నయాసాల్ ఆగయా.. | new year coming | Sakshi
Sakshi News home page

నయాసాల్ ఆగయా..

Published Wed, Jan 1 2014 12:25 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

new year coming

2013 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి.. కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికారు జిల్లా ప్రజలు. మంగళవారం రాత్రి 11.55 గంటలకు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. 11.59 నిమిషాలు పూర్తయి అర్ధరాత్రి 12 గంటలు కాగానే పట్టరాని ఆనందంతో హ్యాపీ న్యూఇయర్ అంటూ పెద్దపెట్టున నినదించారు. కేక్‌లు కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. మహిళలు ఇళ్లముందు రంగు రంగుల ముగ్గులు వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. చిన్నారులు, యువత ఎగిరి గెంతులేశారు. అక్కడక్కడా విద్యార్థులు, యువకులు బైక్‌లపై తిరుగుతూ హ్యాపీ న్యూఇయర్ తెలిపారు.

బిల్డింగ్‌లపై డీజేలు ఏర్పాటు చేసుకొని డ్యాన్స్‌లు చేశారు. టపాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మద్యంప్రియులు బాటిళ్లు తెరిచి చీర్స్ చెప్పారు. అప్పటికే సిద్ధం చేసుకున్న వంటకాలను విందు సందర్భంగా ఆరగించారు. ఒకరినొకరు ఫోన్లు చేసుకుని విష్ చేసుకున్నారు. అందరు మొబైల్స్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పేందుకు ప్రయత్నించగా నెట్‌వర్క్ బిజీ రావడంతో ఫోన్లు కలవలేదు. దీంతో కొందరు తమ మిత్రులు, బంధువులకు సకాలంలో గ్రీటింగ్స్ చెప్పలేకపోయామంటూ కాస్త నిరుత్సాహపడ్డారు. మొత్తానికి నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి.         
 
 ఆనంద నిలయంలో హరీష్..
 సిద్దిపేట టౌన్: ఎమ్మెల్యే టి.హరీష్‌రావు నూతన సంవత్సరం వేడుకలను హాస్టల్ విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. ఆయన సతీమణి శ్రీనిత, పిల్లలు అర్చిశ్మన్, వైష్ణవిలతో కలిసి మంగళవారం రాత్రి స్థానిక ప్రభుత్వ బాలికల వసతి గృహాల ప్రాంగణంలోని ‘ఆనంద నిలయానికి వచ్చారు. తన కూతురుతోపాటు అక్కడి విద్యార్థినులచే కేట్‌కట్ చేయించారు. సొంతంగా ఖరీదు చేసిన బ్లాంకెట్లు, స్వెట్టర్లను వారికి అందజేశారు.  పిల్లలతో మాట్లాడిన ఎమ్మెల్యే దంపతులు వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. నీళ్లు, డైనింగ్ హాల్ కొరత ఉందని చెప్పడంతో వెంటనే స్పందించిన ఆయన నల్లా కనెక్షన్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. త్వరలో బోరు వేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. రూ.30 లక్షలతో డైనింగ్ హాల్ కట్టిస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక ఎస్‌ఎం హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ నేత శేషుకుమార్, ఏఎస్‌డబ్ల్యూఓ వసంత, వసతి గృహ సంక్షేమాధికారులు అనూరాధ, అరుణ తదితరులు పాల్గొన్నారు.  
  సందడే సందడి..
 సిద్దిపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందడిగా మారింది. పట్టణంలో కేకులు, కూల్‌డ్రింక్‌లు, స్వీట్ హాట్ల కోసం బేకరీల్లో, ఇతర దుకాణాల్లోనూ మరోవైపు కిక్కు కోసం మద్యం షాపుల్లోనూ కస్టమర్ల తాకిడి జోరందుకుంది. మాంసం కొనుగోళ్లు కూడా భారీగానే జరిగాయి. పలువురు వ్యాపారులు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నారు. కొందరైతే ఆటోల్లో మైకులు పెట్టి మరీ ప్రచారం చేశారు. సరంజామాను ముందుగానే సమీకరించుకొని తమ తమ ‘అడ్డా’ల్లో అనేక మంది ‘పార్టీ’ల్లో మునిగితేలారు. శ్రమజీవులు మొదలుకొని సంపన్నుల వరకూ సంబరాల్లో భాగస్వాములయ్యారు. అనుభవాలు, ఆలోచనలు, కొంగొత్త వసంతంలో అధిగమించాల్సిన లక్ష్యాలపై అప్పటిదాకా కబుర్లతోనూ, ఆయా రుచులను ఎంజాయ్ చేస్తూ గడిపిన వారంతా... సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు దాటి తేదీ మారగానే ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు.

  మెదక్ టౌన్: న్యూ ఇయర్ వేడుక లను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం నుంచే కేక్‌ల కొనుగోలుదారులతో బేకరీలు కిటకిటలాడాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్‌ఐని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి గురువులు దైవ సందేశమిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చి ప్రాంగణంలో భక్తులు ఒకరినొకరు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోకి యువత చేరుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల యువకులు డీజేలు, డీటీఎస్ సౌండ్లు ఏర్పాటు చేసుకొని కేరింతలు కొట్టారు. పలు పాఠశాలల్లో మంగళవారం ముందుగానే నూతన సంవత్సర కేక్‌లు కట్ చేశారు. వేడుకల సందర్భంగా చికెన్, మటన్‌షాపులు, మద్యం దుకాణాలు, స్వీట్ హౌస్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
 కష్టపడి చదవాలి: ఆర్డీఓ
 మెదక్ ఆర్డీఓ వనజాదేవి మంగళవారం రాత్రి పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బాలసదనం బాలికల వసతి గృహ విద్యార్థుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి అందరికి అందజేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమాజంలోని గొప్పవారంతా ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో చదువుకున్న వారేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement