చిన్నారిని మింగిన సంప్ ప్రభుత్వ స్కూలులో దుర్ఘటన
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం అభం శుభం తెలియని ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. తెరిచి ఉన్న సంపు మూడేళ్ల చిన్నారిని మింగేసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లాకు చెందిన చింతకుట్ల మరియాదాస్, అన్నమ్మ దంపతులు మూడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి, ఖానామెట్ ఇజ్జత్‌నగర్ వీకర్ సెక్షన్‌లో ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు దీక్షిత, రాబర్ట్ (3) ఉన్నారు. భర్త నోవాటెల్‌లో లాండ్రీ పనులు చేస్తుండగా, భార్య హైటెక్స్‌లో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు.
బుధవారం తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా, దీక్షిత ఇంటి పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్లింది. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో అక్కతో పాటే రోజూ స్కూలుకు వెళ్లే రాబర్ట్ బుధవారం కూడా వెళ్లాడు. మధ్యాహ్నం 12కి భోజనానికి ఇంటికి వచ్చారు. అయితే, మూత్ర విసర్జన కోసం బటయకు వెళ్లిన బాలుడు ఆడుకుంటూ వెళ్లి పాఠశాల ఆవరణలోని సంపులో పడి చనిపోయాడు. గంట తర్వాత చూసిన స్థానికులు బయటకు తీసి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కొత్తగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలి పారు.
దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలోని సంపుపై మూత ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పలువురు నేతలు పరామర్శించారు. కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ యాదవ్ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. వైఎస్సార్‌సీపీ శేరిలింగంపల్లి కన్వీనర్ ఓ. శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నేతలు నర్సింహ యాదవ్, వార్డు కమిటీ సభ్యుడు రాధాకృష్ణ యాదవ్ బాధితులను పరామర్శించారు.