నవ తెలంగాణ నిర్మాణమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలు ఆత్మగౌరవంతో జీవించగలిగిన నూతన తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పనిచేస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తెలంగాణలో ఏ రంగంలోనైనా అగ్రవర్ణాలకు 10 శాతం మించి ప్రాతినిధ్యం దక్కకూడదని, 90 శాతం ప్రజలకు 90 శాతం ప్రాతినిధ్యం తప్పనిసరిగా లభించే ప్రణాళికతో ముందుకెళతామని చెప్పారు. ఇందుకోసం తమ మార్గంలో కలిసొచ్చే వారితో కలిసి ముందుకు నడుస్తామన్నారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ (టీజేయూ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో కృష్ణమాదిగ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
సామాజిక తెలంగాణ కావాలి
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలపై కొనసాగిన వివక్ష, ఆర్థిక దోపిడీలేని సామాజిక తెలంగాణ మాకు కావాలి. ఆ వర్గాలకు తెలంగాణ సంపదలో న్యాయమైన వాటా ఉండాలి. వ ర్గీకరణే లక్ష్యంగా ఏర్పడిన ఎంఆర్‌పీఎస్ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపించకపోయినా సహాయకారి పాత్రను పోషించాం. మేం అణగారిన కులాల అంశాన్ని చర్చకు తీసుకురాకపోతే ఒక రె డ్డి పోయి ఇంకో జానారెడ్డి వచ్చి కూర్చుంటాడు. ఎర్రజెండా అభిమానిగా, అంబేద్కర్ ఆశయ సాధన కార్యకర్తగా వర్గరహిత, కులరహిత సమాజాన్ని కోరుకుంటాను. నేను మావోయిస్టు, జనశక్తి, న్యూడెమొక్రసీ అభిమానిని మాత్రమే. సీపీఐ, సీపీఎంలలో కరడుకట్టిన కులతత్వం ఉంది.. వాటిని నమ్మను.
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు సరిగానే స్పందించారు. కానీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాత తాను ఎక్కడ వెనుకబడిపోతానోననే గందరగోళం ఆయనలో ప్రారంభమై కిరణ్ నడిచిన దారిలోనే నడుస్తున్నారు. ఆయన రెండు నాల్కల ధోరణి వీడి 2008లో పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయమ్మ తెలంగాణను అడ్డుకునేందుకు పనిచేస్తున్నారు. సీమాంధ్ర నేతల ఉద్యమానికి రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి ఇక్కడి నుంచి ఖాళీ చేయాల్సిన నాయకులు అక్కడ సీట్లు ఖరారు చేసుకోవటం. రెండోది కనీసం హైదరాబాద్‌నైనా కాపాడుకుందామనే ఉద్దేశం. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలనే చర్చను స్వాగతిస్తున్నాం. కానీ ముందు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగపరంగా పూర్తయ్యేందుకు సహకరించాలి. సీమాంధ్రలో ఉన్న అంబేద్కర్‌వాదులు సమైక్య రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనవద్దని పిలుపునిస్తున్నాం.
దళితుడిని సీఎం చేసే స్థాయి కేసీఆర్‌కు లేదు
దళితుల వర్గీకరణ జరగకపోతే తెలంగాణ ఏర్పాటైనా మాది గలకు న్యాయం జరగదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వర్గీకరణ కావాల్సిందే. కేసీఆర్‌తో సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నా ఆయనకు కష్టకాలంలో అండగా నిలబడ్డా. దళితుడిని సీఎం చేసే శక్తి, స్థాయి కేసీఆర్‌కు లేవు. ప్రధాని మన్మోహనే అయినా పెత్తనమంతా సోనియాదే. అదే తీరులో దళితుడిని సీఎం చేసి తాను సలహాదారుగా ఉంటానని కేసీఆర్ చెప్తున్నారు. అంటే సూపర్‌పవర్ నీ చేతిలో.. పవర్‌లేని సీఎం పోస్టు మాకా? అది మాకు అవసరం లేదు. 2014లోపు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతోపాటు ద క్షిణాది రాష్ట్రాల్లో విస్తరించే ప్రయత్నం చేస్తాం. అణగారిన కులాలన్నింటినీ ఒకే రాజకీయ వేదికపైకి తెస్తాం.