Bitragunta
-
పార్లమెంట్‌కు చేరిన బిట్రగుంట అంశం
బిట్రగుంట రైల్వే అభివృద్ధి అంశం మరో మారు తీవ్రంగా తెరపైకి వచ్చింది. ఈ దఫా రైల్వే బోర్డు మెడలు వంచేందుకు ఉద్యమ ఘట్టం ప్రారంభమైంది. ఏటా రైల్వే బడ్జెట్‌కు ముందు లేదా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించినప్పుడు జిల్లా నేతలు, స్థానిక ప్రజా సంఘాలు బిట్రగుంట అభివృద్ధిపై గళమెత్తడం, రైల్వేబోర్డు మొండి చెయ్యి చూపాక రెండు రోజులు నిరసనలు తెలపడం షరా మామూలే అయినా ఈ దఫా మాత్రం వేడి కాస్త ఎక్కువగానే రాజుకుంది. సంవత్సరాలుగా స్థానికుల విజ్ఞప్తులు, అభ్యర్థనలను పట్టించుకోని రైల్వేబోర్డు తాజాగా ‘ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్’కు కూడా స్టాఫింగ్ నిరాకరించడంతో స్థానికులు భగ్గుమంటున్నారు. వినతిపత్రాలు, అభ్యర్థనలతో పనులు కావని ఆలస్యంగా అర్థం చేసుకుని పోరుబాటకు సిద్ధమవుతున్నారు. గూడూరు నుంచి విజయవాడకు Ðవెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బిట్రగుంటలో స్టాపింగ్ ఇవ్వడంతో పాటు బిట్రగుంట నుంచి చెన్నైకు మెమూ రైలు, స్థానికంగా ప్రాజెక్ట్‌ల ఏర్పాటు నినాదంతో దశల వారీగా ఉద్యమాలను తీవ్ర స్థాయిలో నిర్వహించేందుకు ప్రజలు, ప్రజా సంఘాలు సమీకరణ అవుతున్నాయి. నిరసనలకు నాందీ ప్రస్తావనగా శనివారం భారీ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా తర్వాత దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రం చేయడంతో పాటు సామూహిక ఆమరణ నినాదాలకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, బిట్రగుంట: బిట్రిష్ కాలంలో ఒక వెలుగు వెలిగిన బిట్రగుంట 1980వ దశకంలో ప్రారంభమైన డీజిల్ ఇంజిన్లు, ఆ తర్వాత లోకో మోటివ్‌లతో ప్రాభవాన్ని కోల్పోయింది. తిరిగి పూర్వ వైభవానికి రెండు దశాబ్దాలుగా బిట్రగుంట ప్రజలు ఉద్యమాలు సాగిస్తున్నారు. 1880వ సంవత్సరం. ఆంగ్లేయులు రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ముమ్మరంగా సర్వే చేస్తున్న సమయం. ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక సమస్య. కొన్ని చోట్ల భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మరి కొన్ని చోట్ల ఆవిరి ఇంజిన్లు నడిపేందుకు అవసరమైన నీటి వనరుల లభ్యత లేకపోవడం. నాలుగేళ్ల సుదీర్ఘ అన్వేషణ తర్వాత పంటల అల్లూరు (ప్రస్తుత అల్లూరు) రామన్న చెరువుకు సమీపంలోని భాగవోలు (ప్రస్తుత బోగోలు) అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. సమతుల్యమైన నేల, రామన్న చెరువు ద్వారా పుష్కలమైన నీటి లభ్యత అనుకూల అంశంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు తెలుగు, ఇంగ్లిష్ కలగలసిన భాషలో ‘బెటర్ గుంట’గా పిలిచేవారు. కాల క్రమంలో అదే బిట్రగుంటగా మారింది. 1885 నాటికి ఈ ప్రాంతాన్ని భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దారు. సుమారు 4 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించి రైల్వేలైన్ల ఏర్పాటు, రైళ్ల మరమ్మతులను చేపట్టారు. ఆవిరి ఇంజిన్ల మరమ్మతులు, పరీక్షలకు కీలకమైన దేశంలోనే రెండో అతిపెద్ద లోకో రౌండ్ హౌస్ (మొదటి రౌండ్ హౌస్ మైసూర్లో ఉంది) నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టి 1935 నాటికి పూర్తి చేశారు. రైల్వే నిర్వహణ బాధ్యతల కోసం వలస వచ్చిన ఆంగ్లేయుల కోసం ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో పాఠశాలలు, 30 పడకల ఆస్పత్రి, వినోద అవసరాల కోసం రైల్వే ఇన్స్టిట్యూట్, బర్మా టేకుతో తయారు చేసిన బిలియర్డ్స్ బోర్డు, ఫుట్‌బాల్ కోర్టు, పార్కులు ఏర్పాటు చేశారు. ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో బిట్రగుంట దశ తిరిగింది. దుకాణాలు, గృహాల నిర్మాణం ఊపందుకుని ప్రజల జీవన ప్రమాణాలు వేగంగా వృద్ధి చెందాయి. సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు ఈ ప్రాభవం కొనసాగింది. 1980 తర్వాత భారతీయ రైల్వేలో ఆధునికీకరణ ప్రారంభమై డీజిల్ ఇంజిన్లు అందుబాటులోకి రావడం బిట్రగుంటకు పెద్ద ఎదురు దెబ్బగా మారింది. బొగ్గు ఇంజిన్ల మరమ్మతుల్లో నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు కొత్త ఆవిష్కరణను అందిపుచ్చుకోవడంలో విఫలం కావడం షెడ్ ఆధునికీకరణకు అవరోదంగా మారింది. అంతలోనే విద్యుత్‌తో పనిచేసే ఇంజిన్లు కూడా అందుబాటులోకి రావడంతో లోకోషెడ్ మూతపడింది. ఆంగ్లో ఇండియన్లు ఒక్కొక్కరుగా బిట్రగుంట విడిచి వెళ్లిపోయారు. ఒక్కో విభాగం మూతపడుతూ 1998 నాటికి బిట్రగుంట పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. లోకోషెడ్, లోకో రౌండ్ హౌస్, సిబ్బంది క్వార్టర్లు, కార్యాలయ భవనాలు, పార్కు, ఫుట్‌బాల్ కోర్టు అన్నీ శిథిలావస్థకు చేరుకుని గత వైభవానికి చిహ్నాంగా మిగిలాయి. ఇటీవల లోకోషెడ్‌ను కూడా వేలం ప్రక్రియ ద్వారా తొలగించారు. అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితం ఆంగ్లో ఇండియన్ల కాలంలో ఒక వెలుగు వెలిగిన బిట్రగుంట రైల్వేకు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు జరిగిన ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సుమారు 2 వేల ఎకరాల స్థలం, నిపుణులైన కార్మికులు, విజయవాడ– చెన్నైల మధ్య కీలకమైన వనరులు బిట్రగుంట సొంతం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్న ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అమలుకు నోచుకోలేదు. రూ.100 కోట్ల ఖర్చయ్యే ఎలక్ట్రికల్ మల్టీఫ్యూయల్ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తే రూ.30 కోట్లతోనే పూర్తవుతుందని 1997 సెప్టెంబర్‌లో నిర్వహించిన రైల్వే అధికారిక సర్వేలో స్పష్టమైనా ఇంత వరకూ అతీగతీ లేదు. బిట్రగుంటలో ఏర్పాటు చేయాలనుకున్న క్యారేజ్ రిపేర్ వర్క్ షాపు ఒక సారి రేణిగుంటకు, మరోసారి రాయనపాడుకు తరలిపోయాయి. బిట్రగుంటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్నా చివరకు విజయవాడకు పక్కనే ఉన్న గుంటూరును ఎంపిక చేశారు. కొద్దిపాటి వ్యయంతో లోకోషెడ్‌ను ఎలక్ట్రికల్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ షెడ్డుగా మార్పు చేసుకోవచ్చనే ఆలోచన పదేళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉండి అధికారుల తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో బిట్రగుంట అభిృద్ధి కోసం జరుగుతున్న పోరాటాల నేపథ్యంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇక్కడ ఏదైనా రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. దీంతో 2004 సెప్టెంబర్ 17న అప్పటి రైల్వే మంత్రి లాలూప్రసాద్‌యాదవ్‌ను బిట్రగుంటకు తీసుకువచ్చి కాంక్రీట్ స్లీపర్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. ఇది కూడా నేటికీ కార్యరూపం దాల్చలేదు. బిట్రగుంట: నెల్లూరు జిల్లాలో రైల్వే కంటోన్మెంట్‌గా పేరు గడించిన బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ కర్మాగారం లేదా ఎలక్ట్రికల్ మల్టీఫుల్ యూనిట్ ఏర్పాటు చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ బిట్రగుంట విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. గతంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో బిట్రగుంటలో కాంక్రీట్ స్లీపర్ కోచ్‌ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కార్యాచరణకు నోచుకోలేదని వివరించారు. ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా ఫలితం కనిపించలేదన్నారు. ఈ కారణంగా సుమారు 1,100 ఎకరాల రైల్వే స్థలం నిరుపయోగంగా ఉందన్నారు. దేశంలోని అతిపెద్ద లోకోషెడ్ల్లో బిట్రగుంట లోకోషెడ్ ఒకటని గుర్తు చేశారు. డీజిల్, ఎలక్ట్రికల్ ఇంజిన్ల శకం ప్రారంభమైన తర్వాత ఈ లోకోషెడ్ మూతపడిందని తెలిపారు. 1885లో నిర్మించిన ఈ షెడ్‌కు అనుబంధంగా 1934లో లోకో రౌండ్ హౌస్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక్కడ 50 లోకో మోటివ్ ఇంజిన్లకు మరమ్మతులు చేసే సామర్థ్యంతో పాటు మేజర్ రైల్వే యార్డ్ కూడా ఉండేదని తెలిపారు. రైల్వే ప్రాజెక్ట్‌ల స్థాపనకు అవసరమైన అన్నీ వనరులు బిట్రగుంటలో ఉన్నందున తక్షణం ప్రతిపాదనల దశలో ఉన్న రైల్వేప్రాజెక్ట్ల్లో ఒక దాన్ని బిట్రగుంటకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయిన స్థానిక యువతకు రైల్వేప్రాజెక్ట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి చూపించవచ్చన్నారు. తక్షణం రైల్వే మంత్రి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా దశాబ్దాలుగా నిరాదరణకు గురైన బిట్రగుంట అంశాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఊపందుకుంటున్న ఉద్యమం బిట్రగుంటలో వందల ఎకరాల రైల్వే భూములు, వివిధ కార్యాలయాల నిర్వహణకు అవసరమైన భవనాలు, రైల్వే క్వార్టర్స్ అందుబాటులో ఉన్నా ప్రాజెక్ట్‌ల స్థాపనకు మాత్రం రైల్వే బోర్డు ముందుకు రావడం లేదు. కుంటి సాకులతో ప్రతి ప్రాజెక్ట్‌కు మోకాలడ్డుతోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం, రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకురాలేకపోవడంతో కోట్లాది రూపాయల రైల్వే ఆస్తులు నిరుపయోగంగా మారిపోయాయి. చివరకు రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చేందుకు బిట్రగుంటకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు బిట్రగుంట అభివృద్ధి కమిటీ పేరుతో ఐదారేళ్ల నుంచి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా త్వరలో ప్రారంభం కానున్న గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బిట్రగుంటలో స్టాపింగ్ ఇవ్వకపోవడంతో బిట్రగుంట అభివృద్ధి అంశంపై తాడోపేడో తేల్చుకోవాలని నడుంబిగించారు. అందులో భాగంగా శనివారం భారీ స్థాయిలో జనసమీకరణ అయి ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం తర్వాత దశల వారీ ఉద్యమాలను తీవ్రస్థాయిలో చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో జీరో అవర్ సందర్భంగా శుక్రవారం బిట్రగుంట రైల్వే గురించి ప్రస్తావించడంతో జిల్లా వాసుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. -
యువకుడి దారుణ హత్య
సాక్షి, కె.బిట్రగుంట (ప్రకాశం): మతిస్థిమితం లేని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలోని పాలేరు బ్రిడ్జి కింద వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కనిగిరి మండలం లింగారెడ్డిపల్లెకు చెందిన పత్తి ప్రసాద్‌రెడ్డి (38)కి చాలా కాలంగా మతిస్థిమితం సక్రమంగా లేదు. వ్యవసాయం చేసుకుంటున్న తన అన్న వద్దే ఉంటున్నాడు. ప్రసాద్‌రెడ్డికి వివాహం చేసినా భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఒంగోలు ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇలా శవమై ఉండటంతో అతని అన్న, బంధువులు విలపించారు. వాస్తవానికి కనిగిరి నుంచి ఒంగోలుకు బస్సు మార్గం అనుకూలంగా ఉంటుంది. అటువంటిది కనిగిరి నుంచి ఒంగోలు వెళ్లకుండా ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాడో.. అది కూడా పాలేరు బ్రిడ్జి కింద ఎలా హత్యకు గురయ్యాడో పోలీసులకు మిస్టరీగా మారింది. సంఘటన స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ పరిశీలించారు. కేసును ఇన్చార్జి ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ కమలాకర్ వివరించారు. -
మానవత్వం చాటిన రైల్వే సిబ్బంది..
బిట్రగుంట : శ్రీ పొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్లో శనివారం ఓ ప్రయాణికురాలికి ప్రసవమైంది. రైల్వే అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి మానవత్వంతో సపర్యలు చేయడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఆస్పత్రికి చేరారు. అస్సాం రాష్ట్రం డౌలాపూర్‌కు చెందిన నిండు చూలాలు తారామతిభార్ బెంగళూరు నుంచి గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వెళుతోంది. రైలు నెల్లూరు దాటాక ఆమెకు ఒక్కసారిగా ప్రసవం నొప్పులు అధికమయ్యాయి. అంతలోనే రైలు బిట్రగుంట స్టేషన్‌కు చేరుకుంది. లైన్ క్లియర్ లేని కారణంగా రైలును స్టేషన్లో కొద్దినిమిషాలపాటు నిలిపారు. అప్పటికే నొప్పులు తీవ్రమవడంతో తట్టుకోలేక రైలు దిగేసిన తారామతి ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫాంపై మగబిడ్డను ప్రసవించింది. అనంతరం రక్తస్రావం కారణంగా అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన టీఎక్స్ఆర్ అధికారి జయానంద్, సిబ్బంది అరుణ్‌కుమార్, సురేష్ తదితరులు వెంటనే 108కు, రైల్వే డాక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు సీఎన్‌డబ్ల్యూ సిబ్బంది లావణ్య, శారదమ్మను పిలిపించారు. వెంటనే అక్కడకు చేరుకున్న మహిళా సిబ్బంది బిడ్డ శరీరాన్ని శుభ్రం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లికి సపర్యలు చేయడంతో ఆమె కోలుకుంది. రైల్వే వైద్యురాలు హసీనాబేగం వచ్చి తల్లీబిడ్డలను పరీక్షించి ప్రమాదం లేదని చెప్పారు. తల్లికి రక్తస్రావం అధికంగా ఉండటంతో 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. తారమతి వద్ద లభించిన ఆధార్‌కార్డ్, ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
బిట్రగుంట : నెల్లూరు జిల్లాలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బిట్రగుంట రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు బ్రిటగుంట స్టేషన్లో ఆగి ఉండగా బోగీ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పొగలు వస్తున్న బోగిని పరిశీలించారు. సాంకేతిక కారణాల వల్లే పొగలు వచ్చాయని నిర్ధారించారు. సమస్యను పరిష్కరించిన తర్వాత రైలు యధావిధిగా బయలుదేరింది. -
లారీని ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి
-
లారీని ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి
ప్రకాశం: జిల్లాలోని సింగరాయకొండ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జూగురుపల్లి మండలం బిట్రగుంట వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఒంగోలు మండలం మామిడిపాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీ కనిపించకపోవడంతో బైక్‌పై వెళుతున్న వారు ఢీ కొట్టి ఉంటారని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
వర్క్‌షాపు సాధించేంతవరకూ విశ్రమించం
బోగోలులో శాంతి ర్యాలీ బిట్రగుంట: బిట్రగుంటలో హైస్పీడ్ రైళ్లు, వ్యాగన్ల నిర్వహణకు సంబంధించిన వర్క్‌షాపును ఏర్పాటు చేసేంత వరకూ విశ్రమంచమని రైల్వే అభివృద్ధి కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు రూ.280 కోట్లతో ప్రకటించిన వర్క్‌షాపును బిట్రగుంటలో నెలకొల్పాలనే డిమాండ్‌తో రైల్వే అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, విశ్రాంత రైల్వే కార్మికులు, స్థానికులు శాంతి ర్యాలీ పేరిట శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. బోగోలు పంచాయతీ కార్యాలయం నుంచి రైల్వే పీడబ్ల్యూఐ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధుల పిలుపు మేరకు రైల్వే విశ్రాంత కార్మికులు, వ్యాపారులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక యువత, విద్యార్థులు వందలాదిగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ప్రకటించిన రైల్వే వర్క్‌షాపును బిట్రగుంటలోనే నెలకొల్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. కేంద్ర మంత్రి రాష్ట్రానికి ప్రకటించిన హైస్పీడ్ రైళ్లు, వ్యాగన్ల నిర్వహణ వర్క్‌షాప్‌ను బిట్రగుంటలో నెలకొల్పేంత వరకూ విశ్రమించమని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమరణ దీక్షలు, రైలు పట్టాలపై ఆత్మత్యాగాలకు కూడా సిద్ధమని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన వందలాది ఎకరాల భూములు, మానవ వనరులు బిట్రగుంటలో పుష్కలంగా ఉన్నా, రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా 35 ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా రైల్వే మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైల్వే అభివృద్ధి కమిటీ ప్రతినిధులు డాక్టర్ ఆనందసాగర్, జయరాజ్, పర్రి అంకులయ్య, మెతకు రాజేశ్వరి, చల్లా నరహరి, నూరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనకాలనీలో మినరల్ వాటర్‌ప్లాంట్
బిట్రగుంట : బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ రామస్వామిపాళెం గిరిజనకాలనీలో దాతల సహకారంతో మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు బిట్రగుంట ఎస్సై వెంకటరమణ అన్నారు. పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో కాలనీలో జరుగుతున్న ప్లాంట్ పనులను ఎస్సై గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాల మేరకు కాలనీని దత్తత తీసుకుని సమగ్రంగా అభివద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా కాలనీలో గ్రావెల్‌రోడ్లు, ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం, మొక్కల పెంపకంతో పాటు గిరిజనులకు ఆరోగ్య స్పహ పెంచేలా శుద్ధ జలం అందించేందుకు కాలనీలోనే ఉచితంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కాలనీవాసులకు రోజూ ఉచితంగా, అపరిమితంగా మినరల్ వాటర్ అందించనున్నట్లు తెలిపారు. -
రైల్వే పాఠశాల రద్దు చేస్తే సహించం
