
చీరాల ఏరియా వైద్యశాల పేరుకు మాత్రమే పెద్దాస్పత్రి. సేవలు అందించే విషయంలో మాత్రం చిన్నాస్పత్రిగా ఉంది. 100 పడకలు ఉన్నా వైద్యం చేసేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవలకు కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు లేదా ఒంగోలు వెళ్లక తప్పడం లేదు. చీరాల ఏరియా వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యశాల స్థితిగతులపై ప్రత్యేక కథనం.
చీరాల రూరల్: చీరాల ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్మారక 100 పడకల ఆస్పత్రి జిల్లాలోనే రెండో పెద్దది. అన్ని రకాల వైద్య సేవలు అందించడంతో పాటు ప్రత్యేకంగా 25 పడకలతో సీమాంక్ సెంటర్ (తల్లి బిడ్డల ప్రసూతి వార్డు) కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటితో పాటు హెచ్‌ఐవీ బాధితుల కోసం (ఏఆర్‌టీ సెంటర్), రక్త పరీక్షల కోసం మెడాల్ ల్యాబ్, కిడ్నీ వ్యాధి బాధితుల కోసం డయాలసిస్ సెంటర్, శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నా ఇట్టే పసిగట్టే సీటీ స్కాన్ కూడా ఏర్పాటు చేశారు. రోజూ 250 నుంచి 350 మంది వరకు రోగులు వచ్చి చికిత్స చేయించుకుంటారు. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలతో పాటు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన రోగులు కూడా ఇక్కడికి వస్తుంటారు.
వేధిస్తున్న వైద్యుల కొరత
వైద్యశాలను వైద్యుల కొరత చాలాకాలంగా వేధిస్తోంది. 15 మంది వైద్యులు పని చేయాల్సి ఉండగా 10 మంది లోపే ఉన్నారు. ఉన్న అరాకొర వైద్యులతోనే నెట్టుకొస్తున్నారు. జనరల్ మెడిసిన్, సివిల్ సర్జన్లు, నరాలు, ప్రత్యేక గుండె వైద్య నిపుణులు ఇక్కడికి అడుగు పెట్టడం లేదు. ఏడెనిమిదేళ్లుగా వైద్యులు లేక, అరకొర వైద్య సేవలతో ఏరియా వైద్యశాల కునారిల్లుతోంది. నలుగురు సివిల్ సర్జన్‌లు ఉండాల్సి ఉండగా ఒక్క స్పెషలిస్టు వైద్యుడు కూడా లేకపోవడం గమనార్హం. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కూడా లేరు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, జ్వర పీడితులతో వైద్యశాల మొత్తం రోగులతో కిక్కిరిసిపోతోంది. వైద్య సిబ్బంది, వైద్యులు రోగులను సరిగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా వ్యాధులకు సంబంధించిన సమాచారం, రక్త పరీక్షల రిపోర్టులు రాలేదనే సాకుతో రేపు రండి.. రెండు రోజులు ఆగండి.. అంటూ వైద్యులు చికిత్సలు అందించకుండా కాలయాపన చేస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కంటి వైద్య నిపుణుడు ప్రసన్నకుమార్ గతేడాది బదిలిపై వెళ్లారు. అప్పటి నుంచి ఆర్‌ఎంఓ డాక్టర్ తిరుపాలును ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నియమించారు. ప్రస్తుతం ఆర్‌ఎంఓ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. రెండు నెలల కిందటే పదవీ విరమణ చేయాల్సిన ఆయనకు ప్రభుత్వం పెంచిన రెండేళ్ల సర్వీసు కలిసొచ్చింది. అతడు రెండేళ్ల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిందే. ఆయనకు సిబ్బందిపై కమాండింగ్ లేక పోవడంతో వైద్యశాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
తెరుచుకోని నూతన భవనాలు
నాబార్డు నిధులు రూ.8.75 కోట్లతో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రి ఆవరణలోనే పడమర వైపున ఖాళీ స్థలంలో నూతన భవనాలు నిర్మించారు. వాటిలో ఓపీ బ్లాకు, సీమాంక్ సెంటర్, క్యాజువాలిటీ బ్లాకులు, పోస్టుమార్టం గదులు అత్యాధునికంగా రూపొందించారు. వాటిలో ఉపయోగించే పరికరాలు కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. నెల కిందట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆమంచి, ఇతర ఉన్నతాధికారులు అంగరంగ వైభవంగా నూతన భవనాలు ప్రారంభించారు. అయితే ఇప్పటికీ వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. పారిశుద్ధ్య విభాగానికి సంబంధింంచి అనుమతులు రాకుండా హడావుడిగా ప్రారంభించారు. ఆస్పత్రి ముందు భాగంలో నాలుగు అడుగులపైగా పల్లపు ప్రాంతం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీళ్లన్నీ అక్కడ చేరి చెరువులా మారిపోయింది. పల్లంగా ఉన్న ప్రాంతానికి మెరక తోలించి రూ.3 లక్షలతో గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నట్లు రెండు నెలల క్రితమే ఎమ్మెల్యే ఆమంచి ప్రకటించారు. ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు. నూతన భవనాలు ఎప్పుడు ప్రారంభిస్తారా.. అని రోగులు ఎదురు చూస్తున్నారు.
అనుమతి వస్తే భవనాలు తెరుస్తాం: డాక్టర్ తిరుపాలు, ఇన్‌చార్జి సూపరింటెండెంట్
నూతన భవనాల పనులన్నీ పూర్తయ్యాయి. ఆస్పత్రి భవనాలు తాళాలు తీయాలంటే పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. భవనాలు నిర్మించే సమయంలోనే పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి అనుమతుల కోసం ఉన్నతాధికారు కు లిఖిత పూర్వకంగా విన్నవించాం. వైద్య శాఖ కమిషనర్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది.