సాక్షి, అనంతపురం : అధికారుల నిర్లక్ష్యంతో నిర్మల్ భారత్ అభియాన్ ప్రాజెక్టు అమలు తీరు జిల్లాలో అధ్వానంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా వాటిని ఖర్చు చేయడంలో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఈ పథకం అమల్లో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే జిల్లా అధికారుల తీరు ఏవిధంగా వుందో అర్థం అవుతుంది. పథకం అమలులో అట్టడుగు స్థానంలో ఉన్న జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకురావాలని నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు.
ఇప్పటికైనా మెరుగైన ఫలితాలు కన్పించాలని అందుకు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ వెంటనే స్పందించి మండల స్థాయి అధికారులు గ్రామాల బాట పట్టి వ్యక్తిగత మరుగుడొడ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులను గుర్తించడంతో పాటు వెంటనే పనులు కూడా వేగవంతం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి అధికారులు సీరియస్‌గా తీసుకోవడంతో కలెక్టర్ సైతం అదే స్థాయిలో కింది స్థాయి అధికారులపై ఒత్తిడి పెంచారు.
ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి లబ్ధిదారుని వాటా కింద రూ.900 చెల్లిస్తే ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.9100 మంజూరు చే స్తుంది. అయితే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి డ్వామా పరిధిలో పనిచేస్తున్న ఏపీఓలు లబ్ధిదారుల జాబితాను వ్యక్తిగతంగా పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత లబ్ధిదారునికి మంజూరు పత్రం ఇస్తారు. అయితే చాలా మండలాల్లో పని చేస్తున్న ఏపీఓలు గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో మరుగుదొడ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పరువు తీసిన మరుగు
Published Thu, Jan 23 2014 2:17 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement