జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల సంఘం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తీవ్ర గందరగోళాల మధ్య ఇక్కడి ఎన్నిక రెండు సార్లు వాయిదా పడటంతో ఈసారైనా ఎన్నిక సజావుగా పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం.. జిల్లా అధికారులకు మరికొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఎన్నిక జరిపేందుకు ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలోకి కోరమ్‌కు సరిపడినంత మంది సభ్యులు ఒక్కసారి హాజరై.. తరువాత వారు ఏ కారణంతో బయటకు వెళ్లినా కోరం ఉన్నట్టే భావించి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌కు స్పష్టంచేసింది.
ఇందుకోసం సభ్యుల నుంచి సంతకాల సేకరణ అవసరం లేదని పేర్కొంది. గతంలో ఎన్నికల సంఘం చేసిన సూచనకు అనుగుణంగా మొదటి నుంచి ఎన్నిక ప్రక్రియ వీడియో ద్వారా చిత్రీకరిస్తూ.. సమావేశ మందిరంలోకి వచ్చిన సభ్యుడిని వీడియో చిత్రీకరించాలని నిర్దేశించింది. అలాగే.. సభ్యులు పార్టీల వారీగా కూర్చోవటానికి బారికేడ్ల ద్వారా వేరుగా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలని.. కంపార్టుమెంటుకు ఒక అధికారిని నియమించి సభ్యుల సంఖ్యను నిర్ధారించుకోవాలని సూచించింది.
ఎన్నికపై పూర్తివివరాలివ్వండి: హైకోర్టు ఆదేశం
నెల్లూరు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ నాయకులు చేస్తున్న గొడవలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులపై పోలీసుల వేధింపుల నేపథ్యంలో, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ఎన్నికల అధికారులను, హోంశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈ నెల 20న జరిగే సమావేశాన్ని పరి శీలించేందుకు ఓ న్యాయాధికారిని పరిశీలకునిగా నియమిం చాలని కోరుతూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు బి.అనిల్‌కుమార్ రెడ్డి, మరో 22 మంది హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు. అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేక పిటిషనర్లు దూరప్రాంతాలకు వెళితే, పోలీసులు వారి కుటుంబ సభ్యులను బెదిరించి తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు.
20న నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
Published Thu, Jul 17 2014 1:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement
Advertisement