నేటి నుంచి కొత్త బడి గంటలు
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల పనివేళల పెంపు అంశంపై కొద్దిరోజులుగా సాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల మేరకు సవరించిన పనివేళలను శనివారం నుంచి పాటించాలని ప్రధానోపాధ్యాయులకు తాజాగా విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
విద్యాహక్కు చట్ట ప్రకారం బడిగంటల పెంపు ప్రతిపాదన విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఉంది. ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించకపోవడంతో అమలులో జాప్యం జరిగింది. తాజాగా వచ్చిన ఆదేశాల మేరకు సవరించిన సమయాలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని, ప్రధానోపాధ్యాయులు పాటించాలని విద్యాశాఖ అధికారి జి.కృష్ణారావు శుక్రవారం ఆదేశించారు.
ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు ఒక్కో రకంగా ఉన్నాయి. కొత్తగా అన్ని పాఠశాలలు ఒకే సమయానికి ప్రారంభమై ఒకే సమయానికి విద్యార్థులను విడిచి పెట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థులను విద్యాహక్కు చట్టం ప్రకారం విడిచి పెట్టాలి. ఈ పనివేళలను ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని కేంద్రీ య విద్యాలయం, నవోదయ, ఆదర్శ, సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్నాయి. కేవలం రాష్ట్రప్రభుత్వం పరిధిలోని మండల,జిల్లాపరిషత్ పాఠశాలలు అమలు చేయడం లేదు.
టీచరు-బోధన కాలం
ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తరగతులు బోధించడానికి రోజుకు ఏడున్నర గంటల చొప్పున వారానికి 45 గంటల సమయాన్ని కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి ఏడాదికి 800 గంటలు, ఉన్నత పాఠశాలల్లో ఒక 1,000 గంటలు కేటాయించాలని చట్టం పేర్కొంది.
స్టడీ మెటీరియల్, గైడ్లకు గుడ్‌బై
పాఠశాలల్లో గైడ్లు, మెటీరియల్‌కు స్వస్తి చెప్పాలని విద్యాహక్కు చట్టం చెబుతున్న నేపథ్యంలోనే నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం పాఠశాల పనివేళలు పెంచుతున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు తమకు అర్ధంకాని అంశాలను స్పష్టంగా తెలుసుకునేందుకు అదనపు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. కళావిద్య, నైతిక విద్య, పనివిద్య, ఆటపాటలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిది పీరియడ్ల స్థానంలో మరో పీరియడ్ ఆదనంగా చేరుతుంది. ఉన్నత పాఠశాల స్థాయిలో వారానికి ఉన్న 48 పీరియడ్లు కాస్త 54కు పెరిగాయి.