బిట్రగుంట : బిట్రగుంటలో 110 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల విషయంలో అధికారుల వైఖరి అనుమానాస్పదంగా ఉందని, పాఠశాలను రద్దు చేసినా, స్థాయి తగ్గించేలా నిర్ణయాలు తీసుకున్నా సహించేది లేదని రైల్వే అభివద్ధి కమిటీ సభ్యులు హెచ్చరించారు. బోగోలులో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన రైల్వే పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో వారితోపాటు కమిటీ సభ్యులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. రైల్వే పాఠశాలలో ఈవిద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతిలో విద్యార్థులను చేర్చుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఏడు నుంచి పదోతరగతి వరకూ ప్రస్తుతం 130 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన రైల్వే కార్మికులు, విశ్రాంత కార్మికుల పిల్లలేనని వివరించారు. అతితక్కువ వ్యయంతో రైల్వే కార్మికుల పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తున్న పాఠశాల విషయంలో అధికారుల తీరు పూర్తిగా అనుమానాస్పదంగా ఉందన్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి ఏకే జయరాజ్, సభ్యులు షేక్ నూరుద్దీన్, యతిరాజులు నాయుడు, బొంతా సుధీర్, మహబూబ్‌బాష, రషీ, ముగ్ధుమ్, రవూఫ్, ఖాన్ పాల్గొన్నారు. -
అత్యవసరం.. అందనంత దూరం
బిట్రగుంట : ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య విద్యార్థులను తీవ్రంగా వేధిస్తుంది. పాఠశాలల్లో ప్రతి సంవత్సరం రూ.లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు నిర్మిస్తున్నా నీటి వసతి కల్పించకపోవడం, నిర్వహణాలోపం కారణంగా అవి వినియోగానికి నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులతో పాటు బోధనా సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోజులో ఎనిమిది గంటలకుపైగా పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులు, విద్యార్థులు మరుగుదొడ్లు లేని కారణంగా చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతున్నారు. మండల పరిధిలో 41 ప్రాథమిక, ఎనిమిది ప్రాథమికోన్నత, ఐదు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా మూడు వేల మందికి పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేని కారణంగా వినియోగానికి నోచుకోవడం లేదు. 19 పాఠశాలల్లోని మరుగుదొడ్లు నిర్వహణాలోపం కారణంగా పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ప్రతీఏటా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుండటంతో ఒక్కో పాఠశాలలో రెండు, మూడు వంతున కూడా మరుగుదొడ్లు ఉన్నాయి. అయితే ఒక్క పాఠశాలలో కూడా నీటి వసతి లేకపోవడంతో ఒక్క మరుగుదొడ్డి కూడా వినియోగంలోకి రావడం లేదు. మరుగుదొడ్ల సమస్యపై విద్యాశాఖ అధికారులు కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చైతన్యమేదీ.. నిర్మల్‌భారత్ అభియాన్, స్వచ్ఛభారత్ పథకాల పేరుతో ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తతంగా ప్రచారం చేస్తున్నాయి. అధికారులు ఏకంగా రాత్రిబస చేసి మరీ మరుగుదొడ్ల ఆవశ్యకతపై అవగాహన కలిగించారు. అయితే పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యపై మాత్రం ఒక్క అధికారి కూడా దష్టి సారించకపోవడం గమనార్హం. ఏపాఠశాలకు వెళ్లినా పాఠశాల చుట్టూ బహిరంగ మలవిసర్జనతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన కారణంగా ముందుగా వ్యాధులబారిన పడేది కూడా చిన్నారులే. ఈవిషయంలో అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈవిషయంపై మండల విద్యాశాఖాదికారి జయంత్‌బాబును సంప్రదించగా మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
దొంగా పోలీస్... వేట!
దారి దోపిడి, అత్యాచారాలతో రెచ్చిపోతున్న రెండు ముఠాలను పోలీసులు ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘బిట్రగుంట’. ‘ది బిగినింగ్’ అనేది ఉపశీర్షిక. జె.వి నాయుడు, ఎల్లసిరి మురళీధర్ రెడ్డి, ఇషిక ముఖ్యతారలుగా నాగరాజు తలారి దర్శకత్వంలో జాలె వాసుదేవనాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘జూన్ 15 నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరపనున్నాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పోలీసులకు, గ్యాంగ్ లకు మధ్య సాగే చేజింగ్ సీక్వెన్సెస్, పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ‘‘రియాలిటీకి దగ్గరగా ఉండే చిత్రం ఇది. నెల్లూరు జిల్లాలో ఎక్కువ భాగం షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కరుణాకర్. -
ముంచుకొస్తున్న ఎద్దడి
ఎండుతున్న చెరువులు అడుగంటుతున్న భూగర్భ జలాలు తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు బిట్రగుంట, న్యూస్‌లైన్: బోగోలు మండలాన్ని తాగునీటి ఎద్దడి తరుముకొస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసవి ప్రారంభానికి ముందే చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు, బోర్లలో నీటి శాతం తగ్గింది. దీంతో పల్లెలు గుక్కెడు నీటి కోసం గుటకలు మింగుతున్నాయి. ఇప్పటికే ఉమామమహేశ్వరపురం, తెల్లగుంట, అల్లిమడుగు, సిద్ధవరపు వెంకటేశ్వరపాళెం, పాతబిట్రగుంట, కొండబిట్రగుంట, తదితర గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. మండలంలో 16 మైనర్, ఆరు పంచాయతీరాజ్ చెరువులు ఉండగా సుమారు 12 చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. మొత్తం 302 చేతి పంపులు ఉండగా 15 పంపులు మరమ్మతులకు గురయ్యాయి. మరో 40 బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో రోజుకు నాలుగు బిందెలు నీళ్లు కూడా రావడం లేదు. సుమారు 80కి పైగా బోర్లలో ఉప్పునీరు వస్తుండటంతో తాగేందుకు పనికిరావడం లేదు. పేరుకు 36 తాగునీటి పథకాలు ఉన్నా భూగర్భ జలాల తగ్గిపోవడం, విద్యుత్ కోత లు, మరమ్మతులతో వారానికి ఒక రోజు కూడా తాగునీటి సరఫరా జరగడం లేదు. బోర్లు ఎండిపోవడంతో సిద్ధవరపు వెంకటేశ్వరపాళెంలోని తాగునీటి పథకం నిరుపయోగంగా మారింది. విద్యుత్ కోతలు, మరమ్మతులతో కొండబిట్రగుంట, పాతబిట్రగుంటలకు మంచినీరు సరఫరా చేసే తాగునీటి పథకం కూడా మూలనపడింది. మరోవైపు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో బావుల్లో కూడా జలాల లభ్యత తగ్గుముఖం పట్టింది. దీంతో ఇళ్లలోని బావులు కూడా ఎండిపోతున్నాయి. గ్రామాల్లో ఇదీ పరిస్థితి తెల్లగుంట, ఉమామహేశ్వరపురం, అల్లిమడుగు, అల్లిమడుగు సంఘం గ్రామాలకు పైపులైన్ల మరమ్మతుల కారణంగా రెండు నెలల క్రితమే తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో బావులు కూడా ఎండిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావులపై ఆధారపడుతున్నారు. పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామాలకు పైపులైన్ల మరమ్మతులు, విద్యుత్ కోతల కారణంగా నెల రోజుల నుంచి తాగునీటి స రఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు కలుషితమైన కోనేరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. కోనే రు నీరు తాగేందుకు పనికిరావంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు గతంలో గ్రామంలో దండోరా వేయించారు. విధిలేని పరిస్థితుల్లో ఆ నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. బోగోలు, విశ్వనాథరావుపేట పంచాయతీలను తాగునీటి కొరత వేధిస్తుంది. అధికారులు స్పందించి బోర్లు లోతు పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయకుంటే మరో 15 రోజుల్లో దాదాపు అన్ని గ్రామాలు తాగునీటికి తహతహలాడే పరిస్థితులు దుస్థితి ఏర్పడుతుంది.