పార్లమెంట్‌కు చేరిన బిట్రగుంట అంశం | Nellore Member Of Parliament Adala Prabhakar Reddy Addressing The Development Of Bitragunta Railway In Lok Sabha | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌కు చేరిన బిట్రగుంట అంశం

Published Sat, Aug 3 2019 9:21 AM | Last Updated on Sat, Aug 3 2019 9:21 AM

Nellore Member Of Parliament Adala Prabhakar Reddy Addressing The Development Of Bitragunta Railway In Lok Sabha - Sakshi

లోక్‌సభలో బిట్రగుంట అంశాన్ని ప్రస్తావిస్తున్న నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు ఆదాల ప్రభాకర్‌ రెడ్డి  

బిట్రగుంట రైల్వే అభివృద్ధి అంశం మరో మారు తీవ్రంగా తెరపైకి వచ్చింది. ఈ దఫా రైల్వే బోర్డు మెడలు వంచేందుకు ఉద్యమ ఘట్టం ప్రారంభమైంది. ఏటా రైల్వే బడ్జెట్‌కు ముందు లేదా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించినప్పుడు జిల్లా నేతలు, స్థానిక ప్రజా సంఘాలు బిట్రగుంట అభివృద్ధిపై గళమెత్తడం, రైల్వేబోర్డు మొండి చెయ్యి చూపాక రెండు రోజులు నిరసనలు తెలపడం షరా మామూలే అయినా ఈ దఫా మాత్రం వేడి కాస్త ఎక్కువగానే రాజుకుంది. సంవత్సరాలుగా స్థానికుల విజ్ఞప్తులు, అభ్యర్థనలను పట్టించుకోని రైల్వేబోర్డు తాజాగా ‘ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌’కు కూడా స్టాఫింగ్‌ నిరాకరించడంతో స్థానికులు భగ్గుమంటున్నారు. వినతిపత్రాలు, అభ్యర్థనలతో పనులు కావని ఆలస్యంగా అర్థం చేసుకుని పోరుబాటకు సిద్ధమవుతున్నారు. గూడూరు నుంచి విజయవాడకు Ðవెళ్లే ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బిట్రగుంటలో స్టాపింగ్‌ ఇవ్వడంతో పాటు బిట్రగుంట నుంచి చెన్నైకు మెమూ రైలు, స్థానికంగా ప్రాజెక్ట్‌ల ఏర్పాటు నినాదంతో దశల వారీగా ఉద్యమాలను తీవ్ర స్థాయిలో నిర్వహించేందుకు ప్రజలు, ప్రజా సంఘాలు సమీకరణ అవుతున్నాయి. నిరసనలకు నాందీ ప్రస్తావనగా శనివారం భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా తర్వాత దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రం చేయడంతో పాటు సామూహిక ఆమరణ నినాదాలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

సాక్షి, బిట్రగుంట: బిట్రిష్‌ కాలంలో ఒక వెలుగు వెలిగిన బిట్రగుంట 1980వ దశకంలో ప్రారంభమైన డీజిల్‌ ఇంజిన్లు, ఆ తర్వాత లోకో మోటివ్‌లతో ప్రాభవాన్ని కోల్పోయింది. తిరిగి పూర్వ వైభవానికి రెండు దశాబ్దాలుగా బిట్రగుంట ప్రజలు ఉద్యమాలు సాగిస్తున్నారు. 1880వ సంవత్సరం. ఆంగ్లేయులు రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ముమ్మరంగా సర్వే చేస్తున్న సమయం. ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక సమస్య. కొన్ని చోట్ల భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మరి కొన్ని చోట్ల ఆవిరి ఇంజిన్లు నడిపేందుకు అవసరమైన నీటి వనరుల లభ్యత లేకపోవడం. నాలుగేళ్ల సుదీర్ఘ అన్వేషణ తర్వాత పంటల అల్లూరు (ప్రస్తుత అల్లూరు) రామన్న చెరువుకు సమీపంలోని భాగవోలు (ప్రస్తుత బోగోలు) అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. సమతుల్యమైన నేల, రామన్న చెరువు ద్వారా పుష్కలమైన నీటి లభ్యత అనుకూల అంశంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు తెలుగు, ఇంగ్లిష్‌ కలగలసిన భాషలో ‘బెటర్‌ గుంట’గా పిలిచేవారు. కాల క్రమంలో అదే బిట్రగుంటగా మారింది. 1885 నాటికి ఈ ప్రాంతాన్ని భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దారు.

