ముంచుకొస్తున్న ఎద్దడి
ఎండుతున్న చెరువులు
అడుగంటుతున్న భూగర్భ జలాలు
తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు
బిట్రగుంట, న్యూస్‌లైన్: బోగోలు మండలాన్ని తాగునీటి ఎద్దడి తరుముకొస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసవి ప్రారంభానికి ముందే చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు, బోర్లలో నీటి శాతం తగ్గింది. దీంతో పల్లెలు గుక్కెడు నీటి కోసం గుటకలు మింగుతున్నాయి. ఇప్పటికే ఉమామమహేశ్వరపురం, తెల్లగుంట, అల్లిమడుగు, సిద్ధవరపు వెంకటేశ్వరపాళెం, పాతబిట్రగుంట, కొండబిట్రగుంట, తదితర గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది.
మండలంలో 16 మైనర్, ఆరు పంచాయతీరాజ్ చెరువులు ఉండగా సుమారు 12 చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. మొత్తం 302 చేతి పంపులు ఉండగా 15 పంపులు మరమ్మతులకు గురయ్యాయి. మరో 40 బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో రోజుకు నాలుగు బిందెలు నీళ్లు కూడా రావడం లేదు. సుమారు 80కి పైగా బోర్లలో ఉప్పునీరు వస్తుండటంతో తాగేందుకు పనికిరావడం లేదు.
పేరుకు 36 తాగునీటి పథకాలు ఉన్నా భూగర్భ జలాల తగ్గిపోవడం, విద్యుత్ కోత లు, మరమ్మతులతో వారానికి ఒక రోజు కూడా తాగునీటి సరఫరా జరగడం లేదు. బోర్లు ఎండిపోవడంతో సిద్ధవరపు వెంకటేశ్వరపాళెంలోని తాగునీటి పథకం నిరుపయోగంగా మారింది.
విద్యుత్ కోతలు, మరమ్మతులతో కొండబిట్రగుంట, పాతబిట్రగుంటలకు మంచినీరు సరఫరా చేసే తాగునీటి పథకం కూడా మూలనపడింది. మరోవైపు చెరువుల్లో నీళ్లు అడుగంటడంతో బావుల్లో కూడా జలాల లభ్యత తగ్గుముఖం పట్టింది. దీంతో ఇళ్లలోని బావులు కూడా ఎండిపోతున్నాయి.
గ్రామాల్లో ఇదీ పరిస్థితి
తెల్లగుంట, ఉమామహేశ్వరపురం, అల్లిమడుగు, అల్లిమడుగు సంఘం గ్రామాలకు పైపులైన్ల మరమ్మతుల కారణంగా రెండు నెలల క్రితమే తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గ్రామాల్లో బావులు కూడా ఎండిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావులపై ఆధారపడుతున్నారు. పాతబిట్రగుంట, కొండబిట్రగుంట గ్రామాలకు పైపులైన్ల మరమ్మతులు, విద్యుత్ కోతల కారణంగా నెల రోజుల నుంచి తాగునీటి స రఫరా నిలిచిపోయింది.
దీంతో గ్రామస్తులు కలుషితమైన కోనేరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. కోనే రు నీరు తాగేందుకు పనికిరావంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు గతంలో గ్రామంలో దండోరా వేయించారు. విధిలేని పరిస్థితుల్లో ఆ నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు.
బోగోలు, విశ్వనాథరావుపేట పంచాయతీలను తాగునీటి కొరత వేధిస్తుంది. అధికారులు స్పందించి బోర్లు లోతు పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేయకుంటే మరో 15 రోజుల్లో దాదాపు అన్ని గ్రామాలు తాగునీటికి తహతహలాడే పరిస్థితులు దుస్థితి ఏర్పడుతుంది.