స్త్రీ శక్తి భవనాలు నిర్లక్ష్యపు నీడలో మగ్గిపోతున్నాయి. నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి.
మార్కాపురం, న్యూస్‌లైన్: స్త్రీ శక్తి భవనాలు నిర్లక్ష్యపు నీడలో మగ్గిపోతున్నాయి. నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యంతో శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి. మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని యర్రగొండపాలెం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పుల్లలచెరువు, గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండల కేంద్రాలకు స్త్రీ శక్తి భవనాలను నిర్మించాలని ప్రభుత్వం 2011లో ఉత్తర్వులు జారీ చేయగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హడావుడిగా శంకుస్థాపన చేశారు.
మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఒక్క స్త్రీ శక్తి భవనం కూడా నిర్మాణ దశలో లేదు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు, పెద్దదోర్నాల,
పుల్లలచెరువు మండలాల్లో మాత్రమే భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగిలిన 12 మండలాల్లో భవన నిర్మాణాలు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి.
ఐకేపీ, డీఆర్‌డీఏ శాఖల్లోని మహిళలు, పొదుపు గ్రూపు సభ్యులు, మండల సమాఖ్య కోసం స్త్రీ శక్తి భవనాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 15 మండలాల్లో అద్దె భవనాల్లో సమాఖ్య కార్యకలాపాలు సాగుతున్నాయి. మహిళలు తాము చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించేందుకు, రికార్డులను భద్రపరుచుకునేందుకు, మహిళా సమాఖ్య కార్యాలయం కోసం స్త్రీ శక్తి భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఆచరణలో విఫలం కావడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అధికారులు దగ్గరుండి ఈ నిర్మాణాలను చేపట్టాలి. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా భవన నిర్మాణాలు చేపట్టాల్సి రావడంతో అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో పాలకవర్గాలు లేక భవన నిర్మాణాలపై ప్రజాప్రతినిధులు సైతం దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం మించి పోవడంతో భవన నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. 15 మండలాల్లో ప్రస్తుతం స్త్రీ శక్తి కార్యాలయాలు అద్దె భవనాల్లో సాగుతున్నాయి. ఒక్కొక్క భవనానికి సుమారు రూ 2 నుంచి రూ 3 వేల వరకు అధికారులు అద్దెలు చెల్లిస్తున్నారు.
గడువు ముగిసింది: వెంకటేశ్వర్లు,
పంచాయతీరాజ్ ఈఈ, మార్కాపురం
మార్కాపురం, కందుకూరు డివిజన్లలోని 15 మండలాల్లో స్త్రీ శక్తి భవనాలు మంజూరయ్యాయి. వీటిని గత ఏడాది మే 4వ తేదీ నాటికి నిర్మించాల్సి ఉంది. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించాలి. మూడు మండలాల్లో మాత్రమే భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగిలిన చోట్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు.