బ్యాంకింగ్.. బ్రేక్!
ఒక రోజు సమ్మెలో ఐదు వేల మంది ఉద్యోగులు
ఎక్కడికక్కడ స్తంభించిన కార్యకలాపాలు
జిల్లాలో మూతపడిన 525 శాఖలు
నిలిచిపోయిన రూ.600 కోట్ల లావాదేవీలు
కాకినాడ :బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు సమ్మెతో జిల్లాలో మంగళవారం బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పదో ద్వైపాక్షిక వేతన ఒప్పందం చేయాలన్న డిమాండ్‌తో, యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ, పలు ప్రైవేటురంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మేనేజర్ నుంచి స్వీపర్ వరకూ అన్ని తరగతుల ఉద్యోగులూ విధులు బహిష్కరించారు. దీంతో జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 525 పైగా బ్రాంచిలు మూతపడ్డాయి.
సుమారు రూ.600 కోట్ల మేర లావాదేవీలు స్తంభించిపోయాయి. న్యూ జనరేషన్ ప్రైవేటు బ్యాంకులైన
ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్ర మినహా దాదాపు అన్ని బ్యాంకుల ఉద్యోగులూ సమ్మెబాట పట్టారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రి ఇన్నిస్‌పేట ఆంధ్రాబ్యాంక్ వద్ద, అమలాపురం ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయంవద్ద నిరసన తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డులోని ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి యుటైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ కన్వీనర్ కె.ఆదినారాయణమూర్తి మాట్లాడారు.
వేతన ఒప్పందం కోసం బ్యాంకు ఉద్యోగులు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారన్నారు. రోజురోజుకూ ధరలు పెరుగుతున్నా ఎదుగుదల లేని జీతాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పదో ద్వైపాక్షిక వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నేతలు పీవీ రమణమూర్తి, దేవదాసు, రాజేంద్రనాథ్, వీఎస్‌ఎన్ మూర్తి, త్రిమూర్తులు, శ్రీనివాసరావు, నరసింగరావు, పాండురంగారావు, ఆర్‌ఎస్ ప్రసాద్, శ్యామ్‌మోహన్, దుర్గాప్రసాద్, గణేష్, వెంకట్రావు, నరసింహమూర్తి, సుధ, సమీర, అరుణ, అరుణ్‌కాంత్ తదితరులు నాయకత్వం వహించారు.