నెల్లూరు సిటీ: నగర పాలక సంస్థకు చెందిన రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలిని బతికుండగానే చంపేశారు. తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతో ఆమె ఉద్యోగాన్ని మరో మహిళకు కేటాయించారు. బాధిత మహిళ ఫిర్యాదుతో గతంలో హెల్త్ విభాగం అధికారులు, సిబ్బంది కలిసి చేసిన నిర్వాకం బట్టబయలైంది. ఈ విషయమై మున్సిపల్ హెల్త్ అధికారి వెంకటరమణ పాతరికార్డులను పరిశీలించగా కొత్త కోణాలు వెలుగుచూశాయి. అప్పటి అధికారులు, సిబ్బంది కలిసి తప్పుడు పత్రాలతో బాధిత మహిళతో ఎటువంటి సంబంధం లేని మరో మహిళకు ఉద్యోగం కట్టబెట్టినట్లు తేలింది. (నేను బతికే ఉన్నా సారూ!)
వివరాల్లోకి వెళితే..నగర పాలక సంస్థ పరిధిలో 1995 నుంచి రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలిగా కిష్టమ్మ అనే మహిళ పనిచేస్తోంది. కిష్టమ్మ భర్త బీమగుంట కోటేశ్వరరావు. నెల్లూరు మున్సిపాలిటీలో రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించేవాడు. కోటేశ్వరరావు మృతితో ఆ ఉద్యోగాన్ని అప్పటి కమిషనర్ కిష్టమ్మకు కేటాయించారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొద్దికాలం పాటు ఆమె పనికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు కార్పొరేషన్ ఉద్యోగులు చేతివాటం చూపి ఆమె ఉద్యోగాన్ని మరొకరికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. 1997లోనే కిష్టమ్మ మృతి చెందినట్లు 2012లో తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. ఆమెతో ఏ సంబంధం లేని రమాదేవి అనే మహిళకు ఉద్యోగాన్ని కేటాయించారు. చనిపోయిన కోటేశ్వరరావు తమ కూతురుకు ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు, ఆ మేరకు ఉద్యోగాన్ని కేటాయించినట్లు రికార్డుల్లో పేర్కొనడం కొసమెరుపు. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు స్పష్టమవుతోంది.
అక్రమాలపై విచారణ ముమ్మరం
రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికురాలి ఉద్యోగాన్ని మరో మహిళకు అప్పగించడంపై ఎంహెచ్‌ఓ వెంకటరమణ విచారణ చేపట్టారు. హెల్త్‌విభాగంలోని పాతరికార్డులను పరిశీలించగా కొత్తకోణాలు వెలుగుచూశాయి. అప్పటి హెల్త్ ఉద్యోగులు, సిబ్బంది కలిసి తప్పుడు మరణ ధ్రువీకరణపత్రాలతో మరొకరికి ఉద్యోగం కట్టబెట్టారని తేలింది. దీంతో ఆధారాలను ఎంహెచ్‌ఓ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment