
కోరుకుంటే మద్యం
4,380 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
* ఏడు శ్లాబుల్లో లెసైన్సు రుసుం వసూలు
సాక్షి, హైదరాబాద్: గ్రామాలు, హైవేలు, షాపింగ్‌మాల్స్, హైపర్ మార్కెట్లు... ఒకటేమిటి, రాష్ట్రంలో ఇక ఎక్కడ కోరుకుంటే అక్కడ మద్యం దొరుకుతుంది. తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దుచేసి, మద్యం ప్రవాహాన్ని కట్టడి చేస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి టీడీపీ ప్రభుత్వం పల్లెపల్లెలోనూ మద్యం పారించేలా, ఇంటింటికీ మద్యం చేరేలా నూతన మద్యం విధానం ఖరారు చేసింది.
రెండేళ్ల లెసైన్సు కాలపరిమితి (1 జూలై 2015 నుంచి 30 జూన్ 2017) రాష్ట్రంలోని 4,380 మద్యం షాపులకు దరఖాస్తులు కోరుతూ ఎక్సైజ్ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పది శాతం తగ్గకుండా మండలానికో ప్రభుత్వ దుకాణం నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతోపాటు షాపింగ్ మాల్స్, హైబ్రీడ్ హైపర్ మార్కెట్లలోనూ మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుంది.
గతంలో ఐదు శ్లాబులుగా ఉండే విధానాన్ని ఈ దఫా ఏడు శ్లాబులుగా పెంచారు. జనాభా ప్రాతిపదికను కుదించి లెసైన్సు రుసుం పెంచారు. ఐదు వేల జనాభా లోపు ఉన్న (మైనర్, మేజరు పంచాయతీల్లో) ప్రాంతాలకు ఓ శ్లాబు కేటాయించి రూ.30 లక్షల లెసైన్సు రుసుం విధించారు. ఒక్క శ్లాబులో (50,001-3 లక్షల జనాభా) లెసైన్సు ఫీజు రూ.3 లక్షలు తగ్గించగా, 3,00,001-5 లక్షల జనాభా ఉన్న శ్లాబులో లెసైన్సు ఫీజు యథాతథంగా ఉంచారు.
కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల్ని లాట్ల డ్రా విధానంలో కేటాయించనున్నారు. అయితే మద్యం నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ ప్రతి జిల్లాలో డీఅడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.
హైవేల పక్కనా పారనున్న మద్యం...
హైవేల పక్కన ఉన్న మద్యం షాపుల్ని తొలగించాలని రవాణా శాఖ సాగించిన లేఖలను ఎక్సైజ్ శాఖ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. 50 మీటర్ల దూరంలో షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈ మేరకు నోటిఫై చేశారు. రహదారులపై మద్యం తాగి ప్రమాదాలు జరుగుతున్న శాతం నాలుగుశాతం మాత్రమేనని ప్రభుత్వం నిర్ధారించిందని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మూడు లెసైన్సు షాపుల మధ్య ఓ ప్రభుత్వ షాపు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాటు సారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నిరోధించేందుకు టెట్రా ప్యాక్ ద్వారా మద్యం విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
దరఖాస్తు ఫీజులు.. నిబంధనలు...
♦ రూరల్ ఏరియా (బెల్ట్ ఏరియాతో సహా) రూ.30 వేలు చెల్లించాలి.
♦ మున్సిపాలిటీ/టౌన్‌లో రూ.40 వేలు, మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.50వేలు దరఖాస్తు రుసుం చెల్లించాలి.
♦ ప్రతి మద్యం సీసాపై బార్‌కోడ్ విధానం/హాలోగ్రాఫిక్ అడెసివ్ లేబుల్ విధానం అమల్లోకి తెచ్చే విధంగా షాపులో మెషినరీ ఏర్పాటు చేయాలి. ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్నందున మద్యం షాపు విధిగా కంప్యూటర్, టూ డీ స్కానర్ తదితర సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలి.
♦ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ నుంచి అలిపిరివరకు (వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఎస్వీఆర్‌ఆర్ ఆస్పత్రి, స్విమ్స్) ఏ ఒక్క మద్యం షాపు అనుమతించరు.
సిండికేట్లు ఏర్పడకుండా చర్యలు: కొల్లు
నూతన మద్యం పాలసీ ప్రకారం సిండికేట్లు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మద్యం షాపులకు దరఖాస్తు చేసేవారు ఖచ్చితంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండేళ్ల వ్యాట్ రిటర్న్స్ దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. నేటి నుంచి (23వ తేదీ) ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తుల స్వీకరణకు గడువిస్తున్నట్లు తెలిపారు. 28న స్క్రూటినీ, 29న జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి 30న ప్రొవిజనల్ లెసైన్సులు ఇవ్వనున్నట్లు వివరించారు.
బార్లకు నూతన విధానం
రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల లెసైన్సులు రద్దుచేసి కొత్త విధానం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. బార్ల లెసైన్సుల రెన్యువల్ వచ్చే నెల 1వ తేదీ నుంచి చేయాల్సి ఉంది. ఆలోపు కొత్త విధానానికి సమయం సరిపోదని అధికారులు చెప్పారు. దీంతో గత ప్రభుత్వం లెసైన్సులు మంజూరు చేసినందున వాటిని రెన్యువల్ చేయకుండా మూడు నెలల పాటు పొడిగించి, ఆలోగా కొత్తవారికి బార్ల లెసైన్సుల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన నూతన మద్యం విధానంపై జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది శ్లాబులు..
జనాభా ప్రాతిపదిక లెసైన్సు ఫీజు
5 వేల లోపు రూ.30 లక్షలు
5,001-10 వేల లోపు రూ.34 లక్షలు
10,001-25 వేల లోపు రూ.37 లక్షలు
25,001-50 వేల లోపు రూ.40 లక్షలు
50,001-3 లక్షల లోపు రూ.45 లక్షలు
3,00,001-5 లక్షల లోపు రూ.50 లక్షలు
5 లక్షలు ఆపై రూ.65 లక్షలు