సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని గ్రామ సభలు పెట్టినా ప్రజలకు ఉపయోగం ఏంటని సీపీఎం మండల కార్యదర్శి ...
జి.కొండూరు : సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని గ్రామ సభలు పెట్టినా ప్రజలకు ఉపయోగం ఏంటని సీపీఎం మండల కార్యదర్శి బురుసు శివ అధికారులను నిలదీశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జన్మభూమి గ్రామ సభ నిర్వహించారు.సభలో పింఛన్‌లు,రేషన్ కార్డులు,పక్కా ఇళ్లు ఎక్కడ పంపిణీ చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. గత రెండు జన్మభూమి కార్యక్రమాల్లో పెట్టిన అర్జీలకే ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోయింద ని బురుసు శివ అధికారులపై ధ్వజమెత్తారు. 20ఏళ్లుగా గ్రామంలో నివేశన స్థలాలు సమస్య ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి దేవినేని ఉమా తాము అధికారంలోకి వస్తే నివేశన స్థలాలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు.
రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీ మాయగానే మిగిలిందని ధ్వజమెత్తారు.హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోవటం లేదన్నారు.ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించిన నాథుడే లేరని వాపోయారు.గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమి గొల్లవాని కుంటలో నివేశం ఉంటున్న వారికి అధికారులు కనీస సౌకర్యాలు కల్పించటం లేదన్నారు.నివేశన స్థలాలు పంపిణీకి స్థలాల కొరత ఉందని చెబుతున్న ప్రభుత్వం జి+2 ఇళ్లు ఏలా కట్టిస్తుందని అధికారులు చెబుతున్నారని తహశీల్దార్ కె.సుధారాణిని ప్రశ్నించారు..అయితే పొలీసులు మాట్లాడింది చాలు అంటూ శివను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.దీంతో ఆ పార్టీ నేతలు ,పొలీసులు,జన్మభూమి కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రభుత్వం లోటు బడ్జెట్ ఉందని చెపుతూ పథకాలకు సక్రమంగా నిధులు కేటాయించకపోవటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.కొత్తగా మంజూరు చేస్తున్న గృహ నిర్మాణాలకు సబ్సిడీ పేరుతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటూ మెలిక పెడుతుండడం వలన లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు.మరుగుదొడ్లు నిర్మాణాలకూ ఇదే పరిస్థితి అన్నారు.
జెడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య మాట్లాడుతూ సాగర్ జలాలు రాక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు.కోట్లు వెచ్చించి పట్టిసీమ నీళ్లు తెచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం పక్కనే ఉన్న తారక రామ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయిందో ఆ శాఖకు మంత్రిగా ఉన్న ఉమాకే తెలియాలన్నారు.అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కెడీసీసీ బ్యాంకు జిల్లా ఉపాధ్యక్షుడు వేములకొండ రాంబాబు సూచించారు.ప్రభుత్వ పథకాల పై ఏఎంసీ చైర్మన్ ధనేకుల బుల్లిబాబు మాట్లాడారు.ఫించన్‌లు కూడ ప్రాధాన్యత క్రమంలో ఇవ్వటం లేదని వార్డు సభ్యుల అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు బట్టపర్తి రాజు ఎంపీడీవో జ్యోతిబసుకు విన్నవించారు.అనంతరం కొత్తగా మంజూరైన రేషన్,పాసుపుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.పినపాక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మరుగుదొడ్లు బిల్లులు మంజూరు కావటం లేదని అధికారులను నిలదీశారు. సర్పంచ్‌లు అంజన,స్వామిదాసు పాల్గొన్నారు.