
నవ వధువు హత్య
పుట్లూరు, న్యూస్‌లైన్ : అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని మద్దిపల్లి సమీపాన అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో దోపిడీ దొంగలు పేట్రేగి పోయారు. అనంతపురం నుంచి తిమ్మంపల్లికి వెళ్తున్న నవ దంపతులను మార్గం మధ్యలో అటకాయించి వధువును చంపేశారు. మృతురాలి భర్త కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిమ్మంపల్లికి చెందిన చంద్రశేఖర్‌కు పామిడి మండలం అయ్యవారిపల్లికి చెందిన రాజేశ్వరికి ఆగస్టు 17న వివాహం అయింది.
అనంతపురంలోని రాజేశ్వరి చిన్నమ్మ ఇంటికి శుక్రవారం వెళ్లిన వీరు తిరిగి శనివారం సాయంత్రం స్వగ్రామానికి బైక్‌లో బయల్దేరారు. మద్దిపల్లి సమీపంలో వున్న యల్లుట్ల ఫారెస్టు వద్ద తాగునీరు కావాలంటూ ఓ వ్యక్తి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయినట్లు నటించి వీరి వాహనాన్ని ఆపాడు. దగ్గరకు వచ్చిన చంద్రశేఖర్‌పై ఒక్కసారిగా దాడి చేశాడు. పక్కనే కాపుకాచిన మరో ఐదుగురు దొంగలు నగల కోసం రాజేశ్వరిని వెంబడించడంతో ఆమె అటవీ ప్రాంతంలోకి పారిపోయింది.
భయాందోళనకు గురైన చంద్రశేఖర్‌రెడ్డి మద్దిపల్లి గ్రామం వైపు పరుగులు తీశాడు. ఆ మార్గంలో ఆటోలు వచ్చినా ఎవరూ ఆపకపోవడంతో అతను గ్రామానికి వెళ్లి జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. వెంటనే గ్రామస్తులంతా అట వీ ప్రాంతంలోకి వెళ్లగా అప్పటికే రాజేశ్వరి గొంతుకు తాడుతో బిగించి చంపి.. ఆమె మెడలో, ఒంటిపై వున్న 12 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. సీఐ రాఘవన్, ఎస్‌ఐ వెంకట శ్రీహర్ష సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. కాగా భార్యపై దుండగులు దాడి చేస్తుంటే భర్త ప్రతిఘటించక పోవడం, అతడికి చిన్న గాయం కూడా కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.