జాతీయ హోదా దక్కినా.. దక్కని ‘చంద్ర’కటాక్షం | neglency on polavaram project | Sakshi
Sakshi News home page

జాతీయ హోదా దక్కినా.. దక్కని ‘చంద్ర’కటాక్షం

Published Wed, Apr 15 2015 3:46 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

జాతీయ హోదా దక్కినా.. దక్కని ‘చంద్ర’కటాక్షం - Sakshi

జాతీయ హోదా దక్కినా.. దక్కని ‘చంద్ర’కటాక్షం

పోల‘వరం’పై నిర్లక్ష్యం  
ప్రాజెక్టు గురించి పట్టించుకోని బాబు సర్కారు
బాబు పగ్గాలు చేపట్టి 11 నెలలవుతున్నా.. 11 అంగుళాలూ ముందుకు జరగని ప్రాజెక్టు నిర్మాణం
నిర్మాణ పురోగతిపై పోలవరం అథారిటీ తీవ్ర అసంతృప్తి
అయినా.. పట్టించుకోని ప్రభుత్వం
కాంట్రాక్టర్‌ను రక్షించేందుకు, పోల‘వరాన్ని’ జాప్యం చేసేందుకే మొగ్గు
హడావుడిగా పట్టిసీమకు శంకుస్థాపన
ఫలితం.. పోలవరానికి ‘చంద్ర’గ్రహణం

ఈ ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్య వైఖరి ఖరీదు.. రాష్ట్ర అభివృద్ధి

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నిర్మాణం దాకా వచ్చిన పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వపు నిర్లక్ష్యపు ధోరణి అడుగడుగునా అడ్డుతగులుతోంది. జాతీయ హోదా దక్కినా.. చంద్రబాబు కటాక్షం దక్కక పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి.

ప్రాజెక్టు ఖర్చంతా కేంద్రమే భరించడానికి సిద్ధంగా ఉన్నా, సహకారమందించి పనులు వేగవంతం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా లేకపోవడం.. ‘అంగట్లో అన్నీ ఉన్నా..’ సామెతను గుర్తుకుతెస్తోంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తాగు, సాగునీరు ఇచ్చి ప్రజలను కరువు నుంచి, దాహార్తి నుంచి బయటపడేయటానికి గుమ్మం ముందుకొచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలదన్నడం విడ్డూరమంటూ ఇటు ఇంజనీరింగ్ నిపుణులు, అటు ప్రజలు విమర్శిస్తున్నారు.

కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం అథారిటీకి అన్నివిధాలుగా సహకారం అందించాల్సింది పోయి, కాంట్రాక్టర్‌ను రక్షించడానికి, ఏదోవిధంగా పోల‘వరాన్ని’ ఆలస్యం చేయడానికే చంద్రబాబు మొగ్గుచూపడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. పనులు జరుగుతున్న తీరుపట్ల అథారిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసినా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు.

చంద్రబాబు అధికారం చేపట్టి 11 నెలలవుతున్నా.. 11 అంగుళాల పని కూడా జరగలేదు. ఫలితంగా కేంద్రం నుంచి భారీగా నిధులు రాలేదని అధికారులు చెబుతున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తే వైఎస్సార్‌కు ఆ ఘనత దక్కుతుందని, అందుకే సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకోసమే కేంద్రానికి కూడా సహకరించట్లేదని  ఇంజనీర్లు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో పోలవరానికి ఉరేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఎత్తున ‘సొమ్ము’ చేసుకోవడంతోపాటు పోలవరాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేసినట్టు నిపుణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండడం గమనార్హం.
 
వైఎస్ ప్రారంభించిన పోలవరం
కోస్తా జిల్లాల్లోని బీడువారిన భూములను సస్యశ్యామలం చేయడంతోపాటు విద్యుత్ కొరతను తీర్చగలిగే సామర్థ్యమున్న, అలాగే రాయలసీమకు తాగునీటి అవసరాలు తీర్చే బహుళార్థ సాధక ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2006లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేతంగా ప్రారంభించారు. వైఎస్ హయాంలో కుడి, ఎడమ కాలువల పనులతోపాటు హెడ్‌వర్క్స్‌లో భాగంగా స్పిల్‌వే, ట్విన్ టన్నెల్స్, కుడి, ఎడమ కనెక్టివిటీస్ నిర్మాణ పనులూ మొదలయ్యాయి. అయితే నిర్మాణపనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ అనుకున్నంత వేగంగా పనులు చేయకపోవడంతో విడివిడిగా ఇచ్చిన స్పిల్‌వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్‌హౌస్ టెండర్లను వైఎస్ రద్దు చేశారు.

ఈ మూడు ప్యాకేజీలను కలిపి ఒకే ప్యాకేజీగా టెండర్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆయన మరణానంతరం అప్పటి రాష్ట్రప్రభుత్వం దాదాపు మూడేళ్లకుపైగా కాలయాపన చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని నీరుగార్చింది. ఎట్టకేలకు ఏడాదిన్నరక్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం స్పిల్‌వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్‌లను ఒకే ప్యాకేజీగా ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి అప్పగించింది.
 
నత్తకే నడక నేర్పుతున్న కాంట్రాక్టర్
అయితే ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో కాదు కదా.. కనీసమాత్రంగా కూడా జరగట్లేదు. రూ.4,054 కోట్లకు టెండర్ దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ 48 నెలల్లో పనులు పూర్తి చేయాలి. కాంట్రాక్టు దక్కించుకుని ఇప్పటికి 20 నెలలు దాటినా హెడ్‌వర్క్స్‌కు సంబంధించి కేవలం ఐదున్నర శాతం పనులే పూర్తయ్యాయంటే పనుల తీరు అర్థమవుతోంది. కనీసం నెలకు రూ.85 కోట్ల విలువైన పనులైతేనే.. నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందంలోగా ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ ప్రస్తుతం కేవలం రూ.4 కోట్ల విలువైన పనులే జరుగుతున్నాయి. ఈ లెక్కన చూస్తే.. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఇరవై ఏళ్లు పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
పునరావాస సమస్యలు.. పరిష్కారానికి చొరవ చూపని సర్కారు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం మండలంలో 26 గ్రామాలు ముంపునకు గురవుతుండగా వీటిలో ఏడు గ్రామాలు హెడ్‌వర్క్స్ పనుల సమీపంలో ఉన్నాయి. ఈ గ్రామాలవారిని ముందుగా ఖాళీ చేయించేందుకు అధికారులు పునరావాస ప్యాకేజీ అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఒక్క గ్రామానికి కూడా పూర్తి ప్యాకేజీ అమలు కాలేదు.

పునరావాస ప్యాకేజీల అమలుకు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో... నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని తరలిస్తేనే పనులు చేయడానికి అవకాశం ఉంటుందని కాంట్రాక్టర్ సాకుగా చెబుతున్నారు. పనుల్లో జాప్యమే ఇటు ప్రభుత్వానికి, అటు కాంట్రాక్టర్‌కు అవసరమని, అందుకే నాటకాలు ఆడుతున్నారని ఇంజనీర్లే అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతుందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

 
పనులు జరుగుతున్న తీరిదీ...
వాస్తవానికి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉంది. ప్రారంభించిన సమయంలో రోజుకు 60 నుంచి 65 వేల క్యూబిక్ మీటర్ల పనులు జరిగేవి. అవి క్రమేణా తగ్గుముఖం పట్టి ఇప్పుడు కేవలం 15 నుంచి 20వేల క్యూబిక్‌మీటర్ల పనులే ప్రతిరోజూ జరుగుతున్నాయి.
వాస్తవానికి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ పనులు జరగాల్సి ఉంది.
ఫౌండేషన్ వర్క్‌కు సంబంధించి మొత్తం పదికోట్ల క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉండగా.. ఇప్పటికి 50 లక్షల మీటర్ల పనులే పూర్తయ్యాయి.
స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్‌హౌస్ ఫౌండేషన్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇంతవరకు మొదలే కాలేదు.
మొత్తంగా ఇప్పటికి ఐదున్నర శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
రూ. 4,054 కోట్ల పనులకుగాను రూ.200 కోట్లలోపు విలువైన పనులే పూర్తయ్యాయి.
చంద్రబాబు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్‌కు రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం అవకాశం లేకున్నా, మిషనరీని తనఖా పెట్టుకొని నిధులు విడుదల చేయాలని స్వయంగా సీఎం ఆదేశించారు. తీరా.. మిషనరీ, వాహనాల డాక్యుమెంట్లు తనఖా పెట్టాలని అధికారులు అడిగితే.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొన్న మిషనరీ, వాహనాల డాక్యుమెంట్లు బ్యాంకులవద్దే ఉన్నాయని కాంట్రాక్టర్ చల్లగా చెప్పారు. చేసేదేమీ లేక.. అధికారులు మిన్నకుండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement