కొత్త సీసాలో.. పాత మద్యమే!
శ్రీకాకుళం క్రైం: పాత సీసాలో కొత్త మద్యం.. అంటే ఏమిటో ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త ఎక్సైజ్ విధానం తేటతెల్లం చేయనుంది. సోమవారం ఈ కొత్త విధానాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాత, కొత్త విధానాల మధ్య పెద్ద తేడా లేదని తెలిసింది. రెండు శ్లాబుల లెసైన్స్ ఫీజు మాత్రమే మార్చారు. దీంతో కొత్త ఎక్సైజ్ విధానం ఎలా ఉంటుందోనని గత కొద్దిరోజులుగా టెన్షన్‌కు గురవుతున్న మద్యం వ్యాపారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
స్వల్ప మార్పులతో సరి
జిల్లా వ్యాప్తంగా 232 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి వీటిని మూడు శ్లాబులుగా విడదీసి లెసైన్స్ ఫీజు నిర్ణయించేవారు. 2011 వరకు టెండర్ల ద్వారా షాపులను కేటాయించేవారు. 2012లో లాటరీ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. అప్పట్లో రూ.32.50 లక్షలు, రూ.34 లక్షలు, రూ.42 లక్షలుగా మూడు శ్లాబులు నిర్ణయించారు. వాటి పరిధిలో ఉన్న మద్యం దుకాణాలకు అసక్తిగల వారు రూ.25వేలు డీడీ తీసి లాటరీలో పాల్గొనేవారు. బినామీ పేర్లతో నచ్చినన్ని దరఖాస్తులు దాఖలు చేసేవారు. కాగా ఈ ఏడాదికి ప్రకటించనున్న కొత్త విధానంలో స్వల్ప మార్పులు మాత్రమే చేశారు. మూడు శ్లాబుల్లో రెండింటి లెసైన్సు ఫీజులనే పెంచారు. రూ.32.50 లక్షల శ్లాబ్‌ను అలాగే ఉంచారు. రూ.34 లక్షల శ్లాబ్‌ను రూ.36 లక్షలకు, రూ.42 లక్షల శ్లాబ్‌ను రూ.45 లక్షలకు పెంచారు. బెల్ట్ దుకాణాల మూసి వేస్తామని సర్కారు ఇచ్చిన హామీ కారణంగా లెసైన్సు ఫీజును పెద్దగా పెంచలేదని చెప్పుకొనేందుకే ఈ ప్రయత్నమని తెలుస్తొంది. కాగా బార్‌లకు సంబంధించి ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. లెసైన్సు ఫీజు ఎంత పెంచాలన్నదానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. బహుశా సోమవారం సాయంత్రానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
బెల్ట్ తీయటం కష్టమే!
అధికారంలోకి వస్తే బెల్ట్ దుకాణాలను పూర్తిగా మూసివేయిస్తామని ఎన్నికల సందర్భంగా టీడీపీ హామీ ఇచ్చింది. కొత్త ఎక్సైజ్ పాలసీని పరిశీలిస్తే అది అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. గత పాలసీకి ఈ పాలసీకి పెద్దగా మార్పులు లేవు. పైగా రెండు శ్లాబ్‌ల లెసైన్స్ ఫీజులను కొద్దిగా పెంచారు. ప్రస్తుతం బెల్ట్ దుకాణాల ఉండటంతో మద్యంవ్యాపారులు తమ వ్యాపారాలను లాభసాటిగా మలచుకున్నారు. బెల్ట్ దుకాణాలను మూసివేస్తే అన్ని లక్షలు ఖర్చుపెట్టి వ్యాపారం చేయటం కష్టమని వ్యాపారులు అంటున్నారు. బెల్ట్ దుకాణాలు తీసేస్తేమంటున్నారు కనుక గత లెసై న్సు ఫీజుల కంటే ఈ కొత్త పాలసీలో ఫీజు తగ్గుతుందన్న భావనలో మద్యం వ్యాపారులు ఉన్నారు. కాని రెండు శ్లాబుల్లో లెసైన్సు ఫీజును పెంచుతూ కొత్త పాలసీ ప్రకటిస్తున్నందున బెల్ట్ దుకాణాలను యాథావిధిగా నడిపే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.