
మహా నగరపాలక సంస్థ ఎన్నికలకు మరోచిక్కు వచ్చిపడింది. ఆర్నెల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే వార్డుల విభజన, ఓటరు జాబితాల ప్రకటన పూర్తి చేసిన జీవీఎంసీ ఎన్నికల దిశగా అడుగులేస్తోంది. కానీ మహా ఎన్నికలకు కొత్త చిక్కు వచ్చిపడింది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రకటిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు మహా ఎన్నికలకు ఆటంకం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : మహావిశాఖనగరపాలక సంస్థ..ఒకప్పుడు 72వార్డులతో ఉండేది. నేడు దాని పరిస్థితి విస్తరించ డంతో వార్డు సంఖ్య 81కు చేరింది. దేశంలోనే అత్యంత పురాతమైన మున్సిపాల్టీల్లో ఒకటైన భీమిలితో పాటు అనకాపల్లి మున్సిపాల్టీలను జీవీఎంసీలో విలీనం చేశారు. అలాగే విశాఖనగరంలో అంతర్భాగంగా ఉన్న పెందుర్తి మండలంతో పాటు సబ్బవరం, పరవాడ మండలాల్లో ఒక్కో పంచాయతీ, అలాగే అనకాపల్లి మండలంలోని మూడు పంచాయతీలు జీవీఎంసీలో విలీనమయ్యాయి.
ఇక భీమిలి మండలంలోని ఐదు పంచాయతీల విలీనం కోర్టు వివాదాల్లో కొనసాగుతూనే ఉంది. కాగా ఆ ఐదు గ్రామాలు మినహాయించగా మిగిలిన జీవీఎంసీ పరిధిలోని ప్రాంతాన్ని 81 వార్డులుగా విభజించి గత నెలలోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వార్డుల్లో కులాల వారీగా ఓటర్ల జాబితా గణన కూడా పూర్తి చేశారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికలకు వెళ్లేందుకు జీవీఎంసీ ఓ వైపు ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. కానీ ఇప్పుడే అసలు చిక్కు వచ్చి పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనివార్యంగా కన్పిస్తున్న తరుణంలో జీవీఎంసీ పరిధిలో ఉన్న అనకాపల్లి మున్సిపాల్టీ, పెందుర్తి మండలం, అనకాపల్లి, సబ్బవరం, పరవాడ మండలాల్లోని పంచాయతీల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఈ ప్రాంతాలన్నీ ఆరో జోన్‌లో ఉన్నాయి. అనకాపల్లి మున్సిపాల్టీతో పాటు అనకాపల్లి మండలంలోని వల్లూరు, రాజుపాలెం, కొప్పాక, పరవాడ మండలం తాడి గ్రామాలను కలిపి 67, 68, 69, 70 వార్డుల పరిధిగా విభజించారు. ఈ వార్డుల్లో 99,895 మంది జనాభా ఉన్నట్టుగా లెక్క తేల్చారు. ఇక పెందుర్తి మండలంలోని వేపగుంట, సుజాతనగర్, చినముషిడివాడ, పెందుర్తి, నరవ, సింహాచలం, అప్పన్నపాలెం, నాయుడుతోట, ఇస్లాంపేట, సబ్బవరం మండలంలోని వెదుళ్ల నరవ గ్రామాలు కలిపి 57, 69, 70, 71,72 వార్డులుగా విభజించారు. ఈ వార్డుల పరిధిలో లక్ష మందికి పైగా జనాభా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment