 ఎకరాలు, స.న.322/1లో 23.72 ఎకరాలను తూర్పుగంగవరం గ్రామానికి చెందిన పలువురు అధికార పార్టీ నేతలు 2014 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆక్రమించారు. కొండలు, వాగులు, చెరువుల కట్టలను సైతం భారీ యంత్రాలతో చదును చేసేశారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.

తాజాగా వెలుగువారిపాలెం పంచాయతీ పరిధిలోని ఓసీ శ్మశానం యలమందవాగు ప్రాంతంలోని వాగు పోరంబోకు, శ్మశాన స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ సమస్యపై గ్రామస్తులు తహశీల్దార్‌ను కలిస్తే గ్రామాల్లోని వాగులు, వంకలు తమ పరిధిలోకి రావని..పంచాయతీ వాటిని సంరక్షించాలని చెప్తుండగా...పంచాయతీ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదని అటుండటంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. మొత్తం రూ.7 కోట్లకుపైగా విలువైన చెరువుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కనీసం నీరు-చెట్టు పథకం అమలులో భాగంగానైనా గ్రామాల్లో చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించి వాటికి పూర్వవైభవం తేవాలని ప్రజలు కోరుతున్నారు.  
భూ కబ్జా చట్టం అమలు ఎక్కడ..
ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై, ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టేందుకు 1982లో భూకబ్జా చట్టాన్ని తెచ్చారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అందుకు తిలోదకాలిచ్చారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు రుజువైతే జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవటంతో ధన, రాజకీయ బలవంతులు దౌర్జన్యంతో చట్టాలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ  అధికారులు కళ్లు తెరచి కబ్జా అయిన వాగులు, వంకలను  గుర్తించి రూ కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, లేకుంటే గ్రామాల్లో శ్మశానాలు సైతం మాయమయ్యే రోజులు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు.

పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటా   పి.సరోజిని, తహశీల్దార్
నూతనంగా బాధ్యతలు చేపట్టాను. కొత్తగా ఏవైనా ఆక్రమణలు ఉంటే చెప్పండి. గతంలో జరిగిన ఆక్రమణలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement