విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 75 వేల మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 1653 కనెక్షన్లు మాత్రమే అందించారు. దీపం, సీఎస్‌ఆర్ వంటి కనెక్షన్లు ఇవ్వడానికి కేటాయింపులు అధికంగానే ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు అందించడంలో యంత్రాంగం చొరవ చూపడం లేదు.
జిల్లాకు గతంలో 16 వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటిని ఎవరికీ అందజేయలేదు. ఆ తరువాత సీఎస్‌ఆర్ పేరుతో ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చారు. దీంతో జిల్లాలో 69, 990 మంది దరఖాస్త్తు చేసుకున్నారు. వీటిని కాచి వడపోసిన అధికారులు 55,125 మందిని అర్హులుగా తేల్చారు. అయితే ఐఓసీ, హెచ్‌పీసీలు ఒక్క గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వకపోగా బీపీసీ కంపెనీ ఏజెన్సీలు 1653 కనెక్షన్లు మాత్రే ఇచ్చాయి. గతంలో దీపం పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా కనెక్షన్లు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సీఎస్‌ఆర్ పేరుతో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటికీ కనెక్షన్లు రిలీజ్ చేయలేదు. రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వారికే ఇవ్వాలని మెలిక పెట్టడంతో కనెక్షన్ మంజూరులో జాప్యం జరుగుతోందని సమాచారం.
ఆ మూడు నియోజకవర్గాలకు మరో 5 వేల కనెక్షన్లు
జిల్లాలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ పెండింగ్‌లో ఉంటే జిల్లాకు మరో 5 వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. చీపురుపల్లి, ఎస్. కోట, విజయనగరం నియోజకవర్గాల్లో ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే, మంత్రులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. చీపురుపల్లికి రెండు వేల కనెక్షన్లు, ఎస్. కోట, విజయనగరం నియోజకవర్గాలకు 1500 చొప్పున గ్యాస్ కనెక్షన్లు మంజూ ర య్యాయి. వీటిని త్వరలో పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా కనెక్షన్లు పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుతం మంజూరైన అదనపు గ్యాస్ కనెక్షన్లు మరింత జాప్యం అవుతాయా ? లేక వెంటనే పంపిణీ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే!.
గ్యాస్ కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం
Published Sun, May 31 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM
Advertisement