విభజన సెగలు
Published Wed, Feb 12 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
సాక్షి, కాకినాడ :తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే ఘడియలు దగ్గరపడడంతో జిల్లావ్యాప్తంగా విభజన సెగలు ఎగసిపడుతున్నాయి. ఏపీ ఎన్జీఓలు చేస్తున్న నిరవధిక సమ్మెలోకి ప్రభుత్వ శాఖలన్నీ ఒక్కొక్కటిగా చేరుతున్నాయి. ముఖ్యంగా అత్యవసర సేవలందించే వైద్యులు, వైద్య సిబ్బంది సమ్మెబాట పట్టడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీఓలు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. నిరవధిక సమ్మె ఆరో రోజుకు చేరుకోగా, మంగళవారం ప్రభుత్వ డ్రైవర్లు, ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది సమ్మెబాట పట్టారు. బుధవారం నుంచి జిల్లాలో సహకార శాఖతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.
జిల్లా కేంద్రమైన కాకినాడలో ఏపీఎన్జీఓ సంఘ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ఏపీ ఎన్జీఓలు భారీర్యాలీ నిర్వహించారు. ఇంద్రపాలెం వంతెన సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మౌనదీక్ష చేశారు. బైకులపై ర్యాలీగా వెళ్లి థియేటర్లను మూయించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఏపీ ఎన్జీఓలు బైకు ర్యాలీగా వెళ్లి నగరంలోని పెట్రోల్ బంకులు, థియేటర్లు మూయించి వేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఉద్యానవన శాఖ కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండడంతో ఏపీ ఎన్జీఓలు వారిని బయటకు పంపి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
సెంట్రల్ జైలు నిర్వహిస్తున్న పెట్రోల్‌బంక్‌ను మూసేందుకు అంగీకరించకపోవడంతో, నిర్వాహకులకు, ఎన్జీఓలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు ప్రజారోగ్య శాఖ సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తుండగా, వారిని కూడా బయటకు పంపించి వేశారు. యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం దారుణమంటూ కోనసీమ ఏయూ పూర్వ విదార్థుల సంఘం ఆధ్వర్యంలో జేఏసీ చైర్మన్ బండారు రామ్మోహనరావు తదితరులు అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో రాస్తారోకో చేశారు. విభజన బిల్లును వ్యతిరేకిస్తూ మామిడికుదురులో రాజకీయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగులు రాస్తారోకో చేశారు. ముమ్మిడివరంలో ఎన్జీఓలు నిరసన దీక్షలు చేపట్టారు. కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్‌లో ఉద్యోగులు ధర్నా చేశారు. ధవళేశ్వరంలో ఎన్జీఓలు నిరసన దీక్షలు చేపట్టారు. ఏలేశ్వరంలో మండల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
నిలిచిన వైద్య సేవలు
వైద్యులు, సిబ్బంది మంగళవారం నుంచి విధులు బహిష్కరించడంతో కాకినాడ జీజీహెచ్‌తో పాటు రాజమండ్రి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రిలో రోగులు ఇబ్బంది పడ్డారు. అత్యవసర సేవలు మినహాయించి అవుట్ పేషెంట్ విధులు బహిష్కరించడమే కాకుండా ప్రధాన ద్వారాలను మూసివేసి ధర్నాలకు దిగారు. ఓపీ విభాగం వెలవెలబోయింది. నిత్యం కాకినాడ జీజీహెచ్ ఓపీ విభాగానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు మూడు వేల మంది రోగులు వస్తుంటారు. మంగళవారం ఓపీ గదుల తాళాలు కూడా తీయకపోవడంతో నిర్మానుష్యంగా మారింది.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు. అత్యవసర విభాగానికి రోగులు పోటెత్తడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారిని అదుపు చేయడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆపరేషన్లు కూడా వాయిదా వేయడంతో థియేటర్లు కూడా మూతపడ్డాయి. వార్డుల్లో పేషెంట్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులో లేక ఇన్ పేషెంట్లు ఇక్కట్ల పాలయ్యారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించాలని ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్
పిలుపునిచ్చారు.
Advertisement