టీడీపీలో కొత్తరకం విభేదాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే జిల్లా టీడీపీలో కొత్తరకం విభేదాలు మొదలయ్యాయి. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు సామాజికవర్గ చీలకగా రూపాంతరం చెందాయి. దీనికి కూడా కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడులే కేంద్ర బిందువులుగా నిలిచారు. జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం ఈ కుమ్ములాటలు మొదలయ్యాయి. జిల్లాలో ప్రధాన వర్గాలైన కాళింగ, కాపు, వెలమలకు పదవుల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలని ఎవరికి వారే అధిష్టానం వద్ద పట్టు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్, ఎంపీపీ, జెడ్పీ పదవుల కేటాయింపుపై చర్చించేందుకు రెండు రోజుల్లో జిల్లా టీడీపీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో జిల్లాపరిషత్‌తోపాటు, నాలుగు
మున్సిపాలిటీలు, 38 మండల పరిషత్తుల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఎన్నికలు జరగనుండటంతో టీడీపీ నేతలు ఎవరికి వారు ఆ అభ్యర్థిత్వాల కోసం పోటీ పడుతున్నారు.
త్వరలో సమావేశం!
జెడ్పీ అధ్యక్ష పదవికి పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ భార్య ధనలక్ష్మి పేరును అధినేత చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. ఈ వర్గం మంత్రి అనూయాయులన్నది తెలిసిందే. కింజరాపు వైరి వర్గంగా ఉన్న సీనియర్ నేత, ఎమ్మెల్యే కళా వెంకట్రావు వర్గానికి ఇప్పటివరకు ఎలాంటి పదవులూ దక్కలేదు. కాళింగులకు జెడ్పీ కుర్చీ, వెలమలకు మంత్రి పదవి కట్టబెడితే మరి మాకేంటి అంటూ కాపు సామాజిక వర్గం ఇప్పటికే అధిష్టానంపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో వీరఘట్టం, సంతకవిటి ప్రాంతాలకు చెందిన మహిళా జెడ్పీటీసీలు తమకు జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు ఇప్పించాలని కళా వెంకట్రావును కోరు తున్నారు.
పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సమన్వయ కార్యదర్శి పదవిలో ఉన్న మరో సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు కూడా తమ వారికే జెడ్పీ కుర్చీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే సమావేశం కీలకం కానుంది. తమ వారికి అన్యాయం జరిగితే పార్టీకి రాజీనామాకైనా సిద్ధమేనంటూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ సమావేశంలో ఎలాగైనా అచ్చెన్న వర్గానికి చెక్ చెప్పాలని ఆలోచిస్తున్నారు.
వైస్‌కూ పోటీయే
జెడ్పీ అధ్యక్ష పీఠం కాకపోతే కనీసం ఉపాధ్యక్ష పదవైనా తమకివ్వాలని కొంతమంది తమ్ముళ్లు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే సామాజిక వర్గాల సమీకరణల దృష్ట్యా వంగర జెడ్పీటీసీకి ఈ పదవి ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఆ జెడ్పీటీసీ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, లక్ష్మీపేట కేసులో నిందితుడిగా ఉన్న అతనికి పదవి కట్టబెడితే ఊరుకునేది లేదని ఆయన వ్యతిరేకవర్గం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఇంత జరుగుతున్నా పార్టీలో లుకలుకలు లేనేలేవని టీడీపీ నేతలు కొట్టిపడేస్తున్నారు. సమావేశంలో చర్చించి మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామంటున్నారు. మొత్తం మీద కీలకంగా మారిన ఈ సమావేశం ఎలా జరుగుతుందో.. ‘స్థానిక’ పదవుల చిచ్చు పార్టీలో ఎంత అసమ్మతి రాజేస్తుందోన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.