సుమారు 4 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించి రైల్వేలైన్ల ఏర్పాటు, రైళ్ల మరమ్మతులను చేపట్టారు. ఆవిరి ఇంజిన్ల మరమ్మతులు, పరీక్షలకు కీలకమైన దేశంలోనే రెండో అతిపెద్ద లోకో రౌండ్‌ హౌస్‌ (మొదటి రౌండ్‌ హౌస్‌ మైసూర్‌లో ఉంది) నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టి 1935 నాటికి పూర్తి చేశారు. రైల్వే నిర్వహణ బాధ్యతల కోసం వలస వచ్చిన ఆంగ్లేయుల కోసం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో పాఠశాలలు, 30 పడకల ఆస్పత్రి, వినోద అవసరాల కోసం రైల్వే ఇన్‌స్టిట్యూట్, బర్మా టేకుతో తయారు చేసిన బిలియర్డ్స్‌ బోర్డు, ఫుట్‌బాల్‌ కోర్టు, పార్కులు ఏర్పాటు చేశారు. ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో బిట్రగుంట దశ తిరిగింది. దుకాణాలు, గృహాల నిర్మాణం ఊపందుకుని ప్రజల జీవన ప్రమాణాలు వేగంగా వృద్ధి చెందాయి. సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు ఈ ప్రాభవం కొనసాగింది. 1980 తర్వాత భారతీయ రైల్వేలో ఆధునికీకరణ ప్రారంభమై డీజిల్‌ ఇంజిన్లు అందుబాటులోకి రావడం బిట్రగుంటకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది.

బొగ్గు ఇంజిన్ల మరమ్మతుల్లో నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు కొత్త ఆవిష్కరణను అందిపుచ్చుకోవడంలో విఫలం కావడం షెడ్‌ ఆధునికీకరణకు అవరోదంగా మారింది. అంతలోనే విద్యుత్‌తో పనిచేసే ఇంజిన్లు కూడా అందుబాటులోకి రావడంతో లోకోషెడ్‌ మూతపడింది. ఆంగ్లో ఇండియన్లు ఒక్కొక్కరుగా బిట్రగుంట విడిచి వెళ్లిపోయారు. ఒక్కో విభాగం మూతపడుతూ 1998 నాటికి బిట్రగుంట పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. లోకోషెడ్, లోకో రౌండ్‌ హౌస్, సిబ్బంది క్వార్టర్లు, కార్యాలయ భవనాలు, పార్కు, ఫుట్‌బాల్‌ కోర్టు అన్నీ శిథిలావస్థకు చేరుకుని గత వైభవానికి చిహ్నాంగా మిగిలాయి. ఇటీవల లోకోషెడ్‌ను కూడా వేలం ప్రక్రియ ద్వారా తొలగించారు.

అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితం 
ఆంగ్లో ఇండియన్ల కాలంలో ఒక వెలుగు వెలిగిన బిట్రగుంట రైల్వేకు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు జరిగిన ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సుమారు 2 వేల ఎకరాల స్థలం, నిపుణులైన కార్మికులు, విజయవాడ– చెన్నైల మధ్య కీలకమైన వనరులు బిట్రగుంట సొంతం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ఏ ఒక్క ప్రాజెక్ట్‌ కూడా అమలుకు నోచుకోలేదు. రూ.100 కోట్ల ఖర్చయ్యే ఎలక్ట్రికల్‌ మల్టీఫ్యూయల్‌ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తే రూ.30 కోట్లతోనే పూర్తవుతుందని 1997 సెప్టెంబర్‌లో నిర్వహించిన రైల్వే అధికారిక సర్వేలో స్పష్టమైనా ఇంత వరకూ అతీగతీ లేదు. బిట్రగుంటలో ఏర్పాటు చేయాలనుకున్న క్యారేజ్‌ రిపేర్‌ వర్క్‌ షాపు ఒక సారి రేణిగుంటకు, మరోసారి రాయనపాడుకు తరలిపోయాయి. బిట్రగుంటను డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్నా చివరకు విజయవాడకు పక్కనే ఉన్న గుంటూరును ఎంపిక చేశారు. కొద్దిపాటి వ్యయంతో లోకోషెడ్‌ను ఎలక్ట్రికల్‌ పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ షెడ్డుగా మార్పు చేసుకోవచ్చనే ఆలోచన పదేళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉండి అధికారుల తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో బిట్రగుంట అభిృద్ధి కోసం జరుగుతున్న పోరాటాల నేపథ్యంలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇక్కడ ఏదైనా రైల్వే ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. దీంతో 2004 సెప్టెంబర్‌ 17న అప్పటి రైల్వే మంత్రి లాలూప్రసాద్‌యాదవ్‌ను బిట్రగుంటకు తీసుకువచ్చి కాంక్రీట్‌ స్లీపర్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. ఇది కూడా నేటికీ కార్యరూపం దాల్చలేదు. 

బిట్రగుంట: నెల్లూరు జిల్లాలో రైల్వే కంటోన్మెంట్‌గా పేరు గడించిన బిట్రగుంటలో కాంక్రీట్‌ స్లీపర్‌ కర్మాగారం లేదా ఎలక్ట్రికల్‌ మల్టీఫుల్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా శుక్రవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ బిట్రగుంట విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. గతంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఉన్న సమయంలో బిట్రగుంటలో కాంక్రీట్‌ స్లీపర్‌ కోచ్‌ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కార్యాచరణకు నోచుకోలేదని వివరించారు. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా ఫలితం కనిపించలేదన్నారు. ఈ కారణంగా సుమారు 1,100 ఎకరాల రైల్వే స్థలం నిరుపయోగంగా ఉందన్నారు. దేశంలోని అతిపెద్ద లోకోషెడ్‌ల్లో బిట్రగుంట లోకోషెడ్‌ ఒకటని  గుర్తు చేశారు. డీజిల్, ఎలక్ట్రికల్‌ ఇంజిన్ల శకం ప్రారంభమైన తర్వాత ఈ లోకోషెడ్‌ మూతపడిందని తెలిపారు. 1885లో నిర్మించిన ఈ షెడ్‌కు అనుబంధంగా 1934లో లోకో రౌండ్‌ హౌస్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక్కడ 50 లోకో మోటివ్‌ ఇంజిన్లకు మరమ్మతులు చేసే సామర్థ్యంతో పాటు మేజర్‌ రైల్వే యార్డ్‌ కూడా ఉండేదని తెలిపారు. రైల్వే ప్రాజెక్ట్‌ల స్థాపనకు అవసరమైన అన్నీ వనరులు బిట్రగుంటలో ఉన్నందున తక్షణం ప్రతిపాదనల దశలో ఉన్న రైల్వేప్రాజెక్ట్‌ల్లో ఒక దాన్ని బిట్రగుంటకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన స్థానిక యువతకు రైల్వేప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి చూపించవచ్చన్నారు. తక్షణం రైల్వే మంత్రి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా దశాబ్దాలుగా నిరాదరణకు గురైన బిట్రగుంట అంశాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

ఊపందుకుంటున్న ఉద్యమం  
బిట్రగుంటలో వందల ఎకరాల రైల్వే భూములు, వివిధ కార్యాలయాల నిర్వహణకు అవసరమైన భవనాలు, రైల్వే క్వార్టర్స్‌ అందుబాటులో ఉన్నా ప్రాజెక్ట్‌ల స్థాపనకు మాత్రం రైల్వే బోర్డు ముందుకు రావడం లేదు. కుంటి సాకులతో ప్రతి ప్రాజెక్ట్‌కు మోకాలడ్డుతోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం, రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకురాలేకపోవడంతో కోట్లాది రూపాయల రైల్వే ఆస్తులు నిరుపయోగంగా మారిపోయాయి. చివరకు రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చేందుకు బిట్రగుంటకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు బిట్రగుంట అభివృద్ధి కమిటీ పేరుతో ఐదారేళ్ల నుంచి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా త్వరలో ప్రారంభం కానున్న గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బిట్రగుంటలో స్టాపింగ్‌ ఇవ్వకపోవడంతో బిట్రగుంట అభివృద్ధి అంశంపై తాడోపేడో తేల్చుకోవాలని నడుంబిగించారు. అందులో భాగంగా శనివారం భారీ స్థాయిలో జనసమీకరణ అయి ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం తర్వాత దశల వారీ ఉద్యమాలను తీవ్రస్థాయిలో చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్లమెంట్‌ సమావేశాల్లో జీరో అవర్‌ సందర్భంగా శుక్రవారం బిట్రగుంట రైల్వే గురించి ప్రస్తావించడంతో జిల్లా వాసుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement