
మంత్రి అవుతాననుకోలేదు
అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం టౌన్: తాను మంత్రి అయ్యేం దుకు కారకులైన నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా నర్సీపట్నం వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిని అవుతానని అనుకోలేదన్నారు.
ఏరియా ఆస్పత్రి స్థాయిని 150 పడకలకు పెంచి ఫైవ్‌స్టార్ ఆస్పత్రిలా తీర్చిదిద్దుతానన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అయ్యన్న దయవల్లే ఎమ్మెల్యే అయ్యానని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అన్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ సింహాచలం అయ్యన్నకు జ్ఞాపికను అందించి అభినందించారు. సభకు చింతకాయల సన్యాసిపాత్రుడు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేచలపు శ్రీరామ్మూర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, అధికారులు పాల్గొన్నారు.