ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తెచ్చిప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు సక్సెస్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ విద్యకు నిర్లక్ష్యపు వైరస్ సోకింది.
కోదాడటౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తెచ్చిప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు సక్సెస్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ విద్యకు నిర్లక్ష్యపు వైరస్ సోకింది. నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో వారు బిల్లులను తీసుకోవడాకే పరిమితమై బోధనను గాలికొదిలేశారు. కోదాడ నియోజకవర్గం పరిధిలోని కోదాడ, చిలుకూరు, నడిగూడెం, మునగాల మండలాల్లో ఏర్పాటు చేసిన 22 సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. లక్షల రూపాయలు వెచ్చించి ల్యాబ్‌లు, కంప్యూటర్లు, జనరేటర్లు ఏర్పాటు చేశారు. కంప్యూటర్ విద్యను బోధించడానికి ఏజెన్సీ నిర్వాహకులు ఇద్దరు బోధకులను కూడా నియమించారు. కానీ, వారికి వేతనాలు ఇవ్వకపోవడంతో సగంమంది మానేశారు. ఉన్నవారు పని చేద్దామంటే కంప్యూటర్లు వైరస్ సోకి మొరాయిస్తున్నాయి. సకాలంలో వీటికి మరమ్మతులు నిర్వహించాల్సిన ఏజెన్సీ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటరు ల్యాబ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి.
ఎక్కడ చూసిన అదే తంతు.. కోదాడ మండలంలో 10 సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో 5 పాఠశాలల్లోనే 4 నుంచి 5 కంప్యూటర్లు పని చేస్తున్నాయి. మిగతావి రకరకాల కారణాలతో పని చేయడం లేదు. ఇన్‌స్ట్రక్టర్‌లకు సరైన పరిజ్ఞానం లేక పోవడంతో వాటి గురించి పట్టించుకునే వారు లేరు. చిలుకూరు మండలంలోని చిలుకూరు, బేతవోలు, నారాయణపురం, రామాపురం జిల్లా పరిషత్ పాఠశాలలకు సక్సెస్ పాఠశాలల కింద ప్రారంభంలో ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు అందజేశారు. అలాగే మండలంలోని ఆర్లెగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు ఆరు కంప్యూటర్లు అందజేశారు. నాలుగు పాఠశాలల్లో మరమ్మతులు చేయకపోవడంతో అన్ని కంప్యూటర్లూ మూలనపడ్డాయి. నడిగూడెం మండలంలో నడిగూడెం త్రిపురవరం, తెల్లబెల్లి, సిరిపురం, వాయిలసింగారం గ్రామాల్లో నాలుగేళ్ల క్రితం పాఠశాలకు 11చొప్పున కం ప్యూటర్లు ఏర్పాటు చేశారు. అలాగే జనరేటర్‌లనూ ఏర్పాటు చేశారు. మునగాల మండలం ముకుందాపురం, మునగాల, కల కోవ, కొక్కిరేణి, నర్సింహులగూడెం సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్‌లు మొరాయిస్తున్నాయి. వీటిని అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికితోడు వేతనాలు రాకపోవడంతో కంప్యూటర్ ఉపాధ్యాయులు రావడం లేదు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడం లేదు.
పాఠశాలల్లో దొంగలు పడ్డారు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. పాఠశాలలకు వాచ్‌మెన్‌లు లేకపోవడం, రక్షణ చర్యలు లేకపోవడంతో చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో దొంగలు పడి మూడు సీపీయూలు దొంగలించారు. నేటివరకు ఆ కంప్యూటర్లు దొరకలేదు. రెండేళ్ల క్రితం నడిగూడెం మండలం వాయిలసింగారం ఉన్నత పాఠశాలలో 10 కంప్యూటర్లు, త్రిపురవరం పాఠశాలలో 10, తెల్లబెల్లిలో 5కంప్యూటర్లు చోరీకి గురయయ్యాయి. కోదాడ మండలం నల్లబండగూడెం పాఠశాలలో 6 కంప్యూటర్లు అపహరణకు గురయ్యాయి. మునగాల మండలం నర్సింహులగూడెం పాఠశాలలోని కంప్యూటర్లు గతంలో రెండుసార్లు చోరీకి గురయ్యాయి. దీనిపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, నేటివరకు ఒక్క కంప్యూటర్ ఆచూకీ కూడా దొరకలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్యా బోధన కుంటుపడింది.
ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు
మునగాలలోని బాలుర ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ టీచరుగా పనిచేస్తున్నాను. ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. అధికారులు స్పందించి మాకు వేతనాలు మంజూరు చేయాలి. కంప్యూటర్లు వృథాగా మూలనపడి ఉన్నాయి. అధికారులు కంప్యూటర్లకు మరమ్మతులు చేయించి ప్రతి రోజు కంప్యూటర్ క్లాస్‌లు జరిగేలా చాడాలి.
- గంటెపంగు విజయ్, నడిగూడెం
కంప్యూటర్ క్లాస్ జరగడం లేదు
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నేటి వరకు ఒక్క రోజు కూడా కంప్యూటర్ క్లాస్ జరగలేదు. టైం టేబుల్‌లో మాత్రం కంప్యూటర్ క్లాస్ ఉన్నది. అ పీరియడ్‌లో ఆటలు ఆడుకుంటున్నాం. గత విద్యాసంవత్సరం కూడా కంప్యూటర్ క్లాస్‌లు జరగలేదు. ఉపాధ్యాయులను అడిగితే కంప్యూటర్లు పని చేయడం లేదని చెబుతున్నారు.
- మాలోతు నాగలక్ష్మి, చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల