వన్‌ స్టేట్‌.. వన్‌ కార్డు | Telangana CM launches family digital card pilot programme | Sakshi
Sakshi News home page

వన్‌ స్టేట్‌.. వన్‌ కార్డు

Published Sat, Oct 5 2024 8:40 AM | Last Updated on Sat, Oct 5 2024 8:40 AM

Telangana CM launches family digital card pilot programme

కుటుంబానికంతటికీ ఒకే ఐడీ నంబర్‌ 

సభ్యులకు వేర్వేరుగా సంఖ్యలు  

నగరంలోని 24 నియోజకవర్గాల్లో.. 

డిజిటల్‌ ఫ్యామిలీ కార్డుల జారీకి పైలట్‌ సర్వే  

సాక్షి,హైదరాబాద్: ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్‌ నగరంలోని 24 నియోజకవర్గాల్లోని ఒక్కో కాలనీలోనూ సర్వే జరుగుతోంది. ఇంతకీ ఈ డిజిటల్‌ ఫ్యామిలీ కార్డు కోసం జరుపుతున్న సర్వేలో ఏమేం సేకరిస్తారు? దీని వల్ల ప్రయోజనమేమిటి? తదితర అంశాలు ఇలా ఉన్నాయి..  ప్రస్తుతం వ్యక్తిగత గుర్తింపుగా ఎక్కడైనా ఆధార్‌ను అంగీకరిస్తున్నారు. కానీ ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ఎలాంటి కార్డులు లేవు. ఈ ఫ్యామిలీ కార్డుల ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు. అంటే రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని గుర్తించేందుకు ‘వన్‌ స్టేట్‌– వన్‌ కార్డ్‌’గా ఈ కార్డు ఉపకరిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి కార్డులున్నాయి. రాజస్థాన్‌లో జన్‌ ఆధార్‌ స్కీమ్‌ కింద 10 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీలు, 11 అంకెలతో కూడిన వ్యక్తిగత ఐడీలు ఇచ్చారు. హరియాణాలో పరివార్‌ పెహచాన్‌ పాత్ర (పీపీపీ) కింద 8 అంకెలతో కూడిన ఫ్యామిలీ ఐడీ కార్డులిచ్చారు. కర్ణాటకలో 12 అంకెలతో కూడిన ‘కుటుంబ’ ఐడీలను జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 12 అంకెలతో కూడిన డిజిట్‌ ఫ్యామిలీ కార్డును వినియోగిస్తున్నారు. అక్కడ రేషన్‌కార్డుగా దాన్నే వినియోగిస్తున్నారు. 

వ్యక్తిగత ఐడీలు.. 
తెలంగాణలో కుటుంబాన్ని ఒక యూనిట్‌గా గుర్తించేందుకు ఫ్యామిలీకార్డు ఉపకరిస్తుంది. కుటుంబంలోని అందరికీ ఒకే ఐడీ నంబర్‌ ఉండటంతో పాటు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా వేర్వేరు ఐడీలిస్తారు. కుటుంబాల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా దేశంలోని అందరికీ ఆధార్‌ కార్డులిచ్చినట్లే రాష్ట్రంలోని అందరికీ ఈ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులిస్తారు. కుటుంబంలోని మహిళల్లో పెద్ద వారిని కుటుంబ పెద్ద(హెడ్‌ ఆఫ్‌ ది ఫ్యామిలీ)గా గుర్తిస్తారు. వ్యక్తిగత ఐడీలు జారీ అయ్యాక మారవు. శాశ్వతంగా అవే ఉంటాయి. కుటుంబంలోని కుమారుల పెళ్లిళ్లు జరిగి కోడళ్లు వస్తే కుటుంబంలో కొత్త సభ్యులుగా చేర్చేందుకు, మరణించిన వారిని తొలగించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబం చిన్న కుటుంబాలుగా విడిపోతే కొత్త కుటుంబంగా అప్‌డేట్‌ చేసే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు కుటుంబం మొత్తం కలిసి ఉన్న ఫొటో తీసుకుంటారు. నగరంలో 8వ తేదీ వరకు సర్వే జరిపి, 9న స్రూ్కటినీ చేసి 10వ తేదీన ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.  

ఒకే చోట అన్ని వివరాలు.. 
ప్రస్తుతం ఒక  కుటుంబంలోని వారు  వివిధ పథకాల కింద వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నప్పటికీ ఆ వివరాలు ఒకే చోట లేవు. ఈ డిజిటల్‌ కార్డులు వచ్చాక అన్ని వివరాలు ఒక్క మౌజ్‌ క్లిక్‌తో తెలియనున్నాయి. ప్రభుత్వానికి చెందిన 30 శాఖల సమాచారం సంబంధిత శాఖల ఉంది తప్ప  ఒకదానికొకటి  అనుసంధానంగా లేవు. కొత్త కార్డుల వల్ల ప్రజలకెదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయని,  ఈ కార్డుల పైలట్‌ ప్రాజెక్ట్‌ పనుల ప్రారం¿ోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సీఎం రిలీఫ్‌ఫండ్‌తో సహ ఒక కుటుంబం ఏ పథకాలు వినియోగించుకుంటుందో తెలుస్తుందన్నారు. అంతేకాదు.. హెల్త్‌ ప్రొఫైల్‌లో భాగంగా  గతంలో చేయించుకున్న ఆరోగ్యపరీక్షల వంటి వివరాలు కూడా ఉండటం వల్ల మరోసారి ఆరోగ్య పరీక్షల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement