ఎన్నికై ఏం లాభం? | Newly elected sarpanch's disappointed | Sakshi
Sakshi News home page

ఎన్నికై ఏం లాభం?

Published Thu, Aug 29 2013 1:01 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

Newly elected sarpanch's disappointed

యాచారం, న్యూస్‌లైన్: బాధ్యతలు చేపట్టిన సంతోషం సర్పంచ్‌లకు మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అధికారాలు, హక్కుల గురించి తెలుసుకుని ఉత్సాహంగా అభివృద్ధి పనులు చేపట్టడానికి సిద్ధమైతే... పంచాయతీ కార్యదర్శులు సహకరించడం లేదని వాపోతున్నారు. ఎన్నికై నెలరోజులు దాటినా పంచాయతీ రికార్డులు అందకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకూ జాయింట్ చెక్‌పవర్ కల్పించింది.  దీంతో కార్యదర్శులు తమను చిన్నచూపు చూస్తున్నారని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
రికార్డులు ఇవ్వడంలో కార్యదర్శులు జాప్యం చేస్తున్నారని, మరీ పట్టుబడితే అవసరమైన సమాచారం ఇస్తామని చెబుతున్నారని సర్పంచ్‌లు అంటున్నారు. పంచాయతీల వ్యయం, ఆదాయం, మిగులు నిధుల గురించి తెలియక.. ఏ పనీ చేపట్టలేక ఉత్సవ విగ్రహాల్లా మారాల్సి వస్తోందని వాపోతున్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల సర్పంచ్‌లు ఆగస్టు 2న బాధ్యతలు చేపట్టారు. వీరికి బాధ్యతలు, అధికారాలు, హక్కుల గురించి తెలియజేసిన అధికారులు... రికార్డులు అందజేయించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించారు.
 
నిధులు ఎన్ని ఉన్నాయో తెలియక, ఉన్నా జాయింట్ చెక్‌పవర్‌తో వాటిని డ్రా చేసుకునే సొంత అధికారం లేక సర్పంచ్‌లు గింజుకుంటున్నారు. గ్రామాల్లో జోరుగా జరుగుతున్న బోనాల ఉత్సవాల కోసం పలువురు సర్పంచ్‌లు సొంత డబ్బులు వెచ్చించి వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. అలాగే పంచాయతీ కార్మికులకు జీతాలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు కూడా  సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా మండలంలోని 20 గ్రామాల్లో సర్పంచ్‌లు రూ.20 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది.
 
ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తాం....
రికార్డులు అప్పజెప్పడం లేదని సర్పంచ్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే... పంచాయతీ కార్యదర్శులు మాత్రం పాలనా వ్యవహారాలు చూసేది తామేనని, పైగా జాయింట్ చెక్‌పవర్ కూడా ఉందనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పంచాయతీ వ్యవహారాలకు సంబంధించి ఖర్చుల వివరాలను ఆడిట్ చేయించలేదని, రికార్డులను ఇస్తే తమకు ఇబ్బందులవుతాయని... ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తామంటూ పంచాయతీ కార్యదర్శులు తిప్పుకుంటున్నారని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు.
 
కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు  
సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు తీసుకొని నెలరోజులు దాటినా రికార్డులు ఇవ్వకపోవడమంటే మమ్మల్ని అవమానపర్చడమే. నాకు రికార్డులు కాదు కదా కనీసం  కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు. పంచాయతీలో ఎన్ని నిధులున్నాయో తెలియడం లేదు. సొంత ఖర్చులతో వీధి లైట్లు బిగిస్తున్నా. 
 - రామానుజమ్మ, సర్పంచ్. తమ్మలోనిగూడ
 
రికార్డులు వెంటనే అందజేసేలా చూస్తా
మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీల రికార్డులు సర్పంచ్‌లకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటా. సర్పంచ్‌ల ఆదేశాల మేరకే కార్యదర్శులు పనిచేయాల్సి ఉంటుంది. వెంటనే బదిలీపై వెళ్లిన కార్యదర్శులను పిలిపించి మాట్లాడుతా. రికార్డులను సర్పంచ్‌లకు అందజేయాలని ఆదేశిస్తా.
 - శంకర్‌నాయక్, ఈఓఆర్డీ, యాచారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement