వర్క్‌షాపు సాధించేంతవరకూ విశ్రమించం
బిట్రగుంట: బిట్రగుంటలో హైస్పీడ్ రైళ్లు, వ్యాగన్ల నిర్వహణకు సంబంధించిన వర్క్‌షాపును ఏర్పాటు చేసేంత వరకూ విశ్రమంచమని రైల్వే అభివృద్ధి కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు రూ.280 కోట్లతో ప్రకటించిన వర్క్‌షాపును బిట్రగుంటలో నెలకొల్పాలనే డిమాండ్‌తో రైల్వే అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, విశ్రాంత రైల్వే కార్మికులు, స్థానికులు శాంతి ర్యాలీ పేరిట శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. బోగోలు పంచాయతీ కార్యాలయం నుంచి రైల్వే పీడబ్ల్యూఐ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధుల పిలుపు మేరకు రైల్వే విశ్రాంత కార్మికులు, వ్యాపారులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక యువత, విద్యార్థులు వందలాదిగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ప్రకటించిన రైల్వే వర్క్‌షాపును బిట్రగుంటలోనే నెలకొల్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. కేంద్ర మంత్రి రాష్ట్రానికి ప్రకటించిన హైస్పీడ్ రైళ్లు, వ్యాగన్ల నిర్వహణ వర్క్‌షాప్‌ను బిట్రగుంటలో నెలకొల్పేంత వరకూ విశ్రమించమని స్పష్టం చేశారు. అవసరమైతే ఆమరణ దీక్షలు, రైలు పట్టాలపై ఆత్మత్యాగాలకు కూడా సిద్ధమని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన వందలాది ఎకరాల భూములు, మానవ వనరులు బిట్రగుంటలో పుష్కలంగా ఉన్నా, రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా 35 ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా రైల్వే మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైల్వే అభివృద్ధి కమిటీ ప్రతినిధులు డాక్టర్ ఆనందసాగర్, జయరాజ్, పర్రి అంకులయ్య, మెతకు రాజేశ్వరి, చల్లా నరహరి, నూరